Ayyanna Patrudu: టీడీపీ నేత అయ్యన్నను రోడ్డుపై వదిలేసిన పోలీసులు.. నోటీసులు జారీ..!

మాజీ మంత్రి పేర్ని నాని ఫిర్యాదుతో అయ్యన్నపై కేసు నమోదు అయింది. అయ్యన్నపాత్రుడు, టీడీపీ కీలక నేత బుద్దా వెంకన్నపై విడివిడిగా కేసులు నమోదు చేశారు పోలీసులు. రింగుల రాణి రోజా మేకప్ చూస్తే రాత్రులు కూడా భయమేస్తుందంటూ అయ్యన్న కామెంట్‌ చేశారు.

  • Written By:
  • Publish Date - September 1, 2023 / 01:57 PM IST

Ayyanna Patrudu: టీడీపీ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ నుంచి విశాఖ వచ్చిన అయ్యన్నను ఎయిర్‌పోర్టులోనే కృష్ణా జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గన్నవరం యువగళం సభలో ముఖ్యమంత్రి, మంత్రుల్ని అయ్యన్న తీవ్రంగా విమర్శించారు. గన్నవరంలో లోకేశ్‌ బహిరంగసభలో ప్రసంగాలకు సంబంధించి.. టీడీపీ నేతలపై కేసులు నమోదు అయ్యాయి. మాజీ మంత్రి పేర్ని నాని ఫిర్యాదుతో అయ్యన్నపై కేసు నమోదు అయింది.

అయ్యన్నపాత్రుడు, టీడీపీ కీలక నేత బుద్దా వెంకన్నపై విడివిడిగా కేసులు నమోదు చేశారు పోలీసులు. రింగుల రాణి రోజా మేకప్ చూస్తే రాత్రులు కూడా భయమేస్తుందంటూ అయ్యన్న కామెంట్‌ చేశారు. ఇక ముఖ్యమంత్రిని ఆర్ధిక ఉగ్రవాది, సైకో, ధన పిశాచి, పనికిమాలినవాడు అంటూ విమర్శలు చేశారు. దీనిపై వైసీపీ నేతలు భగ్గుమంటున్నారు. దీంతో మాజీ మంత్రి పేర్ని నాని ఫిర్యాదుతో 153ఏ, 504, 509తో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు. ఐతే అయ్యన్న అరెస్ట్‌ ఎపిసోడ్‌లో కొత్త ట్విస్ట్ కనిపించింది. అనకాపల్లి జిల్లా వేంపాడు టోల్‌ప్లాజా దగ్గర పోలీసు వాహనాలను టీడీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. దీంతో అయ్యన్నను అక్కడే వదిలి వెళ్లిపోయారు పోలీసులు. రోడ్డు మీద దింపేసి.. తమ దారిలో వెళ్లిపోయారు.

హైవే పక్కన ఉన్న హోటల్‌కు ఆయనను తరలించారు. ఆ తర్వాత అయ్యన్నపాత్రుడికి 41 A నోటీసులు ఇచ్చి వెళ్లిపోయారు పోలీసులు. అయ్యన్న అరెస్ట్‌తో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా.. రెండు పార్టీల మధ్య రచ్చ ఉంది. మరి ఈ అరెస్ట్ వ్యవహారం, రోడ్డు మీద వదిలేసిన ఎపిసోడ్‌తో మంటలు ఇంకెంత రగులుతాయో అనే టెన్షన్ కనిపిస్తోంది.