తెలంగాణలో బీఆర్‌ఎస్ పార్టీలో వలసలు కంటిన్యూ అవుతున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత చాలా మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యే పార్టీ మారారు. కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇప్పుడు మరో సీనియర్ నేత కూడా పార్టీ మారేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్టు రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఇందుకోసం యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్‌తో రాహుల్‌కు రాయబారం పంపినట్టు సమాచారం.
చాలా కాలంగా అఖిలేష్‌తో మంచి సంబంధాలు కంటిన్యూ చేస్తున్న తలసాని ఇప్పుడు కాంగ్రెస్‌లోకి ఎంట్రీ విషయం కూడా అఖిలేష్‌కే అప్పగించినట్టు తెలుస్తోంది. ఈ విషయంపై ఇప్పటికే రాహుల్ గాంధీతో అఖిలేష్ మాట్లాడారట. రాహుల్ ఓకే అంటే ఆయన చేతుల మీదుగానే తలసాని కాంగ్రెస్‌లో చేరతారంటూ టాక్ నడుస్తోంది. తెలంగాణలో ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డికి తలసానికి మధ్య ఓ పెద్ద మాటల యుద్ధమే జరిగింది. అవినీతి ఆరోపణలతో ఒకరిమీద ఒకరు దుమ్మెత్తి పోసుకున్నారు.
ఆ గొడవ కారణంగా వచ్చిన గ్యాప్ వల్లే ఇప్పుడు తలసాని డైరెక్ట్‌గా ఢిల్లీ నుంచి ఆపరేట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. దాంతో పాటు రాహుల్ సారధ్యంలో పార్టీలోకి వస్తే.. లోకల్ లీడర్స్ నుంచి పెద్దగా ఒత్తిడి ఉండదు అనే ఆలోచనలో కూడా తలసాని ఉన్నట్టు సమాచారం. కానీ ఈ విషయంలో తలసాని నుంచి గానీ ఆయన అనుచర వర్గం నుంచి గానీ ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. రాహుల్ ఇచ్చే సమాధానం కోసమే ఆయన వెయిట్ చేస్తున్నట్టు చర్చ జోరుగానే సాగుతోంది. ఈ విషయంలో తలసాని ఎప్పుడు వివరణ ఇస్తారో.. లేక జాయినింగ్‌తో నేరుగా సమాధానం చెప్తారో చూడాలి.