T CONGRESS: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పని చేస్తోంది. దీనికి కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు సరికొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. సునీల్ కనుగోలు గతంలో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ దగ్గర పని చేశారు. ఆ అనుభవంతో కర్ణాటకలో కాంగ్రెస్‌కు వ్యూహకర్తగా పనిచేసి, అక్కడ పార్టీని అధికారంలోకి తెచ్చారు సునీల్. ఇప్పుడు తెలంగాణలోనూ తనదైన వ్యూహాన్ని అమలు చేసేందుకు రెడీ అవుతున్నారు.
తెలంగాణలో పార్టీని అధికారంలోకి తేవడానికి అనువైన సూచనల్ని రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు వివరించారు సునీల్. ఆయన వ్యూహాల ప్రకారం.. ఎస్సీలు, బీసీల సాధికారత, రైతు పంట రుణ మాఫీ వంటి అంశాల్ని ప్రజల్లోకి కీలకంగా తీసుకెళ్లబోతున్నారు. ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రజలకు వివరించేలా బస్సు యాత్రలు కూడా చేపట్టబోతుంది కాంగ్రెస్. రైతులను ఆకర్షించేలా రూ.2 లక్షల వరకు పంట రుణాల మాఫీతోపాటు, అర్హులందరికీ రూ.4,016 పింఛన్ ఇస్తామని కాంగ్రెస్ ఇప్పటికే ప్రకటించింది. ఈ రెండు పథకాల ద్వారా రైతులు, దివ్యాంగుల, వృద్ధులు, వితంతువుల ఓట్లు దక్కుతాయని కాంగ్రెస్ ఆలోచన. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనారిటీలను ఆకట్టుకునేలా పథకాల ఎంపికపై ప్రత్యేక కమిటీ వేయబోతుంది కాంగ్రెస్. అన్ని వర్గాలను ఆకర్షించేలా పథకాలు ఉండాలని నిర్ణయించింది. ప్రధానంగా ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలపై ప్రత్యేకంగా దృష్టిసారించాలని నిర్ణయించింది. ఈ జిల్లాలపై ఫోకస్ చేస్తే పార్టీకి అధిక సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఖమ్మం, మహబూబ్ నగర్, వరంగల్, నల్గొండ వంటి జిల్లాల్లో కాంగ్రెస్‌కు మంచి ఆదరణ దక్కుతోంది. అందుకే ఎక్కువ సీట్లు గెలిచే ఇతర జిల్లాలపై కూడా ఫోకస్ చేసింది.
పార్టీని మరింతగా జనంలోకి తీసుకెళ్లేందుకు సభలు, ర్యాలీలు పెద్దఎత్తున నిర్వహించాలని నిర్ణయించింది. జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్‌లో చేరిక సందర్భంగా, కాంగ్రెస్ అగ్రనేతల్లో ఒకరైన ప్రియాంకా గాంధీ కొల్లాపూర్ రానున్నారు. వచ్చే నెలలో కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ గర్జన పేరుతో భారీ సభ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది. ఖర్గే ఎస్సీ సామాజికవర్గానికి చెందిన నేత కావడంతో ఆయన ద్వారా ఆ వర్గం ఓట్లను ఆకర్షించాలని ప్రయత్నిస్తోంది. నిరంతరం ఏదో ఒక కార్యక్రమంతో అటు కేంద్రంలోని బీజేపీని, ఇటు రాష్ట్రంలోని బీఆర్ఎస్‌ను ఎదుర్కొనేందకు సిద్ధమవుతోంది. సునీల్ కనుగోలు వ్యూహాల్ని అమలు చేసేందుకు పార్టీ నేతలు సిద్ధమవుతున్నారు. కర్ణాటక తరహాలోనే యాక్షన్ ప్లాన్ అమలు చేసి, తెలంగాణలోనూ కాంగ్రెస్‌కు విజయాన్ని అందించాలని సునీల్ కనుగోలు ప్రయత్నిస్తున్నారు.