T Congress: కర్ణాటక ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ పార్టీకి ఎక్కడలేని జోష్ వచ్చింది. దీంతో అధికారమే లక్ష్యంగా తెలంగాణ కాంగ్రెస్ పావులు కదుపుతోంది. దీనికి అనుగుణంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సరికొత్త వ్యూహాలతో ముందుకెళ్తున్నారు. తాజాగా ఒక సరికొత్త ప్లాన్ అమలుచేయబోతున్నట్లు తెలుస్తోంది. అదే బీజేపీ, బీఆర్ఎస్‌కు చెందిన అసంతృప్త కిందిస్థాయి నేతలను ఆకర్షించడం.
ఏ నాయకుడికైనా, పార్టీకైనా కిందిస్థాయి నేతలే బలం. సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, వార్డు మెంబర్లు, ఇతర నామినేటెడ్ సభ్యులు, అలాంటి పదవులు ఆశిస్తున్న కిందిస్థాయి నేతలే నాయకుల బలం. ఎమ్మెల్యే, ఎంపీ.. ఎవరికైనా అలాంటి నేతలతోనే బూత్ స్థాయిలో ఓట్లు పడతాయి. ఈ నేతలే లేకపోతే ఎంతపెద్ద నాయకుడికైనా ఓటమి తప్పదు. అందుకే ఇప్పుడు ఇలాంటి స్థానిక, కింది స్థాయి నేతలపై రేవంత్ గురిపెట్టారు. వారిని తమ పార్టీలోకి చేర్చుకోవడం ద్వారా బీఆర్ఎస్, బీజేపీ నేతలను దెబ్బకొట్టాలనుకుంటున్నారు. కర్ణాటకలో ఇదే విధానాన్ని అమలు చేసిన కాంగ్రెస్ అక్కడ విజయం సాధించింది. అందుకే తెలంగాణలో కూడా ఇదే స్ట్రాటజీని అమలు చేయబోతుంది.
ఖమ్మంలో సక్సెస్
కిందిస్థాయి నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరితే.. వారినే నమ్ముకున్న పెద్ద నేతలు కూడా కాంగ్రెస్‌లో చేరుతారని ఆ పార్టీ భావిస్తోంది. ఈ దిశగా ఖమ్మంలో ప్రయత్నించగా ఈ విధానం ఇప్పటికే సక్సెస్ అయింది. ఖమ్మంలో పొంగులేటిని, జూపల్లిని బీఆర్ఎస్ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఈ ఇద్దరూ ఏ పార్టీలో చేరాలో తెలియక సతమతమయ్యారు. అదే సమయంలో వారి అనుచరులను కాంగ్రెస్ తనవైపు తిప్పుకొంది. గ్రామ, మండలస్థాయి నేతలను నెమ్మదిగా కాంగ్రెస్ లాక్కుంది. అంతకుముందు బీఆర్ఎస్‌కు చెందిన వీరికి ప్రత్యామ్నాయంగా బీజేపీ కనిపించినప్పటికీ.. అటువైపు వెళ్లకుండా చూడటంలో కాంగ్రెస్ సక్సెస్ అయింది. రేవంత్ ప్రత్యేక చొరవ తీసుకుని ఎక్కువ మంది నేతలు కాంగ్రెస్ వైపు వచ్చేలా చేశారు. తమ అనుచరుల్లో ఎక్కవ మంది కాంగ్రెస్‌లో చేరడంతో పొంగులేటి, జూపల్లి కూడా కాంగ్రెస్‌లో చేరక తప్పని పరిస్థితి నెలకొంది. చివరకు ఇద్దరూ కాంగ్రెస్‌లో చేరబోతున్న సంగతి తెలిసిందే.
బీఆర్ఎస్ సిట్టింగులపై గురి
రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో చాలా మందికి సీట్లు వచ్చే అవకాశం లేదని కేసీఆర్ తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది. 25-30 మంది ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు రాకపోవచ్చని ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే వాళ్లంతా ఇతర పార్టీలవైపు చూస్తారు. దీంతో ఆ ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలతోపాటు ఇతర పార్టీల్లో ఉన్న కీలక నేతలపై కాంగ్రెస్ గురిపెట్టింది. బలమైన నేతలను పార్టీలో చేర్చుకుని బలపడాలని కాంగ్రెస్ భావిస్తోంది. దీనికోసం ఆపరేషన్ ఆకర్ష్ ప్లాన్ చేస్తోంది. వివిధ నేతలతో రహస్యంగా చర్చలు జరుపుతోంది. బెంగళూరు, ఢిల్లీ కేంద్రంగా కొందరు నేతలు నేరుగా పార్టీ పెద్దలను కలిసి చర్చలు జరుపుతున్నారు. మరికొద్ది రోజుల్లో ఇంకొందరు నేతలు కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉంది.