KCR: తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ప్రజా బలంతో గెలిచిన కాంగ్రెస్ పార్టీ.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మంత్రివర్గాలు కూడా పంచేసింది. ఇక గెలిచిన ఎమ్మెల్యేలంతా అసెంబ్లీలో ప్రమాణస్వీకారం చేయాల్సి ఉంది. డిసెంబర్ 9న ఈ కార్యక్రమం జరగాల్సి ఉంది. ఇప్పటికే అసెంబ్లీ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌కుమార్ పేరును ఖరారు చేసింది కాంగ్రెస్ పార్టీ. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేసిన తరువాత అంతా కలిసి స్పీకర్‌ను ఎన్నుకుంటారు.
PRAJA DARBHAR: ప్రజాదర్బార్.. పదేళ్ల తర్వాత ప్రగతిభవన్‌లోకి ఎంట్రీ.. పోటెత్తిన బాధితులు
కాంగ్రెస్‌కు 64 మంది ఎమ్మెల్యేలు ఉన్న నేపథ్యంలో.. స్పీకర్ ఎంపిక ఓ ఫార్మాలిటీ మాత్రమే. కానీ స్పీకర్‌ను ఎన్నుకునే కంటే ముందే ఓ వ్యక్తి ఎమ్మెల్యేల చేత ప్రమాణస్వీకారం చేయించాలి. ఆయననే ప్రొటెం స్పీకర్ అంటారు. సాధారణంగా ఎక్కువసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నేతలను ప్రొటెం స్పీకర్‌గా ఎన్నుకుంటారు. ఆయన ఎమ్మెల్యేల చేత ప్రమాణస్వీకారం చేయించిన తరువాత.. వాళ్లంతా కలిసి స్పీకర్‌ను ఎన్నుకుంటారు. అయితే ప్రొటెం స్పీకర్ ఎవరు అనేదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడున్న ఎమ్మెల్యేలలో అత్యధికసార్లు గెలిచిన ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. 8 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఆయన సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యేగా ఉన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ కేసీఆర్‌ను ఎన్నుకుంటుందా అనుకునే క్రమంలోనే కేసీఆర్ ప్రమాదానికి గురయ్యారు. తన ఫాంహౌజ్‌లో బాత్‌రూమ్‌కు వెళ్తున్న సమయంలో కేసీఆర్ కాలుజారి పడిపోయారు. దీంతో ఆయన తొంటి ఎముక విరిగిపోయింది. ప్రస్తుతం ఆయన యశోద హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు.
దీంతో ఇప్పుడు ప్రొటెం స్పీకర్ బాధ్యత ఎవరు తీసుకుంటారు అనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఒకవేళ కేసీఆర్ అందుబాటులో లేకపోతే.. ఆయన తరువాత ఎవరు సీనియర్ ఐతే వాళ్లను ప్రొటెం స్పీకర్‌గా ఎన్నుకోవచ్చు. ప్రస్తుతం కేసీఆర్ తరువాత బీఆర్ఎస్ నుంచి మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, దానం నాగేందర్, తలసాని శ్రీనివాస్‌యాదవ్ సీనియర్ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఇక కాంగ్రెస్ నుంచి ఆరుసార్లు ఎన్నికైన ఎమ్మెల్యేలు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు ఇద్దర్నీ క్యాబినెట్‌లోకి తీసుకున్నారు. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ కూడా ఆరుసార్లు ఎన్నికయ్యారు. ఈ పరిస్థితుల్లో ఎవరు ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరిస్తారనేది ఆసక్తికరంగా మారింది. చూడాలి మరి అసెంబ్లీలో ఏం జరగబోతోందో.