MLA T RAJAIAH: పల్లాను పట్టించుకోని రాజయ్య.. ప్లేట్‌ ఫిరాయించడం ఖాయమా..

స్టేషన్‌ ఘన్‌పూర్‌లో రాజయ్యను పక్కన పెట్టిన కేసీఆర్‌.. కడియం శ్రీహరికి అవకాశం కల్పించారు. దీంతో రాజయ్య అసంతృప్తితో ఉన్నారు. ఐతే ఆయనను కూల్‌ చేసేందుకు పల్లా రాజేశ్వర్‌ రెడ్డిని పంపించారు కేసీఆర్. అయినాసరే.. ఎలాంటి బుజ్జగింపులకు లొంగేది లేదు అన్నట్లుగా రాజయ్య వ్యవహారిస్తున్నారు.

  • Written By:
  • Publish Date - August 23, 2023 / 03:07 PM IST

MLA T RAJAIAH: ఎమ్మెల్యే అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్‌.. బీఆర్ఎస్‌ వర్గాల్లో కలకలం రేపుతోంది. అసంతృప్తులు, అలకలు పీక్స్‌కు చేరిపోయాయి. కొందరు సిట్టింగ్‌లను మార్చిన కేసీఆర్‌.. కొత్త వారికి పోటీ చేసే అవకాశం కల్పించారు. మిగతా చోట్ల ఎలా ఉన్నా.. స్టేషన్‌ ఘన్‌పూర్‌లో మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్య, ఆయన అనుచరుల్లో తీవ్ర స్థాయిలో అసంతృప్తి కనిపిస్తోంది. అంబేద్కర్ విగ్రహానికి దండం పెట్టి బోరున విలపించిన రాజయ్య.. అభిమానులు, అనుచరులను చూసి కన్నీటి పర్యంతం అయ్యారు.

సోషల్‌ మీడియాలో ఈ వీడియో వీడియోలు వైరల్ అవుతుండగా.. పరిస్థితిని చక్కదిద్దేందుకు బీఆర్ఎస్ హైకమాండ్ రంగంలోకి దిగింది. స్టేషన్‌ ఘన్‌పూర్‌లో రాజయ్యను పక్కన పెట్టిన కేసీఆర్‌.. కడియం శ్రీహరికి అవకాశం కల్పించారు. దీంతో రాజయ్య అసంతృప్తితో ఉన్నారు. ఐతే ఆయనను కూల్‌ చేసేందుకు పల్లా రాజేశ్వర్‌ రెడ్డిని పంపించారు కేసీఆర్. అయినాసరే.. ఎలాంటి బుజ్జగింపులకు లొంగేది లేదు అన్నట్లుగా రాజయ్య వ్యవహారిస్తున్నారు. రాజయ్యను కలిసేందుకు హన్మకొండలోని ఇంటికి పల్లా రాజేశ్వర్ రెడ్డి వెళ్లగా.. రాజయ్య కనీసం పట్టించుకోలేదు. ఆ సమయంలో ఆయన ఇంట్లో లేరు. పల్లాను కలవడానికి కూడా రాజయ్య ఇష్టపడినట్లు కనిపించలేదు. టికెట్ ప్రకటించిన తర్వాత మొదటిసారి స్టేషన్‌ ఘన్‌పూర్‌కు వస్తున్న కడియం శ్రీహరికి ఘన స్వాగతం పలికేందుకు ఆయన అనుచరవర్గం భారీ ర్యాలీ ఏర్పాటు చేసింది.

ఇందులో పాల్గొనేందుకు రావాలంటూ ఎమ్మెల్యే రాజయ్యకు ఫోన్‌ చేసి చెప్పారు పల్లా రాజేశ్వర్‌ రెడ్డి. ఇంటికి వెళ్లి ఇదే విషయం చెప్పాలని పల్లా ప్రయత్నించగా ఆయనను కలిసేందుకు కూడా రాజయ్య ఇష్టపడలేదు. ప్రస్తుతం వేరే పనిలో ఉన్నానని.. మళ్లీ కలుస్తానంటూ సున్నితంగా పల్లాను వెనక్కి పంపించేశారు. దీంతో రాజయ్య అనుచరులను కలిసి, పల్లా రాజేశ్వర్‌ రెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయారు. రాజయ్య రాజకీయ భవిష్యత్‌ గురించి సీఎం కేసీఆర్ చూసుకుంటారని.. ఎవరూ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అనుచరులకు పల్లా వివరించే ప్రయత్నం చేశారు. రాజయ్య తీరు చూస్తుంటే.. కారు పార్టీకి హ్యాండ్ ఇచ్చేలా కనిపిస్తున్నారనే చర్చ జరుగుతోంది.