T CONGRESS: కాంగ్రెస్‌లో అప్లికేషన్ల స్వీకరణ పూర్తి.. పార్టీలోకి కొత్తవాళ్లొస్తే పరిస్థితి ఏంటి..?

కొత్త వారిని పార్టీలోకి చేర్చుకుని, చివరి నిమిషంలో టిక్కెట్ ఇస్తే ఏ పార్టీ వారికైనా ఇబ్బందే. అప్పటివరకు పార్టీలో ఉన్న నేతలు తిరుగుబాటు చేస్తారు. దీనివల్ల కొంత క్యాడర్ కూడా వెళ్లిపోతుంది. ఈ నేతలను బుజ్జగించడం పార్టీ పెద్దలకు తలకుమించిన భారం.

  • Written By:
  • Publish Date - August 27, 2023 / 03:04 PM IST

T CONGRESS: గతంలో ఎప్పుడూ లేని విధంగా తెలంగాణలో ఎమ్మెల్యే టిక్కెట్ల కోసం అభ్యర్థుల నుంచి కాంగ్రెస్ పార్టీ దరఖాస్తులు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఈ నెల 18 నుంచి 25 వరకు దరఖాస్తుల స్వీకరణ కొనసాగింది. దరఖాస్తు గడువు ముగియడంతో కాంగ్రెస్‌కు కొత్త చిక్కు వచ్చి పడే అవకాశం ఉంది. అదే.. ఇతర పార్టీల నేతలను చేర్చుకుని టిక్కెట్ ఇస్తారా..? ఇస్తే పాత వాళ్లు ఊరుకుంటారా..? అని.
తెలంగాణలోని 119 అసెంబ్లీ స్థానాలకుగాను కాంగ్రెస్ పార్టీకి వెయ్యికిపైగా దరఖాస్తులు వచ్చాయి.

కొన్ని నియోజకవర్గాలకు పది నుంచి ఇరవై దరఖాస్తులు వచ్చాయి. అంటే టిక్కెట్ల కోసం పోటీ ఎక్కువగా ఉంది. అన్ని స్థానాలకు దరఖాస్తులొచ్చాయి. సెప్టెంబర్ 15 వరకు అభ్యర్థుల్ని ఎంపిక చేసి, ప్రకటిస్తారు. పార్టీ లెక్క ప్రకారం అయితే, ఇప్పటికే దరఖాస్తులు చేసుకున్న వారిలోంచే అర్హులకు టిక్కెట్లు ఇవ్వాలి. కానీ, ఈ లెక్క మారేలా కనిపిస్తోంది. కారణం.. ఇంకా కొంతమంది ఇతర పార్టీల నేతలు కాంగ్రెస్‌లో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఖమ్మం జిల్లాకు చెందిన తుమ్మల నాగేశ్వర రావు, బీఆర్ఎస్ రెబల్‌గా ఉన్న మైనంపల్లి హన్మంతరావుతోపాటు బీఆర్ఎస్‌లో టిక్కెట్లు దక్కని పలువురు నేతలు కాంగ్రెస్‌లో చేరే యోచన చేస్తున్నారు. అలాగే బీజేపీలో కీలకంగా ఉన్న మాజీ ఎంపీ వివేక్ వంటి నేతలు కూడా కాంగ్రెస్‌వైపు చూస్తున్నారు. మరి వీళ్లందరినీ పార్టీలోకి చేర్చుకుని, టిక్కెట్ ఇస్తే.. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారి సంగతేంటి..? వారి నుంచి వ్యతిరేకత రాదా..? ఇదే ఇప్పుడు కాంగ్రెస్‌ను ఇబ్బంది పెడుతున్న అంశం.
కొత్త వారిని పార్టీలోకి చేర్చుకుని, చివరి నిమిషంలో టిక్కెట్ ఇస్తే ఏ పార్టీ వారికైనా ఇబ్బందే. అప్పటివరకు పార్టీలో ఉన్న నేతలు తిరుగుబాటు చేస్తారు. దీనివల్ల కొంత క్యాడర్ కూడా వెళ్లిపోతుంది. ఈ నేతలను బుజ్జగించడం పార్టీ పెద్దలకు తలకుమించిన భారం. అందులోనూ ఇప్పుడు కాంగ్రెస్ అనుసరించిన వ్యూహం ఆ పార్టీని మరింత ఇబ్బంది పెట్టేదే. ఎందుకంటే వేరే పార్టీ నేతలను చేర్చుకోవాలి అనుకుంటే తమ నుంచి దరఖాస్తులు ఎందుకు తీసుకున్నారు అని ఆయా నాయకులు ప్రశ్నించే అవకాశం ఉంది. పైగా దరఖాస్తు ఫీజు కూడా లక్షల్లో ఉంది. దరఖాస్తు చేసుకున్న వారికి కాకుండా.. బయటి వారికి టిక్కెట్లు ఇస్తే ఆ పార్టీపై నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది. అలాగని తుమ్మల, మైనంపల్లి, వివేక్ వంటి నేతలు పార్టీలోకి వస్తామంటే వద్దని చెప్పలేని పరిస్థితి. ఈ విషయంలో పార్టీలో చేరాలనుకుంటున్న నేతలకు కూడా సందేహాలున్నాయి. తాము పార్టీలో చేరితే టిక్కెట్ ఇస్తారా..? ఇచ్చినా.. పార్టీలో అప్పటివరకు ఉన్న నేతలు మద్దతిస్తారా..? వంటి సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితిని కాంగ్రెస్ ఎలా చక్కదిద్దుతుందో చూడాలి.