కొలీజియంపై కేంద్రం వైఖరి.. దేశానికి ప్రాణాంతకం సుప్రీం మాజీ జడ్జి జస్టిస్ నారీమన్ కీలకవ్యాఖ్యలు చేశారు. కొలీజియం ప్రతిపాదించిన న్యాయమూర్తుల పేర్లను కేంద్రం తొక్కిపెట్టడం ప్రజాస్వామ్యానికి ప్రాణాంతకమని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రొహిన్‌టన్ ఫాలి నారీమన్ పేర్కొన్నారు. కొలీజియం వ్యవస్థకు వ్యతిరేకంగా కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెన్ రిజుజు చేసిన విమర్శలను ఆయన తీవ్రంగా ఖండించారు. ముంబై విశ్వవిద్యాలయంలో శుక్రవారం ఆయన బాంబే హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఎమ్‌సి చాగ్లా ఏడో స్మారకోపన్యాసం చేశారు. స్వతంత్రులు, నిర్భయులైన జడ్జీలను నియమించకపోతే న్యాయవ్యవస్థ స్వేచ్ఛకు అర్థమేమున్నదని ఆయన ప్రశ్నించారు. స్వతంత్ర న్యాయవ్యవస్థలోని అత్యున్నత సంస్థ అయిన సుప్రీంకోర్టు పతనమైతే.. దేశం ‘కొత్త చీకటి యుగం’ అనే అగాథంలోకి పడిపోతుందని హెచ్చరించారు. ఒకసారి కొలీజియం ప్రభుత్వానికి ఒక పేరు సిఫారసు చేశాక 30 రోజుల్లోగా ఎలాంటి ప్రత్యుత్తరం రాకపోతే ప్రభుత్వం చెప్పేదేమీ లేదని భావించేలా ఒక తీర్పు రావాలని, అందుకోసం అయిదుగురు జడ్జీలతో ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటు చేయాలని నారీమన్ సూచించారు.
‘జడ్జీల పేర్లను తొక్కి పెట్టడం ఈ దేశ ప్రజాస్వామ్యానికి ప్రాణాంతకం. మీరు మీకు అనుకూలమైన కొలీజియం కోసం వేచి చూస్తున్నారు. ఆ వచ్చే కొలీజియం మీకు అనుకూలంగా పని చేస్తుందని ఆశిస్తున్నారు. జడ్జీల నియమకాలు నిర్దిష్టమైన కాల వ్యవధిలో జరగాలి. ఈ విధంగానే రాజ్యాంగం పనిచేస్తుంది’ అని అన్నారు ఆయన. ‘మనకు నిర్భయులు, స్వతంత్రులైన న్యాయమూర్తులు లేకపోతే న్యాయవ్యవస్థకు గుడ్ బై చెప్పండి. అప్పుడు ఇక ఏమీ మిగలదు. న్యాయం లభించే చివరి మజిలీ అయిన సుప్రీంకోర్టు కుప్పకూలితే.. ఇక మనం చీకటి యుగంలోకి ప్రవేశించినట్టే. అప్పుడు, ఉప్పు తన సారాన్ని కోల్పోతే.. దానికి ఉప్పదనం ఎక్కడినుంచి వస్తుంది? అని సామాన్యులు ప్రశ్నించుకుంటారు’ అని ప్రస్తుత న్యాయశాఖ పరిస్థితులను ఉదాహరించారు.
కొలీజియం వ్యవస్థ పారదర్శకంగా లేదని కేంద్రమంత్రి కిరెన్ రిజుజు ఇటీవల పదేపదే విమర్శలు చేశారు. ఇటీవల ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌కర్ కూడా ఎన్‌జాక్ చట్టాన్ని సుప్రీంకోర్టు కొట్టివేయడాన్ని తప్పుబట్టారు. దీనిపై జస్టిస్ నారీమన్ స్పందిస్తూ.. ‘కేంద్ర న్యాయ శాఖ మంత్రి రెండు ప్రాథమిక రాజ్యాంగ సూత్రాలను తెలుసుకోవాలి. మొదటిది.. రాజ్యాంగాన్ని నిర్వచించడం కోసం కనీసం అయిదుగురు జడ్జీలతో రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేయాలి. ఆ ధర్మాసనం తీర్పు ఇచ్చిన తరువాత ఒక అధికారిగా మీరు దానిని అమలు చేయాల్సిందే. పౌరులుగా మీరు, నేను ఆ తీర్పును విమర్శించవచ్చు… కానీ ఒక అధికార హోదాలో ఉన్నప్పుడు.. ఆ తీర్పు తప్పైనా.. ఒప్పయినా మీరు దానికి కట్టుబడి ఉండాల్సిందే’ అని హితబోధ చేశారు. రాజ్యాంగ మౌలిక స్వరూపం గురించి నారీమన్ మాట్లాడుతూ.. ‘40 ఏండ్ల క్రితం రెండుసార్లు రాజ్యాంగ స్వరూపాన్ని మార్చేందుకు ప్రయత్నాలు జరిగాయి. ఆ తర్వాత ఇప్పటి వరకూ ఎవరూ దానిని పట్టించుకోలేదు. అది అలా మారకుండా ఉండిపోయినందుకు దేవుడికి ధన్యవాదాలు’ అన్నారు. అమెరికాలో న్యాయవ్యవస్థ ప్రమేయం లేకుండానే న్యాయమూర్తుల నియామకాలు జరుగుతాయని, భారత్‌లో అందుకు భిన్నమైన విధానాన్ని అనుసరిస్తున్నామని ప్రశ్నాంచారు. ‘1990 వరకు రాష్ట్రపతి భారత ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించి, అర్హులైనవారిని జడ్జీలుగా నియమించేవారు. సీజేఐ చెప్పినదానిని లేదా సిఫారసు చేసినదానిని రాష్ట్రపతి పాటించేవారు’ అని గుర్తుచేశారు. న్యాయ వ్యవస్థ స్వతంత్రత రాజ్యాంగ ప్రాథమిక సూత్రమని, అదే ప్రజాస్వామ్యానికి కీలకమని చెప్పారు. ఒక జడ్జిని నియమించాలా వద్దా అనేది సీజేఐ కంటే బాగా ఎవరికి తెలుస్తుందని నారీమన్ ప్రశ్నించారు. సీజేఐను కాకుండా ఇతర జడ్జిలను కూడా సంప్రదించవచ్చనే నిర్ణయం ఆ తర్వాత కాలంలో క్రమక్రమంగా తీసుకువచ్చారని తెలిపారు.
దీనిపై స్పందించిన కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెన్ రిజుజు.. చెప్పాలనుకున్న విషయాన్ని తానెప్పుడూ ‘సూటిగా’ చెప్తానని, దీన్ని న్యాయ వ్యవస్థపై దాడిగా పరిగణించవద్దని అన్నారు. దేశ శ్రేయస్సు దృష్ట్యా న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించి సున్నితమైన, రహస్యమైన నివేదికలను ప్రజా బాహుళ్యంలో ఉంచకూడదని ఆయన అభిప్రాయపడ్డారు. జడ్జిల నియామకానికి సంబంధించి కేంద్రం ఒక విధానాన్ని అనుసరించి జాగ్రత్తగా నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.