అప్పటి సీఎం వైఎస్ జగన్ తో, వైసీపీ నేతలతో అంట కాగిన వాళ్లకు మిట్ట మధ్యాహ్నం కూడా చుక్కలు చూపిస్తోంది కూటమి సర్కార్. వెంటాడి ఒక్కొక్కరిని వేటాడుతోంది. రెడ్ బుక్ లో రాసుకున్న ప్రతీ పేరుకి ట్రీట్మెంట్ ఉంటుందని ప్రూవ్ అవుతోంది. తాజాగా విశాఖ సాములోరికి ముహూర్తం ఫిక్స్ చేసి ఆట కట్టించారు. అప్పుడు జగన్ తో అంట కాగి ప్రభుత్వ సొమ్మును అప్పణంగా దొబ్బిన శారదా పీఠం సాములోరికి దిమ్మ తిరిగి బొమ్మ కనపడింది. 15 లక్షలకు వందల కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమిని దొబ్బిన స్వరూపానందకు షాక్ ఇచ్చారు.
అలాగే తిరుమల శ్రీవారి సన్నిధిలో శారద పీఠం నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన నిర్మాణంపై కూడా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం టీటీడీకి ఆదేశాలు ఇచ్చింది. విశాఖలో భీమిలి పట్టణాన్ని ఆనుకుని ఉన్న కొత్తవలస గ్రామ పరిధిలో, సముద్ర తీరానికి అతి దగ్గర్లో 220 కోట్ల రూపాయల విలువ చేసే భూమిని ఎకరం కేవలం రూ.లక్ష చొప్పున అమ్మేసారు. 2021 నవంబరులో జీఓ విడుదల అయింది. 15 ఎకరాల స్థలం విలువ రూ.220 కోట్లు అయితే కేవలం రూ.15 లక్షలకు స్వాములోరీ పీఠానికి ఇవ్వగా అక్కడ భక్తులను అడ్డం పెట్టుకుని వ్యాపారం చేయాలని సాములోరు ప్లాన్ చేసారు.
వాణిజ్య, నివాస ప్రాంతాలకు అత్యంత సమీపంలోని భూములు తీసుకోగా జీఓలో మాత్రం వేద విద్య వ్యాప్తికి, పీఠం కార్యకలాపాల విస్తరణకు అని రాయడం గమనార్హం. అయితే ఇక్కడ పీఠం వ్యూహాత్మకంగా వ్యవహరించి అప్పటి ప్రభుత్వానికి… స్వరూపానంద వారసుడు, పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్రతో 2023 నవంబరు 20న ఓ లేఖ రాయించారు. తమ పీఠానికి ఆదాయం సమకూర్చుకోవడానికి ఆ భూముల్ని వాడుకోవాలన్నది తమ ఉద్దేశమని స్పష్టం చేస్తూ… దానికి వీలు కల్పిస్తూ జీఓను సవరించాలని కోరుతూ… సీఎంగా ఉన్న జగన్ కు లేఖ రాసారు.
పీఠం కార్యకలాపాలకు అవసరమైన ఆదాయాన్ని ఆర్జించడం కోసం సాగర తీరంలో, వాణిజ్య, నివాస ప్రాంతాలకు అత్యంత సమీపంలోని భూములు కేటాయించాల్సిందిగా కోరినట్టు అందులో ప్రస్తావించారు. ఆ లేఖ వచ్చిన వెంటనే… ఏ మాత్రం ఆలోచన లేకుండా అనేక వెసులుబాట్లు కల్పిస్తూ, ఎన్నికలకు కొన్ని రోజుల ముందు 2024 ఫిబ్రవరిలో జగన్ ప్రభుత్వం జీవోని సవరించి విడుదల చేసింది. దీనిపై అధికారంలోకి వచ్చిన తర్వాత దర్యాప్తు చేసినా నివేదిక మాత్రం ప్రభుత్వానికి చేరకుండా కొందరు అడ్డుకున్నారు. దీనిపై ఎల్లో మీడియా నుంచి సర్కార్ పై ఒత్తిడి పెరిగింది. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించి చర్యలకు రంగం సిద్దం చేసారు. వెంటనే ఈ వ్యవహారానికి సంబంధించిన వెంటనే ఫైల్ తెప్పించుకొని చంద్రబాబు పరిశీలించి ఆరోపణలు నిజమే అని గుర్తించారు.
ఇన్నాళ్ళు నివేదికను దాచిన అధికారులపై సీఎం అక్కడే సీరియస్ అయ్యారు. ఆపై నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టే విధంగా ఉన్న భూమిని కట్టబెట్టడాన్ని ఎలా సమర్ధిస్తారు అంటూ ఫైర్ అయ్యారు. వెంటనే రద్దు చేయాల్సిందే అని చంద్రబాబు తక్షణ ఆదేశాలు జారీ చేశారు. చంద్రబాబు స్వయంగా జోక్యం చేసుకోవడంతో సోమవారం అధికారికంగా ఉత్వర్వులను విడుదల చేసారు అధికారులు. ఇక అక్కడ ఓ స్టార్ హోటల్ ను నిర్మించాలని సాములోరు ప్లాన్ చేసారు. దీనిపై ఇప్పటికే పనులు కూడా మొదలయ్యాయి. ఈ తరుణంలో ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది.