Rahul Gandhi: మోదీ ఇంటి పేరు గురించి చేసిన వ్యాఖ్యలపై దాఖలైన కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాందీకి భారీ ఊరట లభించింది. అనర్హత కేసులో గుజరాత్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై.. సుప్రీంకోర్టు స్టే విధించింది. మోదీ ఇంటిపేరుపై చేసిన వ్యాఖ్యల కేసులో రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ జూలై 7న అహ్మదాబాద్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ కేసులో స్టే విధించాలని రాహుల్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. భారీ ఊరట లభించింది.
2019 ఎన్నికల ప్రచారంలో భాగంగా.. కర్ణాటక కోలార్‌లో జరిగిన ర్యాలీలో మోదీ అనే పదం ప్రస్తావన తెచ్చి.. ఈ ఇంటి పేరు ఉన్నవాళ్లంతా దొంగలే అంటూ రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో రాహుల్ గాంధీపై బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్ మోదీ పరువు నష్టం దావా వేశారు. ఈ ఏడాది మార్చి 23వ తేదీన సూరత్ కోర్టు ఈ క్రిమినల్ పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీని దోషిగా తేలుస్తూ.. రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఆ తర్వాత రోజు ఆయన లోక్‌సభ స్థానంపై అనర్హత వేటు పడింది. ప్రజా ప్రాతినిథ్య చట్టం 1951 బలమైన సెక్షన్ 8 ప్రకారం ఆయనపై వేటు వేసినట్లు లోక్‌సభ కార్యదర్శి ప్రకటించారు. తక్షణం వేటు అమలులోకి వస్తుందని ప్రకటించారు. ఐతే ఈ కేసులో బెయిల్ దక్కించుకున్న రాహుల్.. తన శిక్షపై స్టే విధించడం ద్వారా.. లోక్‌సభ సభ్యత్వాన్ని మళ్లీ తెచ్చుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికోసం గుజరాత్ హైకోర్టుకు వెళ్లారు.
ఐతే అక్కడ కూడా నిరాశే ఎదురైంది. సెషన్స్ కోర్టు తీర్పును గుజరాత్ హైకోర్టు సమర్థించింది. దీనిపై రాహుల్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. ఊరట లభించింది. జైలు శిక్షపై స్టే విధించింది. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ సంజయ్ కుమార్‌తో కూడిన ధర్మాసనం తాజా తీర్పు వెల్లడించింది. దీనివల్ల రాహుల్ కోల్పోయిన పార్లమెంట్ ఎంపీ సభ్యత్వం తిరిగొచ్చే అవకాశం కూడా ఉంది. రాబోయే ఎన్నికల్లో కూడా పోటీ చేయొచ్చు.