TDP Vs YCP: సై అంటే సై అంటున్న టీడీపీ.. సీమలో వైసీపీపై తిరగబడుతున్న పసుపు దళం

ఇంతకాలం వైసీపీ నేతలు ఏం చేసినా భరిస్తూ వచ్చిన టీడీపీ ఇప్పుడు తిరగబడుతోంది. వైసీపీతో ఢీ అంటే ఢీ అంటోంది. వైసీపీ అణచివేత ఏస్థాయిలో ఉన్నా టీడీపీ నేతలు, కార్యకర్తలు ధీటుగా ఎదుర్కొంటున్నారు. టీడీపీ తిరుగుబాటు ఇలాగే కొనసాగితే రాయలసీమలో వైసీపీని అడ్డుకోవచ్చనే ధీమాతో టీడీపీ శ్రేణులు ఉన్నాయి.

  • Written By:
  • Publish Date - August 6, 2023 / 06:02 PM IST

TDP Vs YCP: రాయలసీమలో వైసీపీది ఏకఛత్రాదిపత్యం. ఆ పార్టీకి ఎదురులేదు. గతంలో కాంగ్రెస్ హయాంలో వైఎస్సార్.. ఇప్పుడు జగన్ అక్కడ తిరుగులేని నేతలుగా ఎదిగారు. దీంతో వైఎస్సార్సీపీ ఆడింది ఆట.. పాడింది పాటగా ఉండేది. ప్రధాన ప్రతిపక్షం టీడీపీని కూడా సీమలో వైసీపీ ఇబ్బంది పెట్టింది. అయితే, ఇంతకాలం వైసీపీ అణచివేతను సహిస్తూ వచ్చిన టీడీపీ ఇటీవలి కాలంలో తిరుగుబాటు ధోరణి పాటిస్తోంది. టీడీపీ అనే కాదు.. సామాన్య ప్రజల్లో కూడా మార్పు వస్తున్నట్లే కనిపిస్తోంది. ఇటీవలి పరిణామాలే దీనికి నిదర్శనం.
వైసీపీ ఆధిపత్యం కనిపించే రాయలసీమలో మార్పు కనిపిస్తోంది. ఇంతకాలం వైసీపీ నేతలు ఏం చేసినా భరిస్తూ వచ్చిన టీడీపీ ఇప్పుడు తిరగబడుతోంది. వైసీపీతో ఢీ అంటే ఢీ అంటోంది. వైసీపీ అణచివేత ఏస్థాయిలో ఉన్నా టీడీపీ నేతలు, కార్యకర్తలు ధీటుగా ఎదుర్కొంటున్నారు. టీడీపీ తిరుగుబాటు ఇలాగే కొనసాగితే రాయలసీమలో వైసీపీని అడ్డుకోవచ్చనే ధీమాతో టీడీపీ శ్రేణులు ఉన్నాయి. అందులోనూ వైసీపీ పెద్దల ఇలాకాలోనే టీడీపీ ధీటుగా బదులివ్వడం సంచలనం కలిగిస్తోంది. అధికార వైసీపీని తాజా పరిణామాలు ఇఇబ్బంది పెడుతున్నాయి. సీఎం జగన్మోహన్‌ రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందులలో గతంలో ఏ పార్టీకి అంత సీన్ ఉండేది కాదు. టీడీపీ సహా ఇతర పార్టీలు, నేతలు ఏ కార్యక్రమం చేపట్టాలన్నా భయపడేవాళ్లు. కానీ, ఇటీవల చంద్రబాబు పులివెందుల పర్యటనతో ఈ పరిస్థితి మారిపోయింది. అక్కడ చంద్రబాబు నిర్వహించిన రోడ్ షో, సభ భారీ సక్సెస్ అయింది. టీడీపీ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు వైసీపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా.. టీడీపీ కార్యకర్తలు ధీటుగా ఎదుర్కొన్నారు. పులివెందులలో వైసీపీ జెండాలు పట్టుకుని కార్లలో తిరుగుతుంటే.. టీడీపీ కార్యకర్తలు వెంటబడి తరిమేశారు. వైసీపీ శ్రేణులపై ఎదురుదాడికి దిగాయి. గతంలో ఈ పరిస్థితి ఉండేది కాదు. వైసీపీకి ఎదరెళ్లే వాళ్లు కాదు. కానీ, ఇప్పుడు పులివెందులలోనూ వైసీపీని తిప్పికొట్టారు. టీడీపీ కార్యక్రమం విజయవంతమైంది.
పుంగనూరులోనూ వైసీపీపై టీడీపీ నేతలు ఎదురుదాడికి దిగారు. నిజానికి పుంగనూరులో చంద్రబాబు పర్యటన లేదు. అయినప్పటికీ చంద్రబాబు వస్తే అడ్డుకుంటామని వైసీపీ శ్రేణులు హెచ్చరించాయి. బాబు పర్యటన లేదని చెప్పినా వినిపించుకోలేదు. బాబు పర్యటనకు వ్యతిరేకంగా వైసీపీ ర్యాలీ నిర్వహించింది. దీంతో ప్రతిగా టీడీపీ కూడా ర్యాలీ చేపట్టింది. ఈ క్రమంలో వైసీపీ శ్రేణులు దాడికి దిగాయి. దీంతో టీడీపీ శ్రేణులు ప్రతిదాడికి దిగాయి. ఇరు పార్టీల మధ్య తీవ్ర ఘర్షణ తలెత్తింది. పోలీసులు కూడా టీడీపీ నేతలపై విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో టీడీపీ నేతలకు గాయాలయ్యాయి. దీంతో పుంగనూరు రావాల్సిందే అని చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చాయి. ఈ సమయంలో టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య జరిగిన ఘర్షణ ఎంతటి ఉద్రిక్తతలకు దారి తీసిందో తెలిసిందే. మంత్రి పెద్దిరెడ్డి ఆధిపత్యం ఉన్న చోట వైసీపీపై టీడీపీ ఈ స్థాయిలో తిరగబడటం వైసీపీ శ్రేణుల్ని, నాయకత్వాన్ని కూడా షాక్‌కు గురి చేసింది. ఆ తర్వాత సత్యసాయి జిల్లాలో కూడా చంద్రబాబును అడ్డుకునేందుకు వైసీపీ శ్రేణులు ప్రయత్నించగా, టీడీపీ ప్రతిఘటనతో వెనక్కు తగ్గాయి.
సై అంటే సై అంటున్న టీడీపీ
గతంలో అధికార వైసీపీ నేతల దూకుడు ముందు టీడీపీ నేతలు నిలబడే వాళ్లు కాదు. అయితే, పులివెందుల, పుంగనూరు, సత్యసాయి జిల్లా కదిరి సహా పలు చోట్ల టీడీపీ నేతలు తిరగబడటం చూస్తుంటే ఆ పార్టీ నేతల్లో మార్పు వచ్చినట్లే కనిపిస్తోంది. సీమలోని వైసీపీకి కంచుకోటగా భావించే చోటే ఆ పార్టీని ధీటుగా ఎదుర్కోగలిగామంటే.. ఇతర చోట్ల పైచేయి సాధించడం సులభమే అని టీడీపీ భావిస్తోంది. దీంతో ఇకపై కూడా వైసీపీపై టీడీపీ దూకుడు ప్రదర్శించే అవకాశం ఉంది.