Andhra Pradesh: ఏపీలో విద్యార్థులకు ట్యాబ్‌ల కష్టాలు.. పని చేయని ట్యాబ్‌లతో ఇక్కట్లు..!

విద్యార్థులందరికీ సమాన అవకాశాలు దక్కాలనే ఉద్దేశంతోనే ఏపీలో ట్యాబ్‌ల పంపిణీ చేపట్టినట్లు సీఎం జగన్ అప్పట్లో చెప్పారు. ఈ ట్యాబ్లెట్లకు మూడేళ్ల వారెంటీ ఉన్నట్లు, వాటిలో ఏమైనా సమస్యలొస్తే వారం రోజుల్లో సరి చేసి ఇస్తారని, లేదంటే కొత్తవి ఇస్తారని చెప్పారు.

  • Written By:
  • Publish Date - September 3, 2023 / 07:46 PM IST

Andhra Pradesh: డిజిటల్ లెర్నింగ్‌ను ప్రోత్సహిస్తున్నామంటూ ఏపీ ప్రభుత్వం విద్యార్థులకు గతేడాది పంపిణీ చేసిన ట్యాబ్లెట్లు ఇప్పుడు చాలా వరకు పనిచేయకుండా పోయాయని తెలుస్తోంది. గత డిసెంబర్ 21న ఏపీలోని విద్యార్థులకు సీఎం జగన్ ట్యాబ్లెట్లు పంపిణీ చేశారు. అప్పుడు రాష్ట్రంలో 8వ తరగతి చదువుతున్న 4,59,564 మంది విద్యార్థులకు ట్యాబ్‌లను ఉచితంగా అందించారు. దీనికోసం ప్రభుత్వం రూ.686 కోట్లు వెచ్చించింది. అలాగే విద్యార్థులకు పాఠాలు చెప్పే 59,176 మంది టీచర్లకు కూడా ట్యాబ్లెట్లు ఇచ్చారు. కానీ, ఏడాది గడవకముందే ఈ ట్యాబ్లెట్లకు సంబంధించి చాలా వరకు వివిధ కారణాలతో పని చేయకుండా తయారయ్యాయి. దీంతో వాటి ప్రయోజనం నెరవేరడం లేదని విద్యార్థులు, ఉపాధ్యాయులు అంటున్నారు.
సీఎం జగన్ ఏం చెప్పారు..?
విద్యార్థులందరికీ సమాన అవకాశాలు దక్కాలనే ఉద్దేశంతోనే ఏపీలో ట్యాబ్‌ల పంపిణీ చేపట్టినట్లు సీఎం జగన్ అప్పట్లో చెప్పారు. ఈ ట్యాబ్లెట్లకు మూడేళ్ల వారెంటీ ఉన్నట్లు, వాటిలో ఏమైనా సమస్యలొస్తే వారం రోజుల్లో సరి చేసి ఇస్తారని, లేదంటే కొత్తవి ఇస్తారని చెప్పారు. ప్రభుత్వం అందించిన ట్యాబ్‌ మార్కెట్ విలువ రూ.12,800 కాగా, కంటెంట్‌తో కలిపి విలువ రూ.32 వేలు ఖర్చవుతున్నట్లు ప్రభుత్వం తెలిపింది. 8వ తరగతిలో వీటిని పొందిన విద్యార్థులు పదో తరగతి వరకు వినియోగించుకోవచ్చని చెప్పింది. బైజూస్ కంపెనీ రూపొందించిన ఎడ్యుకేషన్ కంటెంట్‌ని వీటిలో అప్‌లోడ్ చేశారు. అయితే, ప్రస్తుతం వీటి వినియోగంలో సమస్యలున్నాయని విద్యార్థులు అంటున్నారు. వీటి వినియోగంలో సరైన అవగాహన లేకపోవడం, సాంకేతిక సమస్యల కారణంగా మూడోవంతు ట్యాబ్‌లు పని చేయడం లేదంటున్నారు.

కొందరిదగ్గర ట్యాబ్స్ లేవు. అలాగే కొందరు మొబైల్ గేమ్స్ డౌన్‌లోడ్ చేసుకుని ఆడుతున్నట్లు తెలుస్తోంది. ఇతర యాప్స్ డౌన్‌లోడ్ కాకుండా చూసినా, వాటిని మార్చేసి ఇతర యాప్స్ ఇన్‌స్టాల్ చేస్తున్నారు. పని చేయని వాటిని సచివాలయంలో అందిస్తే, రిపేర్ చేస్తారని ప్రభుత్వం చెప్పినప్పటికీ ఆచరణలో అమలుకావడం లేదని ఉపాధ్యాయులు ఆవేదన చెందుతున్నారు. చాలాకాలంగా ఇవి పని చేయకపోవడంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు. దీంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని విద్యార్థులు, టీచర్లు కోరుతున్నారు.