TDP-BJP: తెలంగాణలో బీజేపీ, టీడీపీ కలసి పోటీ చేస్తాయా..? ఖమ్మం ఎంపీ సీటును టీడీపీకి కేటాయిస్తున్నారా..? ఏపీలో NDA కూటమిలో చేరిన టీడీపీ.. బీజేపీ పొత్తుతో తెలంగాణలో పోటీ చేయబోతోందా..? ఖమ్మం ఎంపీ సీటుపై గత నాలుగైదు రోజులుగా ఇవే ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఇప్పటికే తెలంగాణలో 15 స్థానాలను అభ్యర్థుల్ని ప్రకటించిన బీజేపీ అధిష్టానం.. వరంగల్, ఖమ్మం సీట్లను మాత్రమే పెండింగ్‌లో పెట్టింది. అయితే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు చేరికతో ఆయనకు ఖమ్మం బీజేపీ టిక్కెట్ ఇస్తారన్న టాక్ నడిచింది.
CONGRESS MP SEATS: టిక్కెట్ల కోసం కాంగ్రెస్‌లో కుమ్ములాట.. లిస్టు రెడీ అయ్యేదెప్పుడు..?
మహబూబాబాద్ మాజీ ఎంపీ సీతారామ్ నాయక్‌తో పాటే జలగం కూడా కమలం పార్టీలో చేరారు. ఆ తర్వాత లిస్టులో మానుకోటకు సీతారాం నాయక్ పేరు ప్రకటించింది బీజేపీ అధిష్టానం. కానీ ఖమ్మం పెండింగ్‌లో పెట్టడంతో రకరకాల ఊహాగానాలు చెలరేగుతున్నాయి. తెలంగాణలో బీజేపీ – బీఆర్ఎస్ మధ్య పొత్తు ఉంటుందన్న ఊహాగానాలతో గత అసెంబ్లీ ఎన్నికల్లో కమలం పార్టీకి దెబ్బపడింది. అప్పుడు జనసేనతో కలసి పోటీ చేసినా పెద్దగా ప్రయోజనం ఏమీ లేదు. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికలకు కూడా కారు-కమలం కలుస్తాయన్న టాక్ రావడంతో అమిత్ షాతో పాటు కిషన్ రెడ్డి కూడా ఖండించారు. ఎమ్మెల్సీ కవిత అరెస్ట్‌తో తమ మధ్య ఎలాంటి బంధం లేదన్న టాక్ జనంలోకి పంపారు. ఇక తెలంగాణలో టీడీపీని కేసీఆర్ నిర్వీర్యం చేశారు. ఆ పార్టీకి ఇక్కడ మనుగడ లేదు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయకపోవడంతో చాలామంది లీడర్లు వేరే పార్టీల్లోకి జంప్ అయ్యారు. ఖమ్మం జిల్లాలో కమ్మ సామాజిక వర్గం ఓట్లు ఉన్నాయి. టీడీపీ ఓటు బ్యాంక్, ఎన్టీఆర్ అభిమానులు ఉన్నారు. ఈ జిల్లాలో బీజేపీ ఇప్పటి దాకా గెలిచిన చరిత్ర లేదు. అందువల్ల టీడీపీకి టిక్కెట్ ఇస్తే.. ఖమ్మం సీటు NDA ఖాతాలో పడుతుందని బీజేపీ అధిష్టానం భావిస్తోందని అంటున్నారు. ఇక్కడ టీడీపీ పోటీ చేస్తే.. కాంగ్రెస్‌కు గట్టి పోటీ ఇవ్వొచ్చని సర్వే సంస్థలు చెప్పాయని బీజేపీ పెద్దలు ఈనిర్ణయానికి వచ్చారని టాక్ నడుస్తోంది.
బీఆర్ఎస్ నుంచి పోటీలో ఉన్న నామా నాగేశ్వరరావు.. అంతగా ఇంట్రెస్ట్ లేకున్నా పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్‌లో ఎవర్ని నిలబెట్టినా గ్రూప్ తగాదాలతో గెలుపు కష్టమని బీజేపీ అంచనా వేస్తోంది. అయితే మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు మాత్రం ఖమ్మం టిక్కెట్ తనకే వస్తుందని అంటున్నారు. వరంగల్ కోసమే ఈ సీటు ప్రకటన ఆపేశారనీ.. రెండూ కలిపి ఒకేసారి అనౌన్స్ చేస్తారని అంటున్నారు. ఖమ్మం సీటు టీడీపీకి ఇచ్చే ఛాన్స్ లేదని తన అనుచరులతో చెబుతున్నారు జలగం. ఈనెల 22న ప్రకటించే అభ్యర్థుల జాబితాలో ఖమ్మం టిక్కెట్ బీజేపీ ఎవరికి కేటాయిస్తుందన్నది తేలిపోతుంది.