Parliament Session: ఇటీవలే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగిసిన సంగతి తెలిసిందే. ఈ లెక్కన మళ్లీ పార్లమెంట్ సమావేశాలు వచ్చే శీతాకాలంలోనే జరగాలి. కానీ, అనూహ్యంగా సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని బీజేపీ ప్రభుత్వం నిర్ణయించింది. దీని వెనుకు బీజేపీ వ్యూహం ఏంటి..? ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమవుతోందా..?
సెప్టెంబర్‌లో ఐదు రోజులపాటు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు జరుగుతాయని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రకటించారు. ఉన్నట్లుండి సమావేశాలు ప్రకటించడం వెనుక కారణాలు ఏమై ఉంటాయన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. దీనికి రాజకీయకారణాలే ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు. సాధారణంగా ఒక ఏడాదిలో రెండుసార్లు సమావేశాలు నిర్వహించేందుకే ప్రభుత్వం ఆసక్తి చూపదు. అలాంటిది పార్లమెంట్ సమావేశాలు ముగిసిన నెల తర్వాత వెంటనే మరోసారి సమావేశం నిర్వహించడం ఆసక్తికర అంశమే. ముఖ్యమైన అంశం, సంచలన నిర్ణయాలు ఉంటే మాత్రమే ఇలా వెంటవెంటనే సమావేశాలు నిర్వహిస్తుంటారు. అలాంటిది సెప్టెంబర్ సమావేశాల వెనుక కీలకమైన అంశాలే ఉండుంటాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ప్రస్తుతం దేశంలో బీజేపీకి పరిస్థితులు అంత అనుకూలంగా లేవు. అధికారంలోకి వస్తామని ధీమా ఉన్నప్పటికీ.. గతంలోలాగా భారీ మెజారిటీ సాధించే అవకాశాలైతే లేవు. కర్ణాటక, తెలంగాణ, ఏపీ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ వంటి చోట్ల బీజేపీ సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యే ఛాన్స్ ఉంది. ఇతర చోట్ల కూడా ప్రతిపక్షాల నుంచి గట్టిపోటీ ఎదురవుతోంది. దేశంలోని ప్రధాన పార్టీలు ఇండియా పేరుతో కూటమిగా ఏర్పడ్డ సంగతి తెలిసిందే. ఈ కూటమి ఇటీవలి కాలంలో బలపడుతున్నట్లే కనిపిస్తోంది. ఈ అంశం బీజేపీని ఆందోళనకు గురి చేస్తోంది. పైకి ఎంతగా ఇండియా కూటమిని విమర్శిస్తున్నా.. లోలోపల మాత్రం బీజేపీ ఆందోళనగానే ఉంది. ఇండియా కూటమికి ఆదరణ పెరుగుతుండటంతో ప్రజల దృష్టి మరల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని కొందరి అభిప్రాయం.
ముందుస్తు ఎన్నికల వ్యూహమా..?
వచ్చే జనవరిలోపు తెలంగాణతోపాటు ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ రాష్ట్రాల్లో బీజేపీకి పరిస్థితులు అనుకూలంగా లేవు. ఒకవేళ ఈ రాష్ట్రాల్లో బీజేపీ ఓడిపోతే.. ఆ ప్రభావం తర్వాత జరిగే పార్లమెంట్ ఎన్నికలపై ఉంటుంది. వచ్చే ఏడాది వరకు ఆగితే.. బీజేపీపై మరింత వ్యతిరేకత పెరగవచ్చు. అందుకే వ్యూహాత్మకంగా కొంతకాలం ఈ ఎన్నికల్ని వాయిదా వేయించడమో.. లేక ఐదు రాష్ట్రాలతోపాటే పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించాలనేది కూడా మోదీ ఆలోచన అయ్యుండొచ్చు. జీ20 సమావేశాల్ని విజయవంతం చేయడం ద్వారా మోదీ తన ఇమేజ్ పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదే స్పీడ్‌లో ఎన్నికలకు వెళ్తే ప్రయోజనం ఉంటుందని ప్రధాని ఆలోచన అయ్యుండొచ్చు.
బీజేపీకి సవాలుగా మారిన సమస్యలు
ప్రస్తుతం దేశవ్యాప్తంగా బీజేపీకి అనేక సమస్యలున్నాయి. మణిపూర్ అంశం మోదీ ప్రతిష్ట మసకబారేలా చేసింది. లద్దాక్‌లో చైనా ఆక్రమణలు బీజేపీకి ఇబ్బందిగా మారాయి. తాజాగా అరుణాచల్ ప్రదేశ్ తమదే అంటూ చైనా ఇటీవల మ్యాప్ కూడా విడుదల చేసింది. ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల, నిరుద్యోగం వంటివి కూడా బీజేపీపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగేలా చేస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్ విషయంలో 370 రద్దు, ఆర్టికల్ 35 రద్దుపై కేంద్రానికి సుప్రీం మొట్టికాయలు వేయడం కూడా బీజేపీని ఇరుకునపెడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ముందుస్తు ఎన్నికలపై నిర్ణయాన్ని ప్రకటించేందుకు కూడా ఈ సమావేశాల్ని వాడుకోవచ్చు.
అంతేకాకుండా.. కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న కీలక బిల్లుల్ని కూడా ఈ పార్లమెంట్ సమావేశాల్లో ఆమోదించుకునే అవకాశం ఉంది. యూసీసీ చట్టంతో పాటు గత పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి, సెలెక్ట్ కమిటీకి పంపిన బిల్లుల్ని ఆమోదించుకోవాలనుకున్నా కూడా ఈ సమావేశాల్ని వినియోగించుకునే ఛాన్స్ ఉంది. ఇప్పటికే ఎన్నిలకు సిద్ధమవుతున్న సంకేతాల్ని బీజేపీ పంపింది. ఇటీవలే ఎల్పీజీ వంటగ్యాస్‌పై రూ.200 తగ్గించిన సంగతి తెలిసిందే. త్వరలో పెట్రోల్, డీజిల్ ధరల్ని కూడా తగ్గించవచ్చని ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఎన్నికల్లోపు ప్రజలకు మరిన్ని రాయితీలు ప్రకటించే అవకాశం ఉంది.