అల్లు అర్జున్ కు టీడీపీ సపోర్ట్, రేవంత్ పై మహిళా నేత సంచలన కామెంట్స్

తెలంగాణలో ఇప్పుడు అల్లు అర్జున్ వ్యవహారం రాజకీయ మలుపు కూడా తిరగడంతో ఏ పరిణామాలు చోటు చేసుకుంటాయనేది కాస్త ఆసక్తికరంగా మారుతుంది. రాజకీయంగా ఈ అంశాన్ని వాడుకోవాలని భారతీయ జనతా పార్టీ అలాగే తెలుగుదేశం పార్టీ సిద్ధమైనట్లుగానే తెలుస్తోంది.

  • Written By:
  • Publish Date - December 23, 2024 / 06:47 PM IST

తెలంగాణలో ఇప్పుడు అల్లు అర్జున్ వ్యవహారం రాజకీయ మలుపు కూడా తిరగడంతో ఏ పరిణామాలు చోటు చేసుకుంటాయనేది కాస్త ఆసక్తికరంగా మారుతుంది. రాజకీయంగా ఈ అంశాన్ని వాడుకోవాలని భారతీయ జనతా పార్టీ అలాగే తెలుగుదేశం పార్టీ సిద్ధమైనట్లుగానే తెలుస్తోంది. అల్లు అర్జున్ కు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ బిజెపి అధ్యక్షురాలు దగ్గుబాటి పురందరేశ్వరి మద్దతు తెలిపారు. అలాగే కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా అల్లు అర్జున్ మద్దతుగా కామెంట్స్ చేశారు. ఇక తాజాగా తెలుగుదేశం పార్టీ కూడా ఈ విషయంలో అల్లు అర్జున్ కు దాదాపుగా మద్దతు తెలిపింది.

తెలుగుదేశం పార్టీ తెలంగాణ మహిళా నాయకురాలు తిరునగరి జ్యోత్స ఈ మేరకు సోషల్ మీడియాలో కొన్ని కామెంట్స్ చేశారు. నిన్నటి నుండి ఒక ప్రశ్న అడగాలని ఉంది అనుమల రేవంత్ రెడ్డి గారు… అల్లు అర్జున్ విషయంలో మీ ప్రభుత్వ చొరవ బాగుంది కానీ తెలంగాణలో ప్రభుత్వ హాస్టల్స్ లో ఫుడ్ పాయిజన్ వల్ల చనిపోయిన పిల్లలు చావులకు బాధ్యులు ఎవరు అని ఆమెను నిలదీశారు. రుణమాఫీ అవ్వక చనిపోయిన రైతుల ప్రాణాలకు బాధ్యులు ఎవరు? హైడ్రా భయంతో ప్రాణాలు కోల్పోయిన మరణాలకు కారణాలు ఎవరు?

ఆత్మహత్యలు చేసుకుంటున్న సిరిసిల్ల చేనేత సోదరులు మరణాలకు కారణము ఎవరు? వీరందరికీ న్యాయం చేయాలి. ఇక్కడ చనిపోయిన సామాన్యులు పేదలు కాదా…? వారి కుటుంబాలకు ఏం సమాధానం చెప్తారంటూ ఆమె సోషల్ మీడియాలో నిలదీశారు. అసెంబ్లీలో అల్లు అర్జున్ మీద చర్చలు పెట్టడానికి సమయం ఉంటుందని రైతుల సమస్యల మీద, విద్యార్థుల సమస్యల మీద, నేతన్నల సమస్య మీద ధర్నాలు చేస్తున్న సమగ్ర శిశు ఉద్యోగుల మీద చర్చించడానికి సమయం లేదా అంటూ ఆమె సోషల్ మీడియాలో ప్రశ్నించారు.

అటు తిరిగి ఇటు తిరిగి ఈ వ్యవహారాన్ని రాజకీయ పార్టీలు తమ అనుకూలంగా మార్చుకునేందుకు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి ఒకవైపు సినిమా పరిశ్రమ రెడీగా ఉంటే మరోవైపు భారతీయ జనతా పార్టీ అలాగే దాని మిత్ర పక్షాలు కూడా సిద్ధంగా ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తుంది. ఇక అల్లు అర్జున్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ గా ఉండటంతో ఈ వ్యవహారం సుప్రీంకోర్టు వరకు వెళ్లే అవకాశం స్పష్టంగా కనబడుతోంది. శనివారం సాయంత్రం అల్లు అర్జున్ నిర్వహించిన మీడియా సమావేశం తో సమస్య మరింత పెద్దదైనట్లుగానే తెలుస్తోంది. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అల్లు అర్జున్ రెచ్చగొట్టారని అటు తెలంగాణ పోలీసులను కూడా బద్నాం చేసే ప్రయత్నం హీరో చేశాడని కాంగ్రెస్ పార్టీ అలాగే తెలంగాణ మంత్రులు ఆరోపణలు చేస్తున్నారు..