AP Madugula TDP: మాడుగుల టీడీపీకా.. జనసేనకా..? జుట్టు పీక్కుంటున్న తెలుగు తమ్ముళ్ళు

ఉప ముఖ్యమంత్రి స్పీడుకు బ్రేకులు వేయడమే కాకుండా, మాడుగులలో పార్టీకి పూర్వవైభవం తేవాలనేది టీడీపీ హైకమాండ్ పట్టుదల. ఈ దిశగా అనేక ప్రయోగాలు చేస్తోంది. మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు మరోసారి చాన్స్ కోసం ఎదురు చూస్తున్నారు.

  • Written By:
  • Publish Date - February 7, 2024 / 05:48 PM IST

AP Madugula TDP: అనకాపల్లి జిల్లా, మాడుగుల అసెంబ్లీ నియోజకవర్గం.. డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు ఇలాఖా. సర్పంచ్ నుంచి ఉప ముఖ్యమంత్రి స్ధాయికి ఎదిగిన అనుభవంతో నియోజకవర్గంలో వైసీపీకి కంచుకోట కట్టారు బూడి. గ్రామీణ ఓటర్లలో ఫ్యాన్ జోరు తగ్గలేదనే అంచనాతో హ్యాట్రిక్‌ కోసం హుషారుగా పని చేస్తోంది డిప్యూటీ సీఎం వర్గం. ఇదే సీటు ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఇజ్జత్ కా సవాల్ అయిందట. ఉప ముఖ్యమంత్రి స్పీడుకు బ్రేకులు వేయడమే కాకుండా, మాడుగులలో పార్టీకి పూర్వవైభవం తేవాలనేది హైకమాండ్ పట్టుదల. ఈ దిశగా అనేక ప్రయోగాలు చేస్తోంది. మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు మరోసారి చాన్స్ కోసం ఎదురు చూస్తున్నారు.

Rishabh Pant: పంత్ ఐపీఎల్ ఆడతాడు కానీ.. ఢిల్లీ కోచ్ పాంటింగ్ కీలక వ్యాఖ్యలు

గెలిచినా, ఓడినా మాడుగులలోనే అంటూ పార్టీ కార్యకలాపాలను విస్తృతం చేస్తున్నారు. నియోజకవర్గ ఇన్చార్జ్‌గా పీవీజీ కుమార్ తనకు ఒక్క చాన్స్ అంటూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఈ ఇద్దరి మధ్యా సీటు పోటీ అనుకుంటే NRI పైలా ప్రసాద్ ఎంట్రీతో మాడుగుల టీడీపీలో మూడు ముక్కలాట మొదలైంది. నేతల బలాలు, బలహీనతల మీద చర్చ జరుగుతుండగా పైలా ప్రసాద్‌ రాజమండ్రి మహానాడులో పార్టీకి కోటి రూపాయలు విరాళం ఇచ్చి ఆర్ధికంగా తన శక్తి ఏంటో చెప్పకనే చెప్పారని అంటున్నాయి పార్టీ వర్గాలు. సరిగ్గా ఇక్కడ నుంచే మాడుగుల టీడీపీలో మడత పేచీ మొదలైంది. ఎనరికి వారు గాడ్‌ఫాదర్స్‌ని వెదుక్కోవడంతో యవ్వారం మరింత రసకందాయంలో పడింది. మాజీఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడికి సీనియర్ నేత అయ్యన్నపాత్రుడికి అత్యంత సన్నిహితుడిగా ముద్ర ఉంది. NRI కోటా సీటు మీద ఆశలు పెట్టుకున్న పైలా ప్రసాద్, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు ఆప్తుడన్న ఇమేజ్ ఉంది. ఎన్నికల ఖర్చుకు వెనకాడాల్సిన అవసరం వుండదు కనుక తనకే ఛాన్స్ అనేది ఆయన లెక్క. ఇక, నియోజకవర్గ సమన్వయకర్త పీవీజీ కుమార్‌ది మరో స్టోరీ. కష్ట కాలంలో పార్టీని భుజానికెత్తుకున్న కుమార్‌.. పోటీకి అవకాశం కల్పిస్తే చాలని ఆశపడుతున్నారు. ఈ మూడు ముక్కలాటతో పరిస్ధితి చేయిదాటిందని పసిగట్టిన అధిష్టానం తాజాగా చంద్రబాబు సభ సమన్వయ బాధ్యతలను సీనియర్ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుకు అప్పగించింది.

REVANTH REDDY: తమ్ముడికి ఛాన్స్‌! మల్కాజ్‌గిరి ఎంపీగా రేవంత్ తమ్ముడు!

కేడర్ అభిప్రాయం, ప్రజాభీష్టం మేరకు సీటు ఖరారు చేస్తామని ముగ్గురు ఆశావహులకు చెప్పి బుజ్జగిస్తూ వస్తోంది నాయకత్వం. దీంతో మాడుగుల రా.. కదలిరా.. సభ మీద ఆశలు పెట్టుకున్నారు ముగ్గురూ. అభ్యర్థిగా పార్టీ అధినేత ఎవరి పేరైనా ప్రకటిస్తారా? లేదా ముగ్గురిలో ఎవరికైనా ప్రాధాన్యం ఇస్తారా అని కేడర్‌ మొత్తం ఆసక్తిగా చూసింది. సభను సక్సెస్‌ చేసి మార్కులు కొట్టేద్దామన్న లక్ష్యంతో ముగ్గురు నేతలు భారీగా ఖర్చుపెట్టి ఎవరికి వారు బలప్రదర్శన కూడా చేశారట. అయితే సభలో డిప్యూటీ సీఎంను ఏకిపారేసిన చంద్రబాబు సొంత నాయకులకు ఝలక్‌ ఇచ్చారు. మాడుగుల టిక్కెట్ ముగ్గురిలో ఎవరికి ఇచ్చినా లేక జనసేనకు కేటాయించినా కలిసి పనిచేయాలని ఆదేశించడంతో ముగ్గురికీ గొంతులో పచ్చివెలక్కాయ పడ్డట్టు అయింది. అసలే సీటు యవ్వారం తేలక జుట్టు పీక్కుంటుంటే ఇప్పుడు ఈయనొచ్చి జనసేన అంటూ గందరగోళాన్ని పెంచి వెళ్ళాడేంటని నిట్టూరుస్తున్నారట ఆశావహులు. సభ తర్వాత అధినేతను కలిసిన రామానాయుడు క్లారిటీ కోసం ప్రయత్నించగా సర్వే రిపోర్టుల ఆధారంగానే నిర్ణయాలు వుంటాయని తేల్చేసినట్టు తెలిసింది. నియోజకవర్గ ఇన్చార్జ్‌గా వున్న పీవీజీ కుమార్‌కు బహిరంగ సభలో మాట్లాడే అవకాశం లేకపోవడంతో ఆయన వర్గం రగిలిపోతోంది.

ఈ ఎపిసోడ్లో తన పాత్ర ఏంటో అర్ధంకాక కలవరపడుతున్నారట ఎన్ఆర్ఐ పైలా ప్రసాద్. వాస్తవానికి యువగళం పాదయాత్రలోనే తన అభ్యర్ధిత్వాన్ని ఖరారు చేసేశారని పైలా వర్గం ప్రచారం చేసుకుంది. కానీ, ఆ దిశగా ఎలాంటి ప్రకటన రాకపోగా ఇప్పుడు చంద్రబాబు పెట్టిన లింకుతో ఈ సీటు టీడీపీదా? జనసేనదా? అనే కొత్త చర్చ షురూ అయింది. కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంక్ ఉన్నప్పటికీ మాడుగుల వెలమల అడ్డా. అందుకే ప్రధాన పార్టీలు ఇక్కడ సీటును అదే సామాజిక వర్గానికి ఇస్తుంటాయి. జనసేన ఇక్కడ పోటీ చేసినా డిప్యూటీ సీఎంను ఢీ కొట్టేంతటి సమర్ధ నాయకత్వం ఆ పార్టీకి లేదు. అలాంటి పరిస్ధితుల్లో టీడీపీ లేక జనసేన అనే మాట చంద్రబాబు నోటి నుంచి ఎందుకు వచ్చింది? ఎన్నికలకు ఇక నిండా రెండు నెలల సమయం కూడా లేకుండా ఇప్పుడు సర్వేలు అంటారేంటన్న ప్రశ్నలు ముగ్గురు ఆశావహుల మెదళ్ళను తొలిచేస్తున్నాయట. మరి ఈ ముగ్గురిలో ఒకరికి సీటు వస్తుందా లేక లేటైనా లేటెస్ట్‌గా నాలుగో కృష్ణుడు తెరమీదకు వస్తారా అన్నది చూడాలి.