పవిత్ర తిరుమల పుణ్యక్షేత్రం కేంద్రంగా రాజకీయం దిగజారుతోంది. లడ్డు వివాదం మరువక ముందే టికెట్ల అమ్మకం వ్యవహారం ఇప్పుడు కూటమి వెలుగులోకి తెచ్చింది. దేవుడితో రాజకీయాలు చేస్తున్నది ఎవరు అనే అంశం పక్కన పెడితే ప్రతీ రోజు రాజకీయ పార్టీలు సిగ్గు విడిచి పవిత్ర తిరుమల కొండను వేదికగా చేసుకుని తమ రాజకీయ వ్యూహాలు అమలు చేస్తున్నాయి. వెంకటేశ్వర స్వామి పవిత్రత కాపాడాల్సిన రాజకీయ పార్టీలు ఇలా మీడియా గొట్టాల ముందు మీరు తప్పు చేసారంటే మీరు చేసారాని ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ… అసలు తిరుమల తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు ఉంది అని బాధపడే వరకు తెచ్చారు.
సరిహద్దు రాష్ట్రాల్లో ఎన్నో ప్రముఖ దేవాలయాలు ఉన్నా… ఎప్పుడూ కూడా ఈ స్థాయిలో దైవాన్ని బజారుకీడ్చలేదనే మాట అక్షర సత్యం. ఇప్పుడు దేవుడి దర్శనం కూడా అమ్ముకున్నారనే వార్తలు ప్రజలను విస్మయానికి గురి చేస్తున్నాయి. సామాన్యుడు దేవుడి విషయంలో చిన్న తప్పు చేయాలన్నా కూడా భయపడే పరిస్థితి ఉంటుంది. అలాంటిది బాధ్యతాయిత పదవుల్లో ఉండి టికెట్ లు అమ్ముకోవడం ఏంటీ అనే ప్రశ్న వినపడుతోంది. టికెట్ అమ్ముకోవడం అంటే భక్తిని అమ్ముకోవడమే. దేవాలయంలో దర్శనం టికెట్ లు అమ్మడానికి రాజకీయ నాయకులు అమ్ముకోవడానికి చాలా తేడా ఉంది.
తాజాగా కూటమిలోని కీలక పార్టీ… టీడీపీ మాజీ మంత్రులు పెద్దిరెడ్డి, ఆర్కే రోజాల టికెట్ ల స్కాం ను బయట పెట్టింది. శ్రీవారి టికెట్ లను అమ్ముకుని రోజుకి… 70 లక్షల కోటి రూపాయల వరకు ఈ ఇద్దరూ సంపాదించారని టీడీపీ ఆరోపణలు చేస్తోంది. ముఖ్యంగా పెద్దిరెడ్డి బినామీ కంపెనీ… కళాధర్ ట్రావెల్స్ ఇందులో కీలక భూమిక పోషించిందని ఆరోపణలు ఉన్నాయి. ప్రతీ రోజు టూరిజం డిపార్ట్మెంట్ కు వెయ్యి దర్శనం టికెట్ లు కేటాయిస్తే అందులో ఏకంగా 80 శాతం అంటే 800 టికెట్ లు కళాధర్ ట్రావెల్స్ తీసుకునేది. నడావల్సింది 30 బస్సులు అయితే నడిచింది కేవలం 4 బస్సులు మాత్రమే. ఒక్కో టికెట్ ను ఏకంగా 5500 రూపాయలకు అమ్ముకున్నారట.
ఇక బుక్ మై దర్శన్ ద్వారా కూడా భారీగా టికెట్ లు అమ్ముకున్నారట రోజా. బుక్ మై దర్శన్ కింద రోజు 75 టికెట్ లు కేటాయిస్తారు. ఒక్కో టికెట్ అమ్మాల్సింది 1250 అయితే అమ్ముకుంది మాత్రం 5 నుంచి 10 వేల రూపాయలకు. ఈ టికెట్ ల అమ్మకం కోసం రోజా టీం మొత్తం 20 మంది పని చేసేవారట. ఇక రోజా వారం వారం తిరుమల వెళ్ళే సమయంలో కొంత మందిని ప్రతీసారి తనతో పాటు దర్శనానికి తీసుకుని వెళ్ళారు. దీని వెనుక కూడా అక్రమాలు ఉన్నాయని టీడీపీ ముందు నుంచి సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు చేస్తూ వస్తోంది. లడ్డూ వ్యవహారంపై సిట్ విచారణ జరుగుతోంది… ఈ సమయంలో మరో కుంభకోణం అంటూ టీడీపీ బయటపెట్టింది.
ఇలా భక్తిని కూడా అమ్ముకున్న, రాజకీయం చేస్తున్న పార్టీలుగా మన తెలుగు రాజకీయ పార్టీలు మిగిలిపోయాయి అనే మాట వాస్తవం. లడ్డు వ్యవహారంలో వాస్తవాలు ఏంటీ అనేది ఆ దేవుడికే తెలియాలి. ఆ ఏడు కొండల్లో ఏం జరిగిందో ఆ కలియుగ దైవమే ప్రత్యక్ష సాక్షి… మరో వైపు డిక్లరేషన్ వ్యవహారం, ఇంకో వైపు అడవి జంతువులు… ఇలా ఏదోక రూపంలో తిరుమలను రాజకీయాల్లోకి లాగుతున్నాయి పార్టీలు. సామాన్యుడు తిరుమల దర్శనానికి వెళ్లడాన్ని ఎంతో పవిత్రంగా భావించి టికెట్ ల కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అలాంటిది రాజకీయ పార్టీలు ఇలా టికెట్ లు అమ్ముకోవడం నిజమే అయితే మాత్రం భక్తిని బజారులో వస్తువు చేసినట్టే. ఒకవేళ నిజంగా తప్పు చేస్తే మాత్రం విచారణ చేసి కూటమి ప్రభుత్వం వాస్తవాలు బయట పెట్టాల్సి ఉంటుంది. కేవలం ఆరోపణలతో కాలం నెట్టుకు వస్తే ఇందులో టీడీపీ కూడా దోషిగా మిగలడం ఖాయం.