T BJP: తెలంగాణలో బీజేపీ కూడా ఎన్నికల కోసం సిద్ధమవుతోంది. అభ్యర్థుల ఎంపిక దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మొదలైంది. కాంగ్రెస్ పార్టీలాగే బీజేపీ కూడా టిక్కెట్లు కావాలనుకునే అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది. హైదరాబాద్, నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఇందుకోసం ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశారు. ఉచితంగానే అభ్యర్థుల నుంచి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది బీజేపీ.
సెప్టెంబర్ 4, సోమవారం నుంచి సెప్టెంబర్ 10 వరకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగనుంది. బీజేపీ దరఖాస్తుల విధానంలో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ప్రారంభించడం ఇదే మొదటిసారి. టిక్కెట్ల కోసం వచ్చిన దరఖాస్తుల్ని మూడు దశల్లో పరిశీలించి, అభ్యర్థుల్ని ఎంపిక చేస్తారు. జిల్లా, రాష్ట్ర, కేంద్ర స్థాయిల్లో వడపోత కార్యక్రమం సాగుతుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు క్రిమినల్ కేసుల వివరాలు కూడా వెల్లడించాల్సి ఉంటుంది. బీజేపీ కోసం ఎప్పటినుంచి పని చేస్తున్నారో వివరించాలి. రంగారెడ్డి, హైదరాబాద్ తో పాటు ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి ఒక్కో సీటుకు భారీగా అప్లికేషన్లు వచ్చే అవకాశం ఉంది. మిగతా చోట్ల నుంచి తక్కువగానే దరఖాస్తులు రావొచ్చు.
వెనుకబడ్డ బీజేపీ
బీఆర్ఎస్, కాంగ్రెస్‌తో పోలిస్తే అభ్యర్థుల ఎంపికలో బీజేపీ వెనుకబడిందనే చెప్పాలి. బీఆర్ఎస్ ఈపాటికే అభ్యర్థుల్ని ప్రకటించింది. కాంగ్రెస్ కూడా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ప్రారంభించింది. మరో రెండు వారాల్లోగా అభ్యర్థుల్ని ప్రకటించే అవకాశం ఉంది. కాంగ్రెస్ లో టిక్కెట్ల కోసం భారీ పోటీ ఉంది. అయితే, బీజేపీలో అంతగా పోటీ లేదు. అసలే కొంతకాలంగా పార్టీలో చేరికలు కూడా లేవు. ఈ నేపథ్యంలో దరఖాస్తు చేసుకున్న వారికి ఈజీగానే టిక్కెట్లు వచ్చే అవకాశం ఉంది.