TDP-JANASENA LIST: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం చాలా నియోజకవర్గాల్లో ఇక రచ్చ మొదలవబోతోంది. ఇప్పటి వరకూ వైసీపీ 65 స్థానాలు ప్రకటిస్తే ఇప్పుడు టీడీపీ-జనసేన కలసి 99 అసెంబ్లీ సీట్లల్లో అభ్యర్థులను ప్రకటించాయి. టీడీపీ 94 మంది పేర్లను ప్రకటించింది. జనసేన మొత్తం 24 సీట్లల్లో పోటీ చేస్తున్నా.. ఐదుగురి పేర్లు మాత్రమే అనౌన్స్ చేశారు పవన్ కల్యాణ్. ఏపీలోని మొన్నటి దాకా వైసీపీ అభ్యర్థులే ప్రచారంలో బిజీగా ఉన్నారు.
TDP-Jan Sena Alliance : టీడీపీ-జనసేన కూటమి తొలి జాబితా విడుదల ( ఫోటోస్ )
ఇప్పుడు టీడీపీ, జనసేన లిస్ట్ బయటకు రావడంతో ఇక పొలిటికల్ హీట్ పెరగనుంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోయే 99 మంది అభ్యర్థుల జాబితాను టీడీపీ-జనసేన ప్రకటించాయి. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఈ లిస్టు అనౌన్స్ చేశారు. తమకు కేటాయించిన 24 స్థానాల్లో ఐదు పేర్లు మాత్రమే బయటపెట్టిన పవన్.. ఇంకా 19 పెండింగ్ లో పెట్టారు. పవన్ కల్యాణ్, నాగబాబు ఎక్కడ పోటీ చేస్తారన్నది కూడా ప్రకటించలేదు. టీడీపీ-జనసేన కూటమి నుంచి 57 స్థానాలకు అభ్యర్థులను అనౌన్స్ చేయాల్సి ఉంది. త్వరలో బీజేపీ కూడా కలుస్తుండటంతో.. ఆ పార్టీ, జనసేనకు కలిపి 57 స్థానాలను చంద్రబాబు కేటాయించారు. ఈ ఫస్ట్ లిస్టులో చాలామంది టీడీపీ నేతలకు చోటు దక్కలేదు. బుచ్చయ్యచౌదరి, కళా వెంకట్రావు, గంటా శ్రీనివాసరావు, బుద్దా వెంకన్న, చింతమనేని ప్రభాకర్, దేవినేని ఉమ, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పీతల సుజాత, యరపతినేని, మరో సీనియర్ నేత ప్రతిభా చౌదరి కుమార్తె గ్రీష్మ చౌదరి పేర్లు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిల్లో కొన్ని సీట్లను జనసేన, బీజేపీ అడుగుతుండటంతో టీడీపీ సీనియర్లలో కొందరికి మొండి చెయ్యి తప్పదు.
ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఒక్క సీటు కూడా జనసేన ప్రకటించలేదు. మొత్తం 16 సీట్లు ఉంటే.. 11 స్థానాల్లో టీడీపీ తమ అభ్యర్థులను ప్రకటించింది. టీడీపీలో తీవ్ర పోటీ ఉన్న పెనమలూరు, మైలవరం స్థానాల్లోనూ అభ్యర్థుల పేర్లను ప్రకటించలేదు. టీడీపీ-జనసేన మధ్య తీవ్ర పోటీ ఉన్న విజవాడ వెస్ట్, అవనిగడ్డ, కైకలూరు స్థానాల్లో రెండు పార్టీలు కూడా అభ్యర్థులను బయటపెట్టలేదు. అటు – వైసీపీ ఐదు విడతలుగా 65 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించింది. 35 మంది సిటింగ్స్ కి టిక్కెట్లు ఇవ్వలేదు సీఎం జగన్. కాస్త లేటైనా.. లేటెస్ట్‌గా వచ్చామంటూ బాబు, పవన్.. వైసీపీ కంటే ఎక్కువగానే పేర్లు ప్రకటించారు. మరి ఇప్పుడు జగన్ కూడా తొందరపడతారేమో చూడాలి.