Chandrababu Naidu: చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై కీలక వాదనలు.. విచారణ మళ్లీ వాయిదా వేసి సుప్రీంకోర్టు..

సీఐడీ తరఫు లాయర్ రోహత్గీ.. చంద్రబాబు తరఫు లాయర్‌ లూథ్రా వాదనలతో సుప్రీంకోర్టులో హాట్‌హాట్ వాతావరణం కనిపించింది. చంద్రబాబుపై ఎఫ్‌ఐఆర్‌ రద్దు చేయాలన్న అంశంపై ఎంసీ గుప్తా కేసును సీఐడీ లాయర్ ముకుల్ రోహత్గీ ప్రస్తావించారు. చట్టం అమలులో ఉన్నప్పుడు.. జరిగిన నేరాలకు అదే చట్టం వర్తిస్తుందన్నారు.

  • Written By:
  • Publish Date - October 13, 2023 / 05:12 PM IST

Chandrababu Naidu: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో రిమాండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో వాడీవేడిగా వాదనలు సాగాయ్. ఈ కేసులో సెక్షన్‌ 17A వర్తిస్తుందని చంద్రబాబు తరఫు న్యాయవాది వాదించగా.. ఆ సెక్షన్‌ వర్తించదని సీఐడీ తరఫు న్యాయవాది వాదించారు. సుదీర్ఘ వాదనలు విన్న జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌, జస్టిస్‌ బేలా త్రివేది ధర్మాసనం.. తర్వాతి విచారణను ఈనెల 17కు వాయిదా వేసింది. సీఐడీ తరఫు లాయర్ రోహత్గీ.. చంద్రబాబు తరఫు లాయర్‌ లూథ్రా వాదనలతో సుప్రీంకోర్టులో హాట్‌హాట్ వాతావరణం కనిపించింది.

చంద్రబాబుపై ఎఫ్‌ఐఆర్‌ రద్దు చేయాలన్న అంశంపై ఎంసీ గుప్తా కేసును సీఐడీ లాయర్ ముకుల్ రోహత్గీ ప్రస్తావించారు. చట్టం అమలులో ఉన్నప్పుడు.. జరిగిన నేరాలకు అదే చట్టం వర్తిస్తుందన్నారు. చట్టాన్ని రద్దు చేసినా.. వెనక్కి తీసుకున్నప్పటికీ నేరం జరిగినప్పుడు ఉన్న చట్టమే వర్తిస్తుందన్నారు. కొత్త చట్టం అమలులోకి రాకముందే నేరం జరిగింది కాబట్టి.. సవరణ చట్టం ఈ కేసుకు వర్తించదని వివరించారు. దీనికి రియాక్ట్ అయిన చంద్రబాబు లాయర్ లూథ్రా.. కేసులుపై కేసులు పెట్టి తమను సర్కస్‌ ఆడిస్తున్నారని ఆరోపించారు. స్కిల్‌ కేసు విచారణకు ఫైబర్‌నెట్‌ కేసుతో సంబంధం ఉందన్న ఆయన.. మరో కేసులో చంద్రబాబును 16న ప్రవేశపెట్టేందుకు వారెంట్‌ తీసుకున్నారని గుర్తుచేశారు.

ఇక్కడ కూడా 17Aను ఛాలెంజ్‌ చేస్తున్నారా అని లూథ్రాను న్యాయమూర్తి జస్టిస్‌ త్రివేది ప్రశ్నించారు. 17A ప్రతిచోటా వర్తిస్తుందని లూథ్రా తెలిపారు. ఆ తర్వాత కూడా దీనిపై వాదనలు సాగినా.. కేసు విచారణ కోసం కేటాయించిన సమయంలో వాదనలు ముగించే అవకాశం లేకపోవడంతో.. ఇరువైపులా లాయర్ల అంగీకారంతో కేసు విచారణను 17వ తేదీ మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తులు ప్రకటించారు. ఆ తర్వాత ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై కూడా విచారణ ప్రారంభం అయింది. దాన్ని కూడా మంగళవారానికి వాయిదా వేసింది కోర్టు.