BJP: రిజర్వుడ్ నియోజకవర్గాలపై బీజేపీ ఫోకస్.. అవి గెలిస్తే చాలు..

కొత్తగా అధ్యక్షుడిగా ఎన్నికైన కిషన్ రెడ్డి పక్కా ప్రణాళికతో, వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికలకు తక్కువ సమయమే ఉండటం వల్ల గెలిచే అవకాశం ఉన్న నియోజకవర్గాలపై దృష్టిపెట్టారు. అందుకే ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలపై స్పెషల్ ఫోకస్ చేశారు.

  • Written By:
  • Publish Date - July 14, 2023 / 12:00 PM IST

BJP: తెలంగాణలో గతంతో పోలిస్తే పరిస్థితులు బీజేపీకి అనుకూలంగా లేకున్నా గెలుపు కోసం ప్రయత్నాల్ని మాత్రం ఆపడం లేదు. ఎన్నికల్లో గెలుపు కోసం అవసరమైన ప్రయత్నాలు అన్నీ చేసేందుకు సిద్ధమైంది. దీనిలో భాగంగా రిజర్వుడ్ కేటగిరిలపై దృష్టిపెట్టింది. తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో 31 రిజర్వుడ్ స్థానాలున్నాయి. వీటిలో ఎస్సీ రిజర్వుడ్ స్థానాలు 19కాగా, ఎస్టీ స్థానాలు 12. తెలంగాణలో అధికారం చేపట్టేందుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 63. ఇందులో దాదాపు సగం సీట్లు.. అంటే 31 రిజర్వుడ్ స్థానాలు దక్కించుకున్నా చాలు. అధికారం సులభమవుతుంది. అందుకే ఇప్పుడు ఈ స్థానాలపై బీజేపీ ప్రత్యేక దృష్టిపెట్టింది.
రిజర్వుడ్ సీట్లలో ఎక్కువ స్థానాలు ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీదే అధికారం. గత ఎన్నికల్లో 31 రిజర్వుడ్ సీట్లలో 22 బీఆర్ఎస్ గెలిచింది. 16 ఎస్సీ సీట్లు, 6 ఎస్టీ సీట్లు గెలుపొందింది. మిగతా స్థానాల్లో కాంగ్రెస్‌, టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌తో కూడిన మహాకూటమి గెలుపొందాయి. అందుకే ఈసారి రిజర్వుడ్ స్థానాల్లో ఎక్కవ సీట్లు సాధించడంపై బీజేపీ దృష్టిపెట్టింది. ఇందుకోసం నెమ్మదిగా కార్యాచరణ ప్రారంభించింది. అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ ఇందుకోసం ఒక బ్లూప్రింట్ రెడీ చేసింది. 19 ఎస్సీ నియోజకవర్గాలకు సంబంధించిన బాధ్యతను జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డికి, 12 ఎస్టీ నియోజకవర్గాల బాధ్యతలను గరికపాటి మోహన్‌రావుకు అప్పగించింది హైకమాండ్.
కిషన్ రెడ్డి స్పెషల్ ఫోకస్
కొత్తగా అధ్యక్షుడిగా ఎన్నికైన కిషన్ రెడ్డి పక్కా ప్రణాళికతో, వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికలకు తక్కువ సమయమే ఉండటం వల్ల గెలిచే అవకాశం ఉన్న నియోజకవర్గాలపై దృష్టిపెట్టారు. అందుకే ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలపై స్పెషల్ ఫోకస్ చేశారు. ఈ స్థానాల్లో గెలిచేందుకు వివిధ రాష్ట్రాలకు చెందిన ఎస్సీ, ఎస్టీ మోర్చాలతోపాటు ఆయా వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు, కేంద్ర మంత్రులతో ప్రచారం నిర్వహించబోతున్నారు. చత్తీస్‌గఢ్‌, మిజోరాం, మధ్యప్రదేశ్‌, రాజస్తాన్‌ సహా పలు రాష్ట్రాలకు చెందిన ఎస్సీ, ఎస్టీ మోర్చా ప్రతినిధులు త్వరలో తెలంగాణలో పర్యటిస్తారు. 31 రిజర్వుడ్‌ నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించి బీజేపీ పార్టీని గిరిజన, దళిత వర్గాల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు తగిన ప్రచారం నిర్వహిస్తారు. బీజేపీ చేపట్టబోయే కార్యక్రమాల్లోనూ ఆయా నియోజకవర్గాలకు ప్రాధాన్యం ఇస్తారు. బీజేపీలోని కేంద్రస్థాయి నేతలు కూడా రిజర్వుడ్ నియోజకవర్గాల్లో పర్యటించి పార్టీ గెలుపు కోసం కృషి చేస్తారు.