T BJP: తెలంగాణ బీజేపీకి సంబంధించి ఇటీవల చాలా దుష్ప్రచారం జరుగుతోంది. అధ్యక్షుడు బండి సంజయ్‌ను మారుస్తారని, పార్టీలోంచి ఈటల, కోమటిరెడ్డి వంటి నేతలు బయటకు వెళ్తారని, పార్టీలో అంతర్గత కుమ్ములాటలు పెరిగాయని, బీజేపీ బలహీనపడిందని.. ఇలా చాలా రకాలుగా బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం మొదలైంది. దీనివల్ల పార్టీకి చాలా నష్టం జరిగిందనే మాట సత్యం. ఈ అంశంపై ఇప్పుడు బీజేపీ హైకమాండ్ దృష్టిపెట్టింది. ఈ ప్రచారం వెనుక సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ ఉందని అనుమానిస్తున్న బీజేపీ.. ఇప్పుడు కౌంటర్ స్ట్రాటజీని సిద్ధం చేస్తోంది. బీఆర్ఎస్‌ను ధీటుగా ఎదుర్కొనేలా, పార్టీని తిరిగి గాడిలోపెట్టేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
రాష్ట్ర పరిస్థితులపై ఆరా
తెలంగాణపై కొంతకాలం నుంచి బీజేపీ అధిష్టానం ప్రత్యేక దృష్టిపెట్టిన సంగతి తెలిసిందే. ఇక్కడ ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని ప్లాన్ చేస్తోంది. అయితే, ఇటీవలి కాలంలో పార్టీపై జరిగిన దుష్ప్రచారం మాత్రం పార్టీకి హాని చేస్తోందని అధిష్టానం గుర్తించింది. బండి సంజయ్‌ను తొలగించడం, కిషన్ రెడ్డికి రాష్ట్ర పార్టీ బాధ్యతలు అప్పగించడం, బండికి కేంద్ర మంత్రి పదవి, అసంతృప్తుల తిరుగుబాటు, పార్టీ మార్పు, అంతర్గత కుమ్ములాటలతోపాటు, బీజేపీ-బీఆర్ఎస్ రెండూ ఒకటే అనే ప్రచారం బీజేపీకి భారీ నష్టం కలిగించింది. ఈ ప్రచారం వెనుక ఎవరున్నారో తెలుసుకునేందుకు పార్టీ అధిష్టానం ప్రయత్నిస్తోంది. ఇదంతా బీఆర్ఎస్ కుట్రలో భాగంగానే జరుగుతోందని, దీనిద్వారా బీఆర్ఎస్ రాజకీయ లబ్ధి పొందాలి అనుకుంటోందని బీజేపీ పెద్దలు అనుకుంటున్నారు. మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారంపై జేపీ నద్దా.. బండి సంజయ్‌తో ఫోన్‌లో మాట్లాడారు.
జవాబిచ్చేందుకు బీజేపీ సిద్ధం
తమపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు బీజేపీ సిద్ధమవుతోంది. బీఆర్ఎస్ దుష్ప్రచారానికి ధీటుగా జవాబివ్వడంతోపాటు, కౌంటర్ స్ట్రాటజీని కూడా హైకమాండ్ సిద్ధం చేస్తోంది. పార్టీ నాయకత్వాన్ని మార్చబోవడం లేదని ఇప్పటికే స్పష్టంగా చెప్పింది పార్టీ అధిష్టానం. ఎన్నికలకు సిద్ధం కావాలని రాష్ట్ర నాయకత్వానికి జేపీ నద్దా సూచించారు. ఇందుకు అనుగుణంగా దిగువ స్థాయి నుంచి పార్టీ కార్యవర్గాన్ని సిద్ధం చేయాలన్నారు. బీజేపీలో కీలకంగా ఉన్న పాలక్ వ్యవస్థను బలపర్చడం, చేరికలు పెంచడం, అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేయడం, అసంతృప్త నేతలను బుజ్జగించడం, బూత్ స్థాయి కమిటీల బలోపేతం వంటి అంశాలపై ఫోకస్ చేయాలని హైకమాండ్ సూచించింది. బీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేలా స్పష్టమైన ప్రణాళిక సిద్ధం చేయాలని నిర్ణయించారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటి కాదని.. ఈ విషయంపై, పార్టీపై ప్రజల్లో ఏర్పడిన గందరగోళాన్ని తొలగించాలని కూడా ఆదేశించింది.
జూలై రెండో వారంలో సమావేశం
పార్టీని బలోపేతం చేయాలని భావిస్తున్న అధిష్టానం హైదరాబాద్‌లో ప్రత్యేక సమావేవం నిర్వహించబోతుంది. జూలై రెండో వారంలో 12 రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులు, పార్టీ సంస్థాగత కార్యదర్శులు, ఇతర నేతలతో హైదరాబాద్‌లో సమావేశం జరగనుంది. ఈ సమావేశపు ఏర్పాట్లను వేగవంతం చేయాలని పార్టీ ఆదేశించింది. మరోవైపు బండి సంజయ్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయిలో వివిధ నేతలతో సమావేశాలు జరుగుతున్నాయి. నేతల మధ్య సమన్వయం, పని విభజన, ప్రణాళికల గురించి చర్చిస్తున్నారు.
మోదీ స్పెషల్ ఫోకస్
తెలంగాణపై ప్రధాని మోదీ, అమిత్, జేపీ నద్దా స్పెషల్ ఫోకస్ చేశారని బీజేపీ నేతలు అంటున్నారు. ఈ నేపథ్యంలో నెలకోసారి రాష్ట్రంలో భారీ సభలు, ర్యాలీలు వంటి కార్యక్రమాలు నిర్వహించాలని బీజేపీ భావిస్తోంది. ప్రధాని మోదీ సహా జాతీయ నేతలు ఈ సభలకు హాజరవుతారు. వచ్చే నెలలో మోదీ తెలంగాణ పర్యటన ఇప్పటికే ఖరారైంది. ఈ సభల ద్వారా బీఆర్ఎస్‌పై ఘాటైన విమర్శలు చేసేందుకు బీజేపీ సిద్ధమవుతోంది. బీఆర్ఎస్ అవినీతి, వైఫల్యాలు, కుటుంబ పాలనతోపాటు, కేంద్ర ప్రభుత్వ పథకాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ నిర్ణయించింది.