Patna Opposition Meet: బీజేపీకి వ్యతిరేకంగా ఏకమయ్యేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. ఇటీవల కర్ణాటకలో కాంగ్రెస్ విజయంతో మరోసారి ప్రతిపక్షాల ఐక్యతపై చర్చ మొదలైంది. కాంగ్రెస్ ఆధ్వర్యంలో పని చేసేందుకు కొన్ని పార్టీలు సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో బిహార్, పాట్నాలో శుక్రవారం ప్రతిపక్షాల భేటీ జరగనుంది. దీనికి బిహార్ సీఎం నితీష్ కుమార్ నేతృత్వం వహిస్తున్నారు. అయితే, ప్రతిపక్షాల ఐక్యత నిజంగా సాధ్యమేనా అన్నది అందరినీ వేధిస్తున్న ప్రశ్న. పాట్నా సమావేశం తర్వాత దీనిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ప్రతిపక్ష నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో దాడులు, కేసులు.. ఢిల్లీలో కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్.. రెజ్లర్ల నిరసన.. మణిపూర్ హింస.. ఇలాంటి అనేక జాతీయ అంశాల మధ్య శుక్రవారం ప్రతిపక్షాల భేటీ జరగనుంది. పాట్నాలో నితీష్ ఆధ్వర్యంలో ఈ భేటీ జరుగుతుంది. నితీష్ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరగడానికి ఒక ప్రాధాన్యం ఉంది. 1974లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీకి వ్యతిరేకంగా జయప్రకాష్ నారాయణ్ ఆధ్వర్యంలో ప్రతిపక్షాల భేటీ పాట్నాలోనే జరిగింది. ఇప్పుడు కూడా చాలా ఏళ్ల తర్వాత ప్రతిపక్షాల తొలి భేటీ ఇక్కడే జరగబోతుండటం విశేషం. 2019 ఎన్నికల్లో బీజేపీ 303 లోక్‌సభ స్థానాలు సాధించిన తర్వాత నుంచి ప్రతిపక్షాల్లో ఐక్యత కొరవడింది. బీజేపీని ఎదుర్కోవడం ప్రతిపక్షాల వల్ల కాలేదు. ఈ విషయంలో కాంగ్రెస్ సహా అన్ని పార్టీలూ వెనుకబడ్డాయి. పైగా అనేక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తూ వచ్చింది. అప్రతిహతంగా సాగుతున్న బీజేపీ విజయయాత్రకు కర్ణాటక ఫలితం చెక్ పెట్టింది. అక్కడ బీజేపీని ఓడించి కాంగ్రెస్ ఘనవిజయం సాధించడంతో మళ్లీ ప్రతిపక్షాల్లో ఆశలు మొదలయ్యాయి. గట్టిగా ప్రయత్నిస్తే బీజేపీని ఎదుర్కోవడం సాధ్యమే అని పార్టీలు నమ్ముతున్నాయి. అయితే, విడివిడిగా ఉంటే మళ్లీ నష్టం తప్పదని, కలిసి పని చేస్తేనే బీజేపీపై గెలవగలమని నిర్ణయానికొచ్చాయి. ఈ నేపథ్యంలో పార్టీలన్నీ ఏకమయ్యేందుకు ప్రయత్నిస్తున్నాయి.
ఒకే గొడుగు కిందకు పార్టీలు
చాలా కాలం తర్వాత ప్రతిపక్షాలు ఒకే గొడుగు కిందకు రాబోతున్నాయి. ఇంతకాలం కాంగ్రెస్‌ను వ్యతిరేకించిన ఆమ్ ఆద్మీ, తృణమూల్ కాంగ్రెస్, సమాజ‌్‌వాదీ పార్టీ తిరిగి కాంగ్రెస్‌తో చేతులు కలపబోతున్నాయి. అనేక పార్టీలకు ఈ సమావేశంలో పాల్గొనడానికి ఆహ్వానం అందింది. ముఖ్యంగా బీజేపీని వ్యతిరేకించే పార్టీలను ఈ సమావేశానికి నితీష్ ఆహ్వానించారు. తెలంగాణకు సంబంధించి బీఆర్ఎస్‌కు ఆహ్వానం లేదు. బీజేపీ-బీఆర్ఎస్ ఒకటేనని ఇతర పార్టీలు నమ్ముతూ ఉండొచ్చు. ఏపీకి సంబంధించి కూడా వైసీపీ, టీడీపీలకు ఆహ్వానం లేదు. ఈ సమావేశానికి సంబంధిచి ప్రత్యేక ఎజెండా అంటూ లేదు. భవిష్యత్తులో ఎలా కలిసి పని చేయాలి అనే అంశంపైనే ప్రధానంగా చర్చిస్తారు.
ఒక సీటు-ఒక అభ్యర్థి ఫార్ములా
ప్రతిపక్షాల భేటీ నేపథ్యంలో ఇటీవల చర్చకు వచ్చిన అంశం.. ఒక సీటు-ఒకే అభ్యర్థి ఫార్ములా. అంటే ప్రతిపక్షాల తరఫున ఒక నియోజకవర్గానికి ఒక అభ్యర్థిని మాత్రమే పోటీ చేయించడం. దీనివల్ల ప్రతిపక్షాల మధ్య ఓట్ల చీలిక రాకుండా ఉంటుందని భావిస్తున్నారు. ప్రతిపక్షాలు కలిసి పని చేయాలనుకున్నప్పుడు ఏదో ఒక పార్టీ తరఫున ఒక అభ్యర్థిని మాత్రమే నిలబెట్టి గెలిపించుకోవాలనేది ప్లాన్. అయితే, ఇది సాధ్యమేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకే పార్టీ తరఫున అంటే.. ఏ పార్టీ తరఫున పోటీ చేయాలి? అనేది మొదట తలెత్తే సందేహం. అలా ఒకే పార్టీ పోటీ చేయాలంటే మిగతా పార్టీలు మద్దతివ్వాలి. ఇతర పార్టీ అభ్యర్థులు నిలబడకూడదు. పోనీ.. పార్టీ దీనికి అంగీకరించినా అభ్యర్థులు రెబల్‌గా పోటీ చేస్తే నష్టమే. అందుకే ఈ అంశంలో ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి. దీనితోపాటు మరికొన్ని అంశాల్లో స్పష్టత రావాల్సి ఉంది.
ఉమ్మడి అజెండా ఏంటి..?
ప్రతిపక్షాలు కలిసి ప్రజల్లోకి వెళ్లాలంటే ఉమ్మడి అజెండా ఉండాలి. కానీ, అనేక విషయాల్లో పార్టీల మధ్య బేధాభిప్రాయాలు ఉన్నాయి. ఉమ్మడి అజెండా ప్రకటించాలంటే ముందు ఈ విబేధాల్ని పక్కనపెట్టాలి. జాతీయ అంశాలపై అన్ని పార్టీలూ ఒకే నిర్ణయానికి రావాలి. ఉమ్మడిగా, వ్యూహాత్మకంగా ముందుకెళ్లాలి. మధ్యలో భేదాభిప్రాయాలొస్తే మళ్లీ చిక్కులొస్తాయి. యునిఫామ్ సివిల్ కోడ్, హిందూత్వ వంటి అంశాల్లో స్పష్టమైన వైఖరి అవలంభించాలి. కొన్నిసార్లు ఉమ్మడి అజెండా వల్ల స్థానిక పార్టీలకు సమస్యలు రావొచ్చు.
ప్రాంతీయ పార్టీల వైఖరేంటి..?
జాతీయ పార్టీల పెత్తనాన్ని ప్రాంతీయ పార్టీలు సహించడం లేదు. ఇలాంటి నేపథ్యంలో ప్రతిపక్ష కూటమిలో ప్రాంతీయ పార్టీలు ఎలా సర్దుకుపోగలవు? టీఎంసీ, ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్, సమాజ్‌వాదీ వంటి పార్టీలు గతంలో పరస్పర విమర్శలు చేసుకున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇకపై కలిసి సాగడం చాలా ముఖ్యం. మరి ప్రాంతీయ పార్టీలు ఎలా కలిసుంటాయో చూడాలి.
సీట్ల పంపిణీ
ప్రతిపక్షాల మధ్య సీట్ల పంపిణీ ఈ కూటమికి మరో పెద్ద సవాల్. చాలా రాష్ట్రాల్లో ఆయా పార్టీల మధ్య పోటీ ఉంది. అలాంటిది సీట్లను పంచుకోవాలంటే కష్టమే. ప్రతి పార్టీ తక్కువ సీట్లతోనే పోటీకి వెళ్లాలి. దీనికి ఏ పార్టీ అంగీకరించదు. పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ-కాంగ్రెస్, ఢిల్లీలో ఆమ్ ఆద్మీ-కాంగ్రెస్, యూపీలో ఎస్పీ-కాంగ్రెస్, బిహార్‌లో జేడీఎస్, ఆర్జేడీ, కాంగ్రెస్.. మధ్య సీట్ల పంపిణీ జరగడం చాలా కష్టమైన విషయం.
కాంగ్రెస్ ఆధిపత్యం
ప్రతిపక్ష కూటమికి తమ పార్టీయే నేతృత్వం వహించాలని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారు. జాతీయ పార్టీగా తమకు ఆ హక్కు ఉందని వాదిస్తోంది కాంగ్రెస్. కూటమికి నాయకత్వం వహించి, ఎక్కువ సీట్లు పొందాలని, ప్రధాని అభ్యర్థిని తామే నిర్ణయించాలనేది కాంగ్రెస్ భావనగా అనిపిస్తోంది. అయితే, కాంగ్రెస్ ఆధిపత్యాన్ని టీఎంసీ, ఆమ్ ఆద్మీ వంటి పార్టీలు అంగీకరిస్తాయా అన్నది మరో సమస్య.
ప్రధాని అభ్యర్థి ఎవరు..?
ప్రతిపక్షాల కూటమికి అసలైన సమస్య ప్రధాని అభ్యర్థి. ప్రతిపక్షాలు మెజారిటీ సాధిస్తే ఎవరు ప్రధాని అవ్వాలనేది పెద్ద సవాల్. బీజేపీకి మోదీయే ఆకర్షణ. వచ్చే ఎన్నికల్లో కూడా బీజేపీ తరఫున మోదీనే ప్రధానిగా పోటీ చేస్తారు. ఆయనకున్న ఇమేజ్ కూడా అలాంటిది. బీజేపీ ఎంతగా బలహీనపడ్డట్లు అనిపించినా మోదీ మేనియా కచ్చితంగా ఉపయోగపడుతుంది. అందుకే ప్రతిపక్షాల తరఫున మోదీకి ధీటైన నాయకుడు అవసరం. అది ఎవరంటే ఏ పార్టీ చెప్పలేని పరిస్థితి. రాహుల్‌ను ఎన్నుకుందామా అంటే అదే కూటమికి మైనస్ కావొచ్చు. శరద్ పవార్, నితీష్ కుమార్, మమతా బెనర్జీ, కేజ్రీవాల్ వంటి నేతలు కూడా ప్రధాని రేసులో ఉన్నారు. వీరిలో ఎవరు ప్రధాని అవుతారో ముందే వెల్లడించాల్సి రావొచ్చు. ఇలాంటి అనేక సవాళ్లను ప్రతిపక్ష కూటమి ఎదుర్కోవాల్సి ఉంటుంది. వీటన్నింటికీ సరైన పరిష్కారాలు కనుగొన్నప్పుడే ప్రతిపక్షాల ఐక్యత సాధ్యం. ఇది జరగకపోతే అది అంతిమంగా బీజేపీకి మరోసారి అధికారాన్ని అప్పగించడమే అవుతుంది. అసలు పాట్నాలో జరిగే భేటీకి ఎన్ని పార్టీలు హాజరవుతాయన్నదే ఇప్పటి సందేహం.