SRIDHAR BABU: రాజకీయ వారసత్వం.. లాయర్.. పాలిటిక్స్‌లోకి ఎలా వచ్చాడు?

తండ్రి శ్రీపాదరావు వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చిన శ్రీధర్ బాబు.. గతంలో ప్రభుత్వ విప్‌గా, మంత్రిగా పనిచేయడంతో పాటు.. పార్టీలో ఎన్నో పదవులను నిర్వహించారు. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీకి ఛైర్మన్‌గా వ్యవహరించారు.

  • Written By:
  • Publish Date - December 7, 2023 / 05:24 PM IST

SRIDHAR BABU: మంథని అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి.. కాంగ్రెస్ పార్టీ విధేయుడిగా ఉన్న దుద్దిళ్ళ శ్రీధర్ బాబుకు మరోసారి మంత్రి పదవి దక్కింది. తండ్రి శ్రీపాదరావు వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చిన శ్రీధర్ బాబు.. గతంలో ప్రభుత్వ విప్‌గా, మంత్రిగా పనిచేయడంతో పాటు.. పార్టీలో ఎన్నో పదవులను నిర్వహించారు. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీకి ఛైర్మన్‌గా వ్యవహరించారు శ్రీధర్ బాబు. జనాన్ని ఆకట్టుకున్న కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను రూపొందించడంలో ఈయనే కీలకం.

REVANTH REDDY: సీఎంగా రేవంత్.. ప్రధాని మోదీ ట్వీట్.. ఏమన్నారంటే..

దివంగత కాంగ్రెస్ నేత, అసెంబ్లీ మాజీ స్పీకర్ దుద్దిళ్ళ శ్రీపాదరావు కొడుకు అయిన శ్రీధర్ బాబు.. 1969లో ధన్వాడ గ్రామంలో జన్మించారు. ఢిల్లీ యూనివర్సిటీలో లా చేశారు. 1998లో ఏపీ హైకోర్టులో లాయర్‌గా ప్రాక్టీస్ ప్రారంభించారు. కానీ 1999లో మావోయిస్టులు తన తండ్రి దుద్దిళ్ళ శ్రీపాదరావును కాల్చి చంపారు. దాంతో అతని రాజకీయ వారసుడిగా శ్రీధర్ బాబు అదే సంవత్సరం మంథని అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేసి విజయం సాధించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2003లో పాద్రయాత్ర ప్రారంభించే నాటికి శ్రీధర్ బాబు కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. 2004లో మంథని నుంచి గెలిచిన తర్వాత 12వ ఉమ్మడి ఏపీ అసెంబ్లీలో ప్రభుత్వం విప్ అయ్యారు. 2009, 2018లో ఇప్పుడు 2023లోనూ శ్రీధర్ బాబు వరుసగా మంథని నుంచి అసెంబ్లీకి ఎన్నికవుతూ వస్తున్నారు. 2018లో బీఆర్ఎస్ ప్రభంజనాన్ని తట్టుకొని గెలిచిన 19 మంది ఎమ్మెల్యేలో శ్రీధర్ బాబు ఒకరు. కొందరు ఎమ్మెల్యేలు పార్టీని వదిలి గులాబీ పార్టీలో చేరినా.. దుద్దిళ్ళ మాత్రం కాంగ్రెస్‌నే నమ్ముకొని ఆ పార్టీలోనే కొనసాగారు.

ఆయన విధేయతే ఇప్పుడు మంత్రిని చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో 2009లో ప్రభుత్వ విప్‌గా, 2010లో పౌర సరఫరాలు, అసెంబ్లీ వ్యవహారాల మంత్రిగా పనిచేశారు. 2014లో కాంగ్రెస్ మేనిఫెస్టో ఛైర్మన్‌గా పనిచేసిన దుద్దిళ్ళ.. 2023లోనూ ప్రజాదరణ పొందిన కాంగ్రెస్ మేనిఫెస్టోను రూపొందించారు. ఆరు గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ జనంలోకి వెళ్ళడానికి ఈ మేనిఫెస్టోయే బాగా ఉపయోగపడింది. సీనియర్ లీడర్‌గా, పార్టీలో వివిధ పదవులు నిర్వహించిన దుద్దిళ్ళ శ్రీధర్ బాబు సేవలను కాంగ్రెస్ హైకమాండ్ గుర్తించింది. ఆయనకు రేవంత్ రెడ్డి కేబినెట్‌లో మరోసారి మంత్రిగా పనిచేసేందుకు అవకాశం కల్పించింది.