TDP Manifesto: హామీలు సరే.. అమలు సాధ్యమేనా? మరోసారి బాబు మోసం చేస్తున్నారా? మాట నిలబెట్టుకుంటారా?

టీడీపీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు చూస్తే అవి కేవలం ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, ఓటర్లను ఆకట్టుకునేందుకే ఇచ్చినట్లు అనిపిస్తోంది. ఎందుకంటే వీటన్నింటినీ అమలు చేయడం అంత సులువైన పని కాదు. అదే జరిగితే.. గతంలోనే చంద్రబాబు నిరుద్యోగ భృతి పథకాన్ని అమలు చేసేవారు.

TDP Manifesto: టీడీపీకి రాబోయే ఎన్నికలు చావోరేవో లాంటివి. ఈ సారి ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలి. లేదంటే ఇక టీడీపీ దుకాణం సర్దుకోవాల్సిందే. మరోసారి జగన్ గెలిస్తే ఈసారి టీడీపీని మరింత దెబ్బతీస్తారు. అందుకే అధికారమే లక్ష్యంగా టీడీపీ ఎన్నికల మొదటి మేనిఫెస్టో ప్రకటించింది. ఈ మేనిఫెస్టో చూస్తే అబ్బో అనాల్సిందే. గొప్పగొప్ప హామీలు గుప్పించారు చంద్రబాబు. అయితే, అక్కడే అసలు చిక్కు.. ఈ హామీల అమలు సాధ్యమేనా అన్నది అందిరలోనూ తలెత్తుతున్న ప్రశ్న. నిజంగానే అలాంటి హామీలే ఇచ్చేశారు చంద్రబాబు.
ఇవీ హామీలు
ఆడబిడ్డ నిధి కింద ప్రతి నెలా ఆడపడుచులకు ప్రతి నెలా రూ.1500 బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. పిల్లలున్న తల్లులకు ఏటా రూ.15 వేలు. ఎంతమంది పిల్లలుంటే అన్ని రూ.15 వేలు జమ చేస్తారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, ప్రతి ఇంటికీ మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం. 20 లక్షల మంది యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పన. రూ.3,000 వరకు నిరుద్యోగ భృతి. రైతుకు రూ.20 వేల ఆర్థిక సాయం. ఇంటింటికీ ఉచిత తాగు నీళ్లు. పేదవారిని ధనికులుగా మార్చే పూర్ టు రిచ్ కార్యక్రమం. బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం.. ఇలా అనక పథకాల్ని టీడీపీ ప్రకటించింది. నిజానికి ఇవన్నీ వినటానికి బాగానే అనిపిస్తున్నాయి. కానీ, అసలు సమస్య వీటి అమలు. మరో సమస్య టీడీపీ చిత్తశుధ్ది.
గతంలో అమలు చేయని టీడీపీ
హామీలదేముంది.. ఎన్నికలొస్తున్నాయంటే ఎన్ని హామీలైనా ఇవ్వొచ్చు. ఇప్పుడు మాజీగా ఉన్న చంద్రబాబు.. ప్రస్తుతం సీఎంగా ఉన్న జగన్ ఎన్నో హామీలిచ్చి నెరవేర్చలేదు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో చాలా హామీల్ని గాలికొదిలేశారు. వాటిలో నిరుద్యోగభృతి ఒకటి. అప్పట్లోనే నిరుద్యోగులకు భృతి ఇస్తానని ప్రకటించి.. అధికారంలోకి వచ్చాక అమలు చేయలేదు. ఈసారి మళ్లీ అలాంటి హామీనే ఇచ్చాడు. ఒకసారి అమలు చేయని వ్యక్తి.. రెండోసారి అమలు చేస్తాడంటే నమ్మడం కష్టం. ప్రతి ఇంటికీ మంచి నీళ్ల కుళాయి ఏర్పాటు చేస్తామన్నారు. గతంలో కూడా దీన్ని నెరవేర్చలేదు. రైతులకు ప్రతి సంవత్సరం రూ.20 వేలు ఇచ్చే పథకం తెస్తామన్నారు. అంటే కేంద్రం ఇచ్చే రూ.6 వేలకు అదనంగా రూ.20 వేలు ఇస్తారా? లేక ఆ ఆరు వేలను కలిపి రూ.20 వేలు ఇస్తారా? స్పష్టత లేదు. మరోవైపు 18 ఏళ్లు దాటిన ప్రతి మహిళకు రూ.1500 నెలనెలా ఇస్తామన్నారు. అసలిది సాధ్యమేనా? రాష్ట్రంలో 18 ఏళ్లు దాటిన మహిళలు ఎంత మంది ఉన్నారు? వాళ్లందరికీ ఇవ్వాలంటే ఎంత బడ్జెట్ కేటాయించాలి? నిధులు ఎలా వస్తాయి? ఇవన్నీ బాబు లెక్కలేశారా? అంటే అనుమానమే.
ఓట్ల కోసమే భారీ హామీలు!
టీడీపీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు చూస్తే అవి కేవలం ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, ఓటర్లను ఆకట్టుకునేందుకే ఇచ్చినట్లు అనిపిస్తోంది. ఎందుకంటే వీటన్నింటినీ అమలు చేయడం అంత సులువైన పని కాదు. అదే జరిగితే.. గతంలోనే చంద్రబాబు నిరుద్యోగ భృతి పథకాన్ని అమలు చేసేవారు. ఇంటింటికీ మంచి నీళ్లు ఇప్పించేవాళ్లు. రైతులకు సాయం చేసేవాళ్లు. ఇలాంటివేవీ సాధ్యంకాకే అమలు చేయలేదు. పైగా వీటిని అమలు చేసే చిత్తశుద్ధి కూడా టీడీపీకి లేదేమో అనిపిస్తుంది. వీటన్నింటినీ అమలు చేయాలంటే ప్రభుత్వ నిధులు భారీగా అవసరం. కానీ, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉద్యోగులకు జీతాలే ఇవ్వలేని పరిస్థితి. ప్రతి నెలా అప్పు తెస్తే తప్ప ప్రభుత్వం నడపడం కష్టమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు ఇచ్చిన హామీలు విస్మయపరుస్తున్నాయి.

అమలు సాధ్యంకాని హామీల్ని ఇచ్చి మరోసారి ప్రజల్ని మోసం చేయాలనుకుంటున్నారా అంటూ అధికాపరక్షం విమర్శిస్తోంది. టీడీపీ మేనిఫెస్టోగానీ అమలు చేస్తే ఏపీ శ్రీలంక అయిపోవడం ఖాయం అంటూ వైసీపీ ఎదురుదాడి చేస్తోంది. ప్రస్తుత పరిస్తితుల్లో చంద్రబాబుకు ఇంతకుమించిన అవకాశం మరోటి లేదు. అందుకే సాధ్యమా.. కాదా అని ఆలోచించకుండా ఓటర్లను ఆకట్టుకోవడం.. ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా బాబు ఈ పథకాల్ని మేనిఫెస్టోలో చేర్చారు. అయితే, వీటిని జనాలు ఎంత వరకు నమ్ముతారు అనేదానిపైనే బాబు భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. హామీలు ఇవ్వడం కాదు.. వాటిని నెరవేర్చగలననే నమ్మకాన్ని జనాలకు కల్పించడమే నాయకుడి అసలు సక్సెస్.