T BJP: తెలంగాణలో బీజేపీ ప్లాన్ బెడిసికొడుతోందా..? జమిలి ఎన్నికలతో ముప్పు తప్పదా..?

తెలంగాణలో బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో బీజేపీ దూకుడుగా ఉండేది. ఆ సమయంలో బీఆర్ఎస్‌కు ప్రధాన పోటీ బీజేపీనే అనే పరిస్థితి ఉండేది. అయితే, బండిపై ఈటల, కోమటిరెడ్డి వంటి నేతలు ఫిర్యాదు చేసి, ఆయనను పదవి నుంచి దింపేశారు.

  • Written By:
  • Publish Date - September 7, 2023 / 07:24 PM IST

T BJP: తెలంగాణలో బీజేపీ పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. బీజేపీ అధిష్టానం పెట్టుకున్న లక్ష్యాలేవీ నెరవేరడం లేదు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీ మరింత స్తబ్దుగా మారడం నేతల్ని, పార్టీ అధిష్టానాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. ఇదంతా అధిష్టానమే కావాలని చేస్తోందా.. లేక రాష్ట్ర నేతల స్వయంకృతాపరాధమా అనేదాంట్లో స్పష్టత లేదు.
తెలంగాణలో బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో బీజేపీ దూకుడుగా ఉండేది. ఆ సమయంలో బీఆర్ఎస్‌కు ప్రధాన పోటీ బీజేపీనే అనే పరిస్థితి ఉండేది. అయితే, బండిపై ఈటల, కోమటిరెడ్డి వంటి నేతలు ఫిర్యాదు చేసి, ఆయనను పదవి నుంచి దింపేశారు. బండి స్థానంలో కిషన్ రెడ్డి అధ్యక్షుడయ్యారు. ఈటలకు చేరికల కమిటీ అధ్యక్ష పదవి ఏర్పాటు చేశారు. ఈ పదవిని ఆయనకే ఇవ్వడానికి ఒక కారణం ఉంది. ఈటల దశాబ్దంపాటు బీఆర్ఎస్‌లో కొనసాగారు. ఆయనకు ఆ పార్టీ నేతలతో సన్నిహిత సంబంధాలున్నాయి. ఇతర పార్టీ నేతలతోనూ సఖ్యతగా ఉండేవారు. ఎవరితోనూ పెద్దగా విబేధాలు లేవు. అందువల్ల ఈటలను చేరికల కమిటీ అధ్యక్షుడిని చేస్తే.. ఈజీగా ఇతర పార్టీల నాయకుల్ని బీజేపీలోకి తేగలరని అధిష్టానం నమ్మింది. అందులోనూ బీఆర్ఎస్‌లో అసంతృప్తితో ఉన్న నేతల్ని గుర్తించి, బీజేపీలో చేరుస్తారనుకున్నారు.

కానీ, ఈటలకు ఆ పదవి వచ్చేసరికి బీజేపీ పరిస్థితి తారుమారైంది. ఇతర పార్టీల నేతలెవరూ బీజేపీవైపు కన్నెత్తి చూడటం లేదు. పొంగులేటి, జూపల్లి వంటి నేతలు కాంగ్రెస్‌లో చేరిపోయారు. తుమ్మల కూడా కాంగ్రెస్‌లో చేరబోతున్నారు. బీజేపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఇటీవలే పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ నుంచి వెళ్లేవాళ్లే తప్ప వచ్చే వాళ్లు కనిపించడం లేదు. కోమటిరెడ్డి, వివేక్ వెంకటస్వామి వంటి నేతలు పార్టీ మారుతారన్న ప్రచారం కూడా జరుగుతోంది. దీంతో పార్టీకి పోటీ చేసేందుకు సరైన నేతలే దొరకడం లేదు. ఒకపక్క కాంగ్రెస్ పార్టీలో టిక్కెట్ల కోసం పోటీ కనబడితే, బీజేపీలో టిక్కెట్లు ఆశించే కీలకనేతలే లేకుండాపోయారు. కొద్దిమంది సీనియర్ నేతలు తప్ప, కిందిస్థాయి నేతలే పార్టీలో టిక్కెట్ల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు.
జమిలి ఎన్నికలతో ముప్పేనా..?
వచ్చే ఎన్నికల్లో గెలుపుపై పెద్దగా ధీమా లేని బీజేపీ అధిష్టానం కొత్త స్ట్రాటజీని ఫాలో అవ్వాలనుకుంది. బీఆర్ఎస్ కీలక నేతలు పోటీ చేసే స్థానాల్లో బీజేపీ కీలక నేతల్ని పోటీ చేయించాలనుకుంటోంది. అంటే కేసీఆర్ పోటీ చేసే గజ్వేల్‌లో ఈటల, కేటీఆర్ పోటీ చేసే సిరిసిల్లలో బండి సంజయ్, జీవన్ రెడ్డి పోటీ చేసే ఆర్మూరులో ధర్మపురి అర్వింద్ వంటి నేతల్ని పోటీలో దించాలని భావిస్తోంది. గెలిచినా, గెలవకపోయినా.. ఆయా నేతలకు గట్టిపోటీ ఇస్తే చాలనేది బీజేపీ పెద్దల వ్యూహం. ఒకవేళ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా.. తర్వాత జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసే అవకాశం కల్పిస్తామని చెప్పింది. అయితే, జమిలి ఎన్నికలు జరిగితే.. ఈ వ్యూహం తలకిందులయ్యే అవకాశం ఉంది. దీంతో ఎవరు ఎంపీగా పోటీ చేస్తారో.. ఎవరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తారో తెలియని పరిస్థితి తలెత్తుతుంది. జమిలి ఎన్నికల నేపథ్యంలో ఈ గందరగోళం నెలకొన్నట్లు తెలుస్తోంది.