స్విగ్గీ సక్సెస్ స్టోరీ, 10మినిట్స్ డెలివరీ.. 10 ఇయర్స్ స్టోరీ

స్విగ్గీ...సిటీలో స్మార్ట్ ఫోన్ ఉందంటే ఖచ్చితంగా అందులో స్విగ్గీ యాప్ ఉండాల్సిందే. ఎనీ టైమ్ మీ ఆకలి తీర్చే అల్లాఉద్దీన్ అద్భుత దీపం స్విగ్గీ... ఓ అంకుర సంస్థగా ప్రారంభమై ఇప్పుడు వేల కోట్ల వ్యాపారం చేస్తున్న స్విగ్గీ వెనకున్న మాస్టర్ మైండ్ తెలుగోడిదని ఎంతమందికి తెలుసు...?

  • Written By:
  • Publish Date - November 16, 2024 / 07:52 PM IST

స్విగ్గీ…సిటీలో స్మార్ట్ ఫోన్ ఉందంటే ఖచ్చితంగా అందులో స్విగ్గీ యాప్ ఉండాల్సిందే. ఎనీ టైమ్ మీ ఆకలి తీర్చే అల్లాఉద్దీన్ అద్భుత దీపం స్విగ్గీ… ఓ అంకుర సంస్థగా ప్రారంభమై ఇప్పుడు వేల కోట్ల వ్యాపారం చేస్తున్న స్విగ్గీ వెనకున్న మాస్టర్ మైండ్ తెలుగోడిదని ఎంతమందికి తెలుసు…? ఆ వ్యక్తే స్విగ్గీ వ్యవస్థాపకుడు, సీఈఓ శ్రీహర్ష మాజేటి. నేటి తరానికి ఓ రోల్ మోడల్…
……
ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేసే టైమ్ లేదా…? వంట వండుకునేందుకు కుదరలేదా…? సాయంత్రం సరదాగా స్నాక్స్ తినాలనిపిస్తోందా…? అన్నిటికీ ఒకటే మంత్రం స్విగ్గీ… ఓపెన్ చెయ్… ఆర్డర్ చెయ్… ఫుడ్ ఎంజాయ్ చెయ్…. ఇప్పుడు ఇన్ స్టా మార్ట్ పేరుతో సరుకులు కూడా 10నిమిషాల్లో డెలివరీ చేస్తూ జెట్ స్పీడ్ తో దూసుకెళుతోంది స్విగ్గీ. కొన్ని వేల రూపాయల పెట్టుబడితో ప్రారంభమైన స్విగ్గీ పదేళ్లలో ఐపీఓ ద్వారా 11వేల 3వందల కోట్లను సమీకరించిందంటే ఆషామాషీ కాదు. మార్కెట్ లో ఫుడ్ డెలివరీ యాప్స్ ఎన్ని ఉన్నా అన్నిట్లో తోపు స్విగ్గీ…

ఇది స్విగ్గీ ట్రాక్ రికార్డే కాదు ఇండస్ట్రీ రికార్డ్ కూడా… సినిమాల్లో చూపినట్లు స్విగ్గీ ఇలా పుట్టి అలా ఓవర్ నైట్ లో ఎదిగిపోలేదు. మ్యాజిక్కులు చేయలేదు. వినూత్న వ్యూహాలతో కస్టమర్ల నమ్మకాన్ని చూరగొంటూ పదేళ్లలో అది సాధించిన విజయం ఎందరికో ఆదర్శం.

శ్రీహర్ష దార్శనికత, ఇద్దరు మిత్రుల అండ, కొన్ని వందల మంది ఉద్యోగుల కఠోర శ్రమ, ఎన్నో నిద్రలేని రాత్రులు, ఎన్నో ఎదురుదెబ్బలు మరెన్నో సవాళ్లు అన్నీ కలిపి స్విగ్గీని అంకుర సంస్థ నుంచి దిగ్గజ సంస్థగా మార్చాయి. నేటి మేనెజ్ మెంట్ గురూలకే ఓ పాఠం స్విగ్గీ ప్రస్థానం.

మాజేటి శ్రీహర్ష పుట్టింది విజయవాడలో. తండ్రికి రెస్టారెంట్ ఉంది. తల్లి డాక్టర్. ఒకరి నుంచి క్రమశిక్షణ, మరొకరి నుంచి వ్యాపార నైపుణ్యం నేర్చుకున్నాడు. బిట్స్ పిలానీలో బీటెక్ తో పాటు ఫిజిక్స్ లో ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ చేశాడు. ఆ సమయంలోనే నందన్ రెడ్డి పరిచయం అయ్యాడు. అతను హర్షకు రెండేళ్ల జూనియర్. ఆ తర్వాత హర్ష కోల్ కతా ఎంఐఎంలో ఎంబీఏ చేశాడు. ఉద్యోగ అవకాశాలు తలపు తట్టినా అంతగా ఆసక్తి అనిపించలేదు. లండన్ లో కొన్నాళ్లు ఓ ట్రేడింగ్ కంపెనీలో పనిచేశాడు. ఇండియాకు తిరిగి వచ్చి సొంతంగా ఏదో ఒకటి చేయాలన్న ఆలోచనతో దాన్నీ వదిలేశాడు. ఏదైనా సంస్థను ఏర్పాటు చేయాలన్న కలతో స్వదేశానికి తిరిగివచ్చాడు. అప్పటికే నందన్ ఓ స్టార్టప్ లో పనిచేసేవాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి బండిల్ అని ఓ కొరియర్ సంస్థను ఏర్పాటు చేశారు. అమెజాన్, ప్లిఫ్ కార్ట్ సంస్థలకు సేవలు అందించాలన్నది దాని లక్ష్యం. అయితే అప్పటికే అవి సొంతంగా తమ వ్యవస్థలను రెడీ చేసుకోవడంతో కొన్నాళ్లకే బండిల్ ను మూసేయాల్సి వచ్చింది. బండిల్ మూతబడ్డ వారికి ఎన్నో పాఠాలు నేర్పింది. విలువైన అనుభవాన్ని అందించింది. ఇంకా ఏం చేయాలా అని తపనపడుతున్న ఆ సమయంలో ఐఐటీ ఖరగ్ పూర్ లో చదువుకుని మింత్రాలో పని చేస్తున్న రాహుల్ జైమిని కామన్ ఫ్రెండ్స్ ద్వారా శ్రీహర్షకు పరిచయం అయ్యాడు. ఈ ముగ్గురూ కలిసి ఏదైనా కొత్తగా చేయలనుకున్నారు. ముగ్గురూ బ్యాచిలర్సే కావడంతో హోటల్ నుంచి ఫుడ్ ఆర్డర్ చేసే సమయంలో తాము ఎదుర్కొన్న ఇబ్బందులే వారికి ఓ దారి చూపాయి. తాము చేయాలనుకున్న డెలివరీ వ్యాపారాన్ని ఫుడ్ డెలివరీగా మార్చేశారు. అదే స్విగ్గీ. 2014లో ముగ్గురూ కలిసి 20రెస్టారెంట్లతో మాట్లాడి ఓ ఆన్ లైన్ ప్లాట్ ఫామ్ ను సిద్ధం చేశారు. ఐదుగురు డెలివరీ బాయ్స్ ను ఏర్పాటు చేసుకున్నారు. కానీ తొలిరోజు వారికి ఒక్క ఆర్డర్ కూడా రాలేదు. రెండో రోజు కేవలం రెండు ఆర్డర్లు మాత్రమే వచ్చాయి. అయినా నిరాశ పడలేదు. అదే ఉత్సాహంతో పనిచేశారు. ఆ తర్వాత ఆ నోటా ఈ నోటా స్విగ్గీ పేరు అందరికీ తెలిసింది. ఇప్పుడు ప్రతి ఇంటికీ చేరింది.

2018లో 16 నగరాల్లో స్విగ్గీ సేవలు అందేవి. కానీ 2019నాటికి అది ఏకంగా 5వందల నగరాలు, పట్టణాలకు చేరింది. 2017లో క్లౌడ్ కిచెన్ ప్రారంభించింది. ఆ వెంటనే స్విగ్గీ యాక్సెస్ పేరుతో కిచెన్ ఇంక్యుబేటర్ వ్యాపారంలోకి దిగింది. 2019లో స్విగ్గీ స్టోర్స్, స్విగ్గీ గో ప్రారంభమయ్యాయి. ఆ తర్వాతే స్విగ్గీ గో స్విగ్గీ జీనీగా మారింది. 2020లో స్విగ్గీ ఇన్ స్టా మార్ట్ ప్రారంభమైంది. ఈ ఏడాది ఏప్రిల్ లో ఐపీఓకు దరఖాస్తు చేసుకుంది. ఇప్పుడు స్విగ్గీ విలువ సుమారు 95వేల కోట్లు. ఎదిగే క్రమంలో పలు సంస్థలు స్విగ్గీలో పెట్టుబడులు పెట్టాయి. పలు చిన్న చిన్న సంస్థలను స్విగ్గీ తనలో విలీనం చేసుకుని తనను తాను విస్తృతం చేసుకుంది.

స్విగ్గీలో ప్రోసెస్ కు సుమారు 31శాతం వాటా ఉంది. సాఫ్ట్ బ్యాంక్ 7.75శాతం వాటాలు సొంతం చేసుకుంది. ఇక ఫౌండర్, ఎండీ శ్రీహర్షకు 6.23 శాతం వాటా ఉంది. ఈ ఏడాది ఈసాప్స్ ద్వారా శ్రీహర్షకు ఏకంగా 1894 కోట్ల 11లక్షలు అందాయి. ఇక ఇన్ స్టా మార్ట్ సీఈఓ అమితేష్ జాకు 126కోట్లకు పైగా ఆదాయం అందింది. తనతో పాటు తన కంపెనీలో పని చేసే ఉద్యోగులను కూడా కోటీశ్వరులను చేశారు మాజేటి శ్రీహర్ష. ఐపీఓకు ముందు కంపెనీలో పనిచేస్తున్న, గతంలో పనిచేసి మానేసిన ఉద్యోగులకు షేర్లు కేటాయించారు. దాని కింద దాదాపు 70మంది ఉద్యోగులకు సగటున ఒక్కొక్కరికి ఎనిమిదిన్నర కోట్ల విలువైన షేర్లు అందాయి. మరో 5వందల మంది ఉద్యోగులు కనీసం కోటి రూపాయల విలువైన షేర్లు అందుకున్నారు.

స్విగ్గీ ఎదుగుదల వెనక ఎంతో మందికి తెలియని ఎన్నో ఇక్కట్లున్నాయి. కొన్ని సందర్భాల్లో పెట్టుబడి ఇబ్బందులు ఎదురయ్యాయి. మిగిలిన ఫుడ్ డెలివరీ సంస్థల నుంచి పోటీని ఎదుర్కోవాల్సి వచ్చింది. కరోనా కొంత దెబ్బతీసింది. కొన్నేళ్లు నష్టాలు వెంటాడాయి. అయినా కుంగిపోలేదు. ఎప్పటికప్పుడు తనను తాను మెరుగు పరచుకుంటూ, కస్టమర్లకు నాణ్యమైన సేవలు అందేలా జాగ్రత్తలు తీసుకుంటూ, వినూత్న వ్యాపార అవకాశాలు సృష్టించుకుంటూ మార్కెట్ లో తనకంటూ ఓ ప్రత్యేకతను సృష్టించుకుంది. భారత్ లో ఈ కామర్స్ వ్యాపారం ర్యాపిడ్ స్పీడ్ తో పెరుగుతోంది. దాన్ని సాధ్యమైనంత వేగంగా అందిపుచ్చుకోవాలన్నది స్విగ్గీ వ్యూహం. ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. నష్టాలు వచ్చినా భవిష్యత్తు లాభాల అంచనాతో ముందుకు సాగుతోంది.