TBJP: కమలంలో కల్లోలం..! ఏమాత్రం మారని తెలంగాణ బీజేపీ తీరు!!

అసలు బీజేపీకి ఏమైందని గుసగుసలాడుకుంటున్నారు. బీజేపీ క్రమశిక్షణ కలిగిన పార్టీగా పేరుంది. కానీ ఇక్కడ మాత్రం నేతల తీరు అనేక విమర్శలకు తావిస్తోంది. వేగంగా వెళ్తున్న బండికి సడన్ బ్రేకులు వేసి బోల్తా కొట్టించారని అందరూ మాట్లాడుకుంటున్నారు.

  • Written By:
  • Publish Date - July 22, 2023 / 03:41 PM IST

సాధారణంగా ఎన్నికలనగానే బీజేపీ చాలా దూకుడు మీదుంటుంది. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా గట్టి ఫైట్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంది. ఇక తెలంగాణలో అయితే ఆ పార్టీ దాదాపు అధికారంలోకి వచ్చేశామని చెప్పుకుంటోంది. అయితే సరిగ్గా ఎన్నికలకు నాలుగు నెలలు కూడా లేదు. ఇలాంటి సమయంలో ఆ పార్టీలో గందరగోళం నెలకొంది. ఇంతకుముందున్న ఉత్సాహం అస్సలు కనిపించడం లేదు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు నాయకులు వ్యవహరిస్తున్నారు. ఒకరంటే ఒకరికి అస్సలు పడట్లేదు. ఎలాంటి పరిస్థితులనైనా చక్కదిద్దగలిగే అధిష్టానం కూడా తెలంగాణ బీజేపీని మాత్రం సెట్ చేయలేకపోతోంది.

బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ ని తప్పించి కిషన్ రెడ్డిని నియమించింది అధిష్టానం. కిషన్ రెడ్డి నిన్న అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా బీజేపీలో విభేదాలు మరోసారి బయటపడ్డాయి. వేదికపై నుంచి విజయశాంతి అర్ధంతరంగా వెళ్లిపోయారు. కిరణ్ కుమార్ రెడ్డి అక్కడ ఉండడం సహించలేక తాను వెళ్లిపోయానంటూ ఆమె ఆ తర్వాత ట్వీట్ చేశారు. మరోవైపు తాజా మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా తనదైన శైలిలో నేతలకు చురకలు అంటించారు. కిషన్ రెడ్డినైనా చక్కగా పని చేసేలా చూడాలని.. అధిష్టానానికి ఫిర్యాదులు ఇవ్వడం మానేయాలని సూచించారు. విజయశాంతి, బండి సంజయ్ తీరు అక్కడున్న వారందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

అసలు బీజేపీకి ఏమైందని గుసగుసలాడుకుంటున్నారు. బీజేపీ క్రమశిక్షణ కలిగిన పార్టీగా పేరుంది. కానీ ఇక్కడ మాత్రం నేతల తీరు అనేక విమర్శలకు తావిస్తోంది. అసలు బండి సంజయ్ ని ఎందుకు తొలగించారో కూడా అర్థం కావడం లేదు. ఇవాళ తెలంగాణలో బీజేపీ ఈ స్థాయిలో ఉందంటే అందుకు బండి సంజయే కారణం. ఇది కాదనలేని సత్యం. అలాంటి బండ్ సంజయ్ ని హఠాత్తుగా తీసేశారు. అసలు తననెందుకు తొలగించారో కూడా అర్థంకావట్లేదని సాక్షాత్తూ బండి సంజయే ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆయన స్థానంలో కిషన్ రెడ్డిని నియమించి ఎన్నికలు ఎదుర్కోవాలని ఆదేశించింది హైకమాండ్. ఎన్నికల ముందు ఇలాంటి ప్రయోగాలు ఎందుకో అస్సలు అర్థం కావట్లేదు. వేగంగా వెళ్తున్న బండికి సడన్ బ్రేకులు వేసి బోల్తా కొట్టించారని అందరూ మాట్లాడుకుంటున్నారు. మొన్నటిదాకా అధికారంలోకి వస్తామనుకున్న బీజేపీ.. ఇప్పుడు మూడో స్థానానికి పడిపోయింది.