Sujana Chowdary: విజయవాడ పార్లమెంట్ స్థానానికి గట్టి పోటీ ఎదురుకాబోతుంది. ఇప్పటికే సీటు విషయంలో వివాదం తలెత్తడంతో సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని టీడీపీకి రాజీనామా చేశారు. ఆయన సోదరుడు కేశినేని చిన్నికి టీడీపీ టిక్కెట్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. వైసీపీ టిక్కెట్ నానికి దక్కొచ్చని ప్రచారం జరుగుతోంది. మరోవైపు గత ఎన్నికల్లో వైసీపీ తరఫున ఇదే స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయిన పీవీపీ కూడా విజయవాడ టిక్కెట్ ఆశిస్తున్నారు. దీంతో విజయవాడ ఎంపీ స్థానానికి గట్టి పోటీ నెలకొంది.
Konathala Rama Krishna: జనసేనలోకి మరో సీనియర్ లీడర్.. త్వరలోనే పార్టీలో చేరిక..?
ఇప్పటికే భారీ పోటీ ఉంటే.. ఇప్పుడు మరో నేత కూడా ఇక్కడి నుంచే ఎన్నికల బరిలోకి దిగబోతున్నట్లు తెలుస్తోంది. ఆయనే.. మాజీ కేంద్రమంత్రి, బీజేపీ నేత సుజనా చౌదరి. బీజేపీ అధిష్టానం ఆదేశిస్తే విజయవాడ నుంచి ఎంపీగా పోటికి దిగనున్నట్లు సుజనా చౌదరి తెలిపారు. ఈ అంశంపై తాజాగా మీడియాతో మాట్లాడారు. తాను విజయవాడ నుంచి పోటీ చేస్తే బీజేపీ గెలుపు ఖాయమన్నారు. ఈ విషయంలో అధిష్టానమే నిర్ణయం తీసుకుంటుందని అభిప్రాయపడ్డారు. అయితే, ఇక్కడే కీలకమైన విషయం ఒకటుంది. అదే.. జనసేన-టీడీపీతో బీజేపీ పొత్తు. ఒకవైపు బీజేపీ.. తాము జనసేనతో పొత్తులో ఉన్నామని చెబుతుంటుంది. మరోవైపు జనసేన.. టీడీపీతో పొత్తుకు సిద్ధమైంది. అయితే, ఎటొచ్చీ.. బీజేపీ మాత్రం జనసేన-టీడీపీ కూటమిలో చేరడంపై మాత్రం స్పందించడం లేదు. తమతో పొత్తు కావాలంటే టీడీప వాళ్లే అడగాలని బీజేపీ నేతలు అంటున్నారు.
ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తాయా.. లేక బీజేపీ ఒంటరిగా బరిలోకి దిగుతుందా.. అనే సంగతి ఇంకా తేలడం లేదు. ఇదే సమయంలో ఎవరికి వాళ్లు తమ పార్టీల నుంచి అభ్యర్థుల్ని మాత్రం సిద్ధం చేస్తున్నాయి. రాబోయే ఎన్నికల్లో విజయవాడ నుంచి వైసీపీ తరఫున కేశినేని నాని లేదా పీవీపీ, టీడీపీ నుంచి కేశినేని చిన్ని బరిలోకి దిగొచ్చు. మరి జనసేన నుంచి కూడా ఎవరైనా అభ్యర్థులు టిక్కెట్లు ఆశించే ఛాన్స్ ఉంది. ఇక బీజేపీ నుంచి సుజనా చౌదరి రంగంలోకి దిగేందుకు సిద్ధమయ్యారు. దీంతో విజయవాడే కాదు.. ఏపీ రాజకీయాలు కూడా ఆసక్తికరంగా సాగుతున్నాయి.