Assembly Elections: తెలంగాణలో ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధమవుతోంది. అక్టోబర్‌లో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. ప్రస్తుతం దీనిపై ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది తెలంగాణతోపాటు మరో నాలుగు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నిలకు జరగాల్సి ఉంది. మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, రాజస్థాన్, మిజోరంలో కూడా అసెంబ్లీ ఎన్నికలు జరగాలి. అక్టోబర్‌లో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి, నవంబర్ చివర్లో ఎన్నికలు నిర్వహించాలన్నది ఈసీ ఆలోచనగా తెలుస్తోంది. డిసెంబర్ తొలి వారంలో ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.
ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. అధికారులతో ఇటీవలే సమావేశం నిర్వహించారు. డీజీపీతోపాటు అన్ని జిల్లాల ఎస్పీలు, సీపీలతో, వివిధ విభాగాలకు చెందిన ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. ఎన్నికల నిర్వహణ, శాంతిభద్రతలకు సంబంధించిన అంశాలపై చర్చించారు. ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి శిక్షణ ఇస్తున్నట్లు ఆయన తెలిపారు.
మరోవైపు ఎలక్షన్స్‌కు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల సన్నాహాల్లో ఈసీ నిమగ్నమై ఉంది. ఇప్పటికే ముసాయిదా ఓటర్ల జాబితాను సిద్ధం చేసింది. తెలంగాణలో గుర్తించిన పది లక్షల బోగస్ ఓట్లను తొలగించారు. ఇప్పటివరకు తొలగించిన దొంగ ఓట్లలో సగానికిపైగా జీహెచ్‌ఎంసీ పరిధిలోనే ఉండటం గమనార్హం. మరోవైపు ఓటర్ల సవరణకు కూడా భారీ స్థాయిలో దరఖాస్తులు వచ్చాయి. దాదాపు 21 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. నోటిఫికేషన్ విడుదలైన తర్వాత కూడా ఓటరు జాబితాలో మార్పులు జరుగుతాయి.
పార్టీలు సిద్ధమే..
తెలంగాణలో ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడు విడుదలైనా పోటీకి సిద్ధంగానే ఉన్నట్లు పార్టీలు చెబుతున్నాయి. బీఆర్ఎస్ ఇప్పటికే అభ్యర్థుల్ని ప్రకటించింది. కాంగ్రెస్ కూడా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ప్రారంభించింది. బీజేపీ కూడా దరఖాస్తులు స్వీకరిస్తోంది. దీంతో అన్ని పార్టీలు పూర్తిగా ఎన్నికల మోడ్‌లోకి వెళ్లిపోయాయి. అన్ని పార్టీల అభ్యర్థుల్ని ప్రకటిస్తే.. ఎన్నికల పోరు మరింత రసవత్తరంగా మారుతుంది.