Sunitha Laxma Reddy: గులాబీ బాస్ కేసీఆర్‌కు ప్రత్యేక ఆసక్తి ఉన్న జిల్లా.. ఉమ్మడి మెదక్. అక్కడి అభ్యర్థుల ఎంపిక విషయంలో స్వయంగా కేసీఆరే నిర్ణయం తీసుకుంటారని చెబుతుంటారు. ఈ జిల్లాలోని 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్.. ఒక్క నర్సాపూర్ స్థానాన్ని మాత్రం పెండింగ్‌లో పెట్టారు. దీంతో ఇక్కడి నుంచి వరుసగా రెండుసార్లు (2014, 2018 పోల్స్) గెల్చిన సిట్టింగ్ ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డికి షాక్ తగిలింది. మళ్లీ తనకు ఛాన్స్ దక్కుతుందో, లేదోననే ఆందోళన ఆయనలో మొదలైంది. మరోవైపు ఈ పరిణామంతో నర్సాపూర్ టికెట్ ఆశిస్తున్న మాజీ మంత్రి, మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి ఆశలు చిగురించాయి. 72 ఏళ్ల వయసు కలిగిన మదన్‌రెడ్డికి ఏదైనా నామినేటెడ్ పదవి లేదా ఎమ్మెల్సీగా అవకాశమిచ్చి, సునీతారెడ్డికి టికెట్ కేటాయించాలని కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీనిపై నేడో రేపో గులాబీ బాస్ ఒక ప్రకటన చేసే అవకాశం ఉందని సమాచారం.
మదన్‌రెడ్డికి మైనస్ పాయింట్స్‌గా మారిన విషయాల్లోకి వెళితే.. ఆయన ముఖ్య అనుచరుల్లో కొందరు ఇసుక, మట్టి అక్రమ వ్యాపారాల్లో ఉన్న విషయంపై కారు పార్టీ అధినాయకత్వానికి రిపోర్ట్స్ వెళ్లాయని అంటున్నారు. కేసీఆర్ చేయించిన సర్వేల్లోనూ మదన్ రెడ్డికి జనాదరణ తగ్గిందని నివేదిక వచ్చిందట. ఈ అంశాలన్నీ సునీతా లక్ష్మారెడ్డికి ప్లస్ పాయింట్లుగా మారాయి. కాంగ్రెస్‌లో ఉండగా వరుసగా మూడు సార్లు (1999, 2004, 2009) నర్సాపూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ట్రాక్ రికార్డు కూడా ఆమెకు టికెట్ దక్కేలా చేసే ఛాన్స్ ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖరరెడ్డి, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి కేబినెట్లో మంత్రిగానూ పనిచేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి సునీతా లక్ష్మారెడ్డి ఓడిపోయారు. 2019లో కాంగ్రెస్‌కు రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరారు. ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్‌గా కేసీఆర్ నియమించారు. ఎమ్మెల్యే టికెట్ ఇస్తామన్న స్పష్టమైన హామీ పొందిన తరువాతనే ఆమె బీఆర్‌ఎస్‌లో చేరారని చెబుతున్నారు.
బీసీ సామాజికవర్గం నాయకుడు, నర్సాపూర్ మున్సిపల్ ఛైర్మన్ మురళీయాదవ్ కూడా నర్సాపూర్ అసెంబ్లీ టికెట్ ఆశిస్తున్నారు. అయితే నర్సాపూర్‌లో అభ్యర్థిని మార్చాలంటే తానే ఆప్షన్ అన్నట్లుగా సునీతాలక్ష్మారెడ్డి సైలెంట్ పాలిటిక్స్ చేస్తున్నారు. కాంగ్రెస్‌లోని తన మద్దతుదారులను అదే పార్టీలో సైలెంట్‌గా ఉంచి.. బీఆర్ఎస్‌లోని కొందరు నేతలు తనకు మద్దతిచ్చేలా ఆమె చూసుకుంటున్నారట. టైం వచ్చినప్పుడు అందరి మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాల్లో ఆమె ఉన్నారన్న గుసగుసలు నడుస్తున్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో నేతలు బాహాటంగా వ్యతిరేకించుకుంటూ పరస్పర విమర్శలు చేసుకుంటున్నా నర్సాపూర్‌లో మాత్రం సైలెంట్‌గానే తెరవెనుక రాజకీయం నడుస్తోంది. ఇద్దరికీ పార్టీ పెద్దల ఆశీస్సులు ఉండటంతో వచ్చే ఎన్నికల్లో అధినాయకత్వానికి ఆ ఇద్దరే ఆప్షన్ అంటున్నారు.