Telangana Assembly: రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు.. ప్రతిపక్షాలపై ఎదురుదాడికి బీఆర్ఎస్ సిద్ధం..

ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని కాంగ్రెస్, బీజేపీ భావిస్తుంటే.. ప్రతిపక్షాలపై ఎదురుదాడికి బీఆర్ఎస్ సిద్ధమైంది. అలాగే ఎన్నికల వ్యూహాన్ని కూడా అసెంబ్లీ నుంచి అమలు చేయబోతుంది. ఇప్పటికే ప్రతి అడుగు ఎన్నికల కోసం రాజకీయంగానే వేస్తున్న బీఆర్ఎస్.. అసెంబ్లీలోనూ అదే తరహా వ్యూహాన్ని అనుసరించనుంది.

  • Written By:
  • Publish Date - August 2, 2023 / 11:42 AM IST

Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరగబోతున్న చివరి సమావేశాలు కావడంతో వీటికి చాలా ప్రాధాన్యం ఏర్పడింది. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని కాంగ్రెస్, బీజేపీ భావిస్తుంటే.. ప్రతిపక్షాలపై ఎదురుదాడికి బీఆర్ఎస్ సిద్ధమైంది. అలాగే ఎన్నికల వ్యూహాన్ని కూడా అసెంబ్లీ నుంచి అమలు చేయబోతుంది. ఇప్పటికే ప్రతి అడుగు ఎన్నికల కోసం రాజకీయంగానే వేస్తున్న బీఆర్ఎస్.. అసెంబ్లీలోనూ అదే తరహా వ్యూహాన్ని అనుసరించనుంది. ఈ సమావేశాలు ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య వాడివేడి చర్చకు దారితీయబోతున్నాయి.
ఇటీవలి వరదల వల్ల తెలంగాణలోని అనేక ప్రాంతాలు నీట మునిగాయి. గతంలో ఎన్నడూ లేనంతగా చాలా ఊళ్లు పూర్తిగా మునిగిపోయాయి. రహదారులు కొట్టుకుపోయాయి. ఇండ్లు, పంటలు ధ్వంసమయ్యాయి. పశువులు మరణించాయి. ఈ విషయంలో ప్రభుత్వం సరిగ్గా స్పందించలేదనే వాదన ఉంది. బాధితులకు సాయం అందించడంలో కూడా ప్రభుత్వం విఫలమైంది. ఈ అంశంపైనే బీజేపీ, కాంగ్రెస్.. ప్రభుత్వంపై విరుచుకుపడబోతున్నాయి. బాధితుల్ని, రైతుల్ని ఆదుకోవాలని డిమాండ్ చేసే అవకాశం ఉంది. ఈ విషయంలో ధీటుగా బదులిచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఎవరికి, ఎలాంటి సాయం చేసిందో చెప్పేందుకు తగిన వివరాల్ని సేకరిస్తోంది. ప్రతిపక్షాలపై ఏ అంశాల్లో దాడి చేయాలో కూడా బీఆర్ఎస్ ప్రణాళిక సిద్ధం చేసింది. ఇటీవల రైతులకు ఉచిత విద్యుత్ విషయంలో రేవంత్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ను ప్రశ్నించేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. ఈ విషయంలో ఇప్పటికే బీఆర్ఎస్ తీవ్ర నిరసనలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక బిల్లులను గవర్నర్ చాలా కాలంగా ఆమోదించడం లేదు. గవర్నర్ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ విమర్శిస్తోంది. బిల్లుల పెండింగ్ విషయంలో బీజేపీని టార్గెట్ చేసి అసెంబ్లీలో ప్రశ్నించేందుకు ప్రభుత్వం రెడీ అయింది. యూనివర్సిటీల్లో రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డు బిల్లు కూడా చాలాకాలంగా గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉంది. ఈ బిల్లును అసెంబ్లీలో మళ్లీ ప్రవేశపెట్టబోతున్నారు.
అసెంబ్లీలో ఇలాంటి వ్యూహాన్ని అమలు చేయబోతుంటే.. మరోవైపు ఈ నెల 18న అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించబోతున్నారు సీఎం కేసీఆర్. ఈ జాబితాలో 85-90 నియోజకవర్గాలకు అభ్యర్థుల్ని ప్రకటిస్తారు. వివాదాస్పదంగా ఉన్న స్థానాలు కొన్నింటిని మాత్రం వాయిదా వేయబోతున్నారు. ఎన్నికలు త్వరలో జరగబోతున్న నేపథ్యంలో ప్రజలకు వరాల జల్లు కురిపించేందుకు కేసీఆర్ సిద్ధమయ్యారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించిన సంగతి తెలిసిందే. మరికొన్ని కీలకమైన నిర్ణయాలు త్వరలో వెలువడే అవకాశం ఉంది.