JANASENA-TDP: ఏపీలో జనసేన-టీడీపీ పొత్తు ఆసక్తికరంగా మారింది. కొంతకాలంగా రెండు పార్టీలూ కలిసి పని చేస్తాయని ప్రచారం జరిగినా.. ఇటీవలి కాలంలో అలాంటి పరిస్థితులు కనిపించడం లేదు. పొత్తుల విషయంలో ఇంకా తేల్చుకోలేదని పవన్ ప్రకటించడం ఆందోళనకరంగా మారింది. దీంతో టీడీపీ-జనసేన కలిసే అవకాశం లేదా అనే ప్రచారం మొదలైంది. నిజంగానే రెండూ వేరువేరుగా పోటీ చేస్తాయా..?
గోదావరి జిల్లాల్లో పవన్ చేపట్టిన వారాహి యాత్ర దిగ్విజయంగా సాగింది. జనసేనకు ఈ యాత్ర ద్వారా మైలేజీ పెరిగిందనే చెప్పాలి. రాబోయే కాలంలో ఇతర జిల్లాల్లో చేపట్టబోయే యాత్ర ద్వారా ఆ పార్టీ ఇంకెంత బలపడుతుందో చూడాలి. జనసేన బలపడితే అది టీడీపీకి నష్టమే. ఎందుకంటే టీడీపీ-జనసేన మధ్య సీట్ల పంపకాల సమయంలో సమస్యలొస్తాయి. జనసేన ఎక్కువ సీట్లు డిమాండ్ చేస్తుంది. దీనికి టీడీపీ అంగీకరిస్తుందా లేదా అనేది పెద్ద ప్రశ్న. పోనీ.. జనసేనను వదిలేసి ఒంటరిగా వెళ్దామంటే గత ఎన్నికలనాటి ఫలితాలే వస్తాయేమోనని టీడీపీ భయం. దీంతో పొత్తు విషయంలో ఇంకా టీడపీ-జనసేన ఏమీ తేల్చుకోనట్లే కనిపిస్తోంది.
ముందుగానే టీడీపీ అభ్యర్థుల ప్రకటన
పొత్తు ద్వారా ఎక్కువగా లాభపడేది టీడీపీనే. అయితే, జనసేనతో పొత్తు గురించి ఆలోచించకుండా టీడీపీ స్వతంత్రంగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది. దీనిలో భాగంగా జనసేనతో సంబంధం లేకుండానే టీడీపీ తన అభ్యర్థుల్ని ముందుగానే ప్రకటించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఏపీలో అసెంబ్లీకి, పార్లమెంట్‌కు ఒకేసారి వచ్చే ఏడాదిలో ఎన్నికలు జరుగుతాయి. రాబోయే దసరా పండుగనాటికే ఏపీ అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థుల్ని ప్రకటించాలని భావిస్తోంది. ఈ లోపే అభ్యర్థుల్ని ఎంపిక చేస్తుంది. ఒకవేళ అభ్యర్థుల ప్రకటన లేకపోయినా.. ఈ మేరకు అభ్యర్థుల్ని ఎంపిక చేసి, వారికి నియోజకవర్గాల్లో పని చేసుకోవాలని సూచించే అవకాశం ఉంది. దసరా నాటికి దాదాపు 80 నియోజకవర్గాల్లో అభ్యర్థుల్ని ప్రకటించే ఛాన్స్ ఉంది. అలాగే మేనిఫెస్టోను కూడా విడుదల చేయాలని చూస్తోంది. ముందుగానే అభ్యర్థుల్ని ప్రకటిస్తే నియోజకవర్గంలో పని చేసి, గెలుపు అవకాశాల్ని మెరుగుపర్చుకోవచ్చు. ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక కోసం కసరత్తులు ప్రారంభించింది.
గతానికి భిన్నంగా
టీడీపీలో సీట్లకు ఎక్కువ పోటీ ఉంటుంది. ఒక నియోజకవర్గానికి ఒకరికంటే ఎక్కువ మంది పోటీపడుతుంటారు. ఒకరికి టిక్కెట్ ఇస్తే మరొకరు తిరగబడే ఛాన్స్ ఉంది. అందుకే టిక్కెట్ రాని నేతలను బుజ్జగించి, మరొకరికి ఛాన్స్ ఇస్తుంటారు. అందువల్ల టీడీపీలో అభ్యర్థుల ప్రకటన చాలా ఆలస్యంగా జరుగుతుంది. కొన్నిసార్లు దీనివల్ల నష్టం జరిగే ఛాన్స్ ఉంది. ఎక్కువ మంది పోటీపడుతున్నప్పుడు అసలైన అభ్యర్థి ఎవరో తెలియక పార్టీ శ్రేణులు గందరగోళానికి గురవుతాయి. చివరి నిమిషంలో అభ్యర్థిని ప్రకటిస్తే అతడితో కలిసి పని చేసేందుకు మిగతావాళ్లు సంశయిస్తారు. అందుకే ఈసారి ఈ సమస్య లేకుండా అభ్యర్థుల్ని ముందుగానే ప్రకటిస్తారు. ఎంపికైన అభ్యర్థులు నియోజకవర్గంలో పని చేసుకుంటారు. మరోవైపు కొందరు నేతలు పార్టీలోని తమకు కావాల్సిన సీనియర్ నేతలతో టిక్కెట్ కోసం ఒత్తిడి చేయిస్తుంటారు. దీంతో నచ్చినా.. నచ్చకపోయినా.. అలాంటివారికి టిక్కెట్ ఇవ్వాల్సి వస్తుంది. అందుకే ఈసారి అలాంటి ఒత్తిళ్లకు తావు లేకుండా సర్వే ఆధారంగా గెలుపు గుర్రాలకే టిక్కెట్ ఇవ్వాలని టీడీపీ నిర్ణయించింది.
మరి జనసేనతో పొత్తు సంగతేంటి..?
ముందుగానే అభ్యర్థుల్ని ప్రకటిస్తే టీడీపీకి కలిసొస్తుంది సరే.. కానీ, అదే నియోజకవర్గం నుంచి జనసేన పోటీ చేసేందుకు సిద్ధమైతే పరిస్థితి ఏంటి..? దీనివల్ల అంతిమంగా వైసీపీకే లబ్ధి కలుగుతుంది. టీడీపీ, జనసేన మధ్య ఓట్లు చీలితే లాభపడేది వైసీపీనే. దీనిప్రకారం సగం మందికిపైగా అభ్యర్థుల్ని టీడీపీ ప్రకటిస్తే.. జనసేనతో సీట్లు, పొత్తుల సంగతేంటి అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అంటే జనసేనతో పొత్తు లేకుండా టీడీపీ ఒంటరిగా వెళ్దామనుకుంటోందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఇలాగే దెబ్బతిన్న విషయాన్ని టీడీపీ గుర్తిస్తే మంచిది. ఈసారి జనసేన కొన్నిచోట్ల బలంగా ఉంది. ఆ ప్రాంతాల్లో అత్యధిక సీట్లు జనసేననే సాధిస్తుంది అనడంలో సందేహం లేదు. టీడీపీతో పొత్తు లేకపోయినా జనసేనకు భారీ నష్టం అయితే కలగదు. ఎక్కువగా నష్టపోయేది మాత్రం టీడీపీనే.