Chandrababu Naidu: చంద్రబాబు హౌజ్ కస్టడీ పిటిషన్ తిరస్కరణ.. జైలులోనే మాజీ సీఎం..!

హౌజ్ రిమాండ్ కోరుతూ చంద్రబాబు తరఫు లాయర్లు వేసిన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. చంద్రబాబుకు ప్రాణహాని ఉందని.. హౌస్‌ రిమాండ్‌కు అనుమతించాలని సిద్ధార్థ్‌ లూథ్రా వాదనలు విన్పించారు. ఈ కేసులో సీఐడీ తరఫు న్యాయవాదులు వెలిబుచ్చిన అంశాలను కోర్టు అంగీకరించింది.

  • Written By:
  • Publish Date - September 12, 2023 / 05:58 PM IST

Chandrababu Naidu: ఏసీబీ కోర్టులో చంద్రబాబు నాయుడుకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. చంద్రబాబు హౌజ్ రిమాండ్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. దీంతో ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులోనే ఉండాల్సి వస్తుంది. స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో చంద్రబాబుపై సీబీఐ కోర్టు 14 రోజుల జుడీషియల్ రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. దీంతో చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. దీంతో ఆయన హౌజ్ రిమాండ్/హౌజ్ అరెస్ట్ కోరుతూ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

సోమ, మంగళవారాల్లో ఈ పిటిషన్‌పై విచారణ సాగింది. అనంతరం మంగళవారం సాయంత్రం దీనిపై కోర్టు తీర్పు వెల్లడించింది. హౌజ్ రిమాండ్ కోరుతూ చంద్రబాబు తరఫు లాయర్లు వేసిన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. చంద్రబాబుకు ప్రాణహాని ఉందని.. హౌస్‌ రిమాండ్‌కు అనుమతించాలని సిద్ధార్థ్‌ లూథ్రా వాదనలు విన్పించారు. ఈ కేసులో సీఐడీ తరఫు న్యాయవాదులు వెలిబుచ్చిన అంశాలను కోర్టు అంగీకరించింది. ఇంట్లోకంటే జైలులోనే భద్రత ఉందని, చంద్రబాబు ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు అక్కడ అన్ని రకాల వైద్య సదుపాయాలు ఉన్నాయని, హౌజ్ అరెస్టుకు అనుమతివ్వకూడదని సీఐడీ తరఫు లాయర్లు కోరారు. వీరి వాదనకు ఏకీభవించిన కోర్టు హౌజ్ అరెస్ట్‌ను తిరస్కరించింది. మరోవైపు చంద్రబాబును తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ సీఐడీ కూడా మరో పిటిషన్ వేసింది. ఐదు రోజుల కస్టడీ కావాలని కోరింది. దీనిపై విచారణ కొనసాగుతోంది. మరోవైపు.. చంద్రబాబుపై దాఖలైన నాలుగు కేసుల్లో ఆయన తరపున లాయర్లు హైకోర్టులో తాజాగా బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.

ఇప్పటివరకు మూడు కేసుల్లో చంద్రబాబుపై ఆర్ఐఆర్ దాఖలైంది. అమరావతి ఇన్నర్ రింగు రోడ్డు కేసు, పుంగనూరు అల్లర్లు, స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబును ఏ1గా చేర్చారు. అన్ని కేసుల్లో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులన్నింటిపైనా హైకోర్టులో వాదనలు వినిపించనున్నారు. రాజమండ్రి జైలులో ఉన్న చంద్రబాబుకు ఇంటి భోజనాన్ని వ్యక్తిగత సహాయకుడు తీసుకెళ్లి, జైలులో అందజేస్తున్నాడు. ప్రస్తుతం చంద్రబాబు తనయుడు నారా లోకేష్ సెంట్రల్ జైలు సమీపంలోనే బస చేస్తున్నాడు. జైలులో చంద్రబాబుకు ఒక సహాయకుడు, ఐదుగురు జైలు భద్రత సిబ్బంది రక్షణగా ఉన్నారు. చంద్రబాబు అరెస్టుకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై బుధవారం విచారణ జరగనుంది.