T TDP: తెలంగాణలో టీడీపీ పోటీ.. ఎవరికి ప్లస్..? ఎవరికి మైనస్..? 

తెలంగాణలో రాబోయే ఎన్నికల కోసం టీడీపీ సమాయత్తం అవుతోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధం చేసుకుంటోంది. మరో రెండు రోజుల్లో టీడీపీ అభ్యర్థుల ఫస్ట్ లిస్టు రిలీజ్ అవుతుందని తెలుస్తోంది. ఇందులో దాదాపు 50 నుంచి 60 స్థానాలకు ఆ పార్టీ అభ్యర్థులను ప్రకటించనున్నారని సమాచారం.

  • Written By:
  • Publish Date - August 24, 2023 / 08:21 PM IST

T TDP: టీడీపీ.. తెలంగాణలో ఒకప్పుడు బలమైన రాజకీయ పార్టీ. ఆనాడు తెలంగాణలో గ్రౌండ్ లెవల్‌లో స్ట్రాంగ్ క్యాడర్ కలిగిన పార్టీల్లో టీడీపీ ఒకటి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఇక్కడ టీడీపీ పూర్తిగా తుడిచి పెట్టుకుపోయింది. గత పదేళ్లుగా దాని యాక్టివిటీ ఆగిపోయింది. వలసలే తప్ప చేరికల ముచ్చట లేకుండా పోయింది. అయినా వచ్చే ఎన్నికల కోసం టీడీపీ ఇప్పుడు సమాయత్తం అవుతోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధం చేసుకుంటోంది. మరో రెండు రోజుల్లో టీడీపీ అభ్యర్థుల ఫస్ట్ లిస్టు రిలీజ్ అవుతుందని తెలుస్తోంది. ఇందులో దాదాపు 50 నుంచి 60 స్థానాలకు ఆ పార్టీ అభ్యర్థులను ప్రకటించనున్నారని సమాచారం.
ఇప్పటికే తెలంగాణలోని 30 నియోజకవర్గాలకు టీడీపీ అభ్యర్థులను కూడా ఖరారు చేసినట్లు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

30 మంది అభ్యర్థుల పేర్లతో ఒక లిస్టు వైరల్ అవుతోంది. దాదాపు ఈ లిస్టులోని పేర్లన్నీ ఖరారైనట్టేనని తెలంగాణ టీడీపీకి చెందిన ఒక కీలక నేత అంటున్నారు. అయితే టీడీపీ ఎంట్రీ ఎవరికి ప్లస్ కాబోతోంది..? ఎవరికి మైనస్ కాబోతోంది..? అనేది ప్రస్తుత చర్చనీయాంశంగా మారింది. 2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తు పెట్టుకుంది. టీడీపీతో పొత్తే తమ పుట్టి ముంచింద‌ని అప్పట్లో ఎన్నికల రిజల్ట్ వచ్చాక కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో ఈసారి ఒంటరిపోరుకు టీడీపీ రెడీ అయింది. తెలంగాణ‌లోని మొత్తం 119 అసెంబ్లీ స్థానాల్లోనూ బరిలోకి దిగుతామని చంద్రబాబు అంటున్నారు. టీడీపీ క్యాడర్‌లో చాలా మంది ఇప్పుడు కేసీఆర్ పార్టీ బీఆర్ఎస్‌లో ఉన్నారు. ఇంకొందరు కాంగ్రెస్, బీజేపీల పంచన చేరారు. అయినా అన్ని స్థానాల్లో పోటీకి దిగడం వెనుక ఓట్లను చీల్చే రహస్య వ్యూహం దాగి ఉందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ ఓట్ల చీలిక ఏ పార్టీకి ప్రయోజనం చేకూరుస్తుంది..? అనే ప్రశ్న ఉదయిస్తోంది.

ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు ఉండబోతోంది. బీజేపీ కూడా మునుపటి కంటే మంచి ఫామ్‌లోనే ఉంది. ఈ తరుణంలో టీడీపీ ఎంట్రీతో ప్రధానంగా నష్టపోయేది కాంగ్రెస్, బీజేపీలే అని పొలిటికల్ ఎక్స్‌పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. హస్తం పార్టీ, కమలం పార్టీల ఓట్లను చీల్చడం ద్వారా.. పరోక్షంగా బీఆర్ఎస్ విజయానికి లైన్ క్లియర్ చేసేలా సైకిల్ పార్టీ పావులు కదుపుతోందని అంచనా వేస్తున్నారు. నేరుగా పొత్తు కుదుర్చకోలేక.. ఈవిధంగా పరోక్ష లబ్ధి కోసం తెలంగాణ టీడీపీని బీఆర్ఎస్ పార్టీ వాడుకుంటోందనే చర్చ కూడా రాజకీయవర్గాల్లో జరుగుతోంది. ‘కేంద్రం ఎంత ఒత్తిడి తెచ్చినా వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకోలేదు. రైతులపై ప్రేమ, అభిమానం, గౌరవం ఉన్న ప్రభుత్వమే అలాంటి నిర్ణయాలు తీసుకొంటుంది’ అని జులై 26న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలతో కేసీఆర్‌పై తనకున్న సానుకూల వైఖరిని చంద్రబాబు చెప్పకనే చెప్పారని పరిశీలకులు గుర్తుచేస్తున్నారు.

తెలంగాణలో బీజేపీకి ప్రధాన టార్గెట్‌గా బీసీ వర్గం ఓటర్లు ఉన్నారు. తెలంగాణ టీడీపీ కూడా ఆ వర్గంపై ఫోకస్‌తోనే ముందుకు వెళ్తోంది. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న లిస్టులో ఉన్న పేర్లను చూస్తే ఆ విషయం స్పష్టమవుతుంది. బీజేపీకి పడబోయే బీసీ ఓట్లను చీల్చి దాని విజయానికి ఆటంకాన్ని ఏర్పర్చాలనే వ్యూహం ఇందులో అంతర్లీనంగా ఉందని అంటున్నారు.