TDP-BJP-JANASENA: టీడీపీ, జనసేనతో కలిసి ఏపీలో బీజేపీ పోటీ చేసే అంశంపై సస్పెన్స్ కొనసాగుతోంది. బీజేపీ పొత్తు పెట్టుకుంటుందని ఒకసారి.. పొత్తు లేదని మరోసారి ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు తాజా పరిణామాలు ఆసక్తి కలిగిస్తున్నాయి. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి సహా పలువురు నేతలు ఢిల్లీ వెళ్లారు. అక్కడ వాళ్లు అగ్రనేతలు హోంమంత్రి అమిత్ షా, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలుస్తారు.
BRS-CONGRESS: బీఆర్ఎస్, బీఎస్పీ పొత్తు ఎఫెక్ట్.. కాంగ్రెస్‌లోకి బీఆర్ఎస్ కీలక నేతలు..
గురు, శుక్రవారాల్లో ఈ సమావేశం జరుగుతుంది. ఈ భేటీలో ఏపీలో రాజకీయ పరిణామాలు, బీజేపీ పరిస్థితుల గురించి చర్చిస్తారు. పొత్తు ఉంటే ఎలా ఉంటుంది.. పొత్తు లేకపోతే పరిస్థితి ఏంటి వంటి అంశాలపై చర్చిస్తారు. ఈ సమావేశం తర్వాతే.. జనసేన-టీడీపీతో పొత్తుపై అధిష్టానం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఏపీలో అధికార వైసీపీ.. బీజేపీతో సత్సంబంధాలు కొనసాగిస్తోంది. మరోవైపు జనసేన కూడా బీజేపీతో కలిసే నడుస్తున్నారు. ఇప్పుడు టీడీపీ కూడా బీజేపీతో పొత్తుకు సిద్ధంగానే ఉంది. ఇక.. ఈ విషయంలో తేల్చాల్సింది బీజేపీనే. ఏపీలోని అన్ని పార్టీలు బీజేపీకి అనుకూలంగానే ఉన్నా.. సొంత పార్టీ సింబల్‌పై గెలిపించుకుంటేనే బాగుంటుందని బీజేపీ ఆలోచన. అందుకోసమే పొత్తుదిశగా బీజేపీ పరిశీలిస్తోంది. పొత్తు కుదిరితే.. ఐదు ఎంపీ స్థానాలు, తొమ్మిది నుంచి పది ఎమ్మెల్యే స్థానాలను బీజేపీ కోరే అవకాశముంది. నర్సాపురం, అరకు, తిరుపతి, రాజమండ్రి, రాజంపేట లేదా హిందూపురం ఎంపీ స్థానాలను బీజేపీ అడుగుతోంది.
అలాగే విశాఖ నార్త్, గుంటూరు వెస్ట్, ధర్మవరం, జమ్మలమడుగు, కైకలూరు, శ్రీకాళహస్తితోపాటు తిరుపతి, గోదావరి, అనంతపురం జిల్లాల్లో ఒక్కో సీటును బీజేపీ అడుగుతోందని తెలుస్తోంది. పొత్తు ఖరారైతే.. ఎన్నికల తర్వాత టీడీపీ, జనసేన ఎన్డీయేలో చేరుతాయి. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం.. పొత్తుకు బీజేపీ దాదాపు అంగీకరించిందని తెలుస్తోంది. ఈ విషయంలో స్పష్టత వస్తే.. టీడీపీ, జనసేన కూడా మిగిలిన స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించేందుకు సిద్ధంగా ఉన్నాయి.