Telangana: గ్యాస్ సిలిండర్ చుట్టూ తెలంగాణ రాజకీయం.. బీఆర్ఎస్, కాంగ్రెస్‌కు బీజేపీనే ఆయుధం ఇచ్చిందా ?

ఒకరికి మించి ఒకరు అన్నట్లుగా తెలంగాణలో రాజకీయ వ్యూహాలు సాగుతున్నాయ్. అసెంబ్లీ ఎన్నిలకు మరో 8నెలల సమయం మాత్రమే ఉండడంతో.. ప్రతీది ఆయుధంగానే మారుతోంది పార్టీలకు ! ఇప్పటికే జనంలో జనంలా అన్ని పార్టీలు కలిసిపోతున్నాయ్. ఓటర్ల మనసు గెలుచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయ్. ప్రతీ అంశాన్ని ఆయుధంగా మార్చుకొని ప్రత్యర్థిని ఇరుకున పెట్టేలా వ్యూహాలు రచిస్తున్నాయ్. బీజేపీ, కాంగ్రెస్.. బీఆర్ఎస్.. ఎవరి వ్యూహాలు వారికి ఉన్నాయ్.

  • Written By:
  • Publish Date - March 4, 2023 / 03:46 PM IST

బీజేపీ, బీఆర్ఎస్ మధ్య జరుగుతున్న యుద్ధం అయితే పీక్స్ ! ఇలాంటి సమయంలో గ్యాస్ సిలిండర్ రూపంలో.. ప్రత్యర్థులకు కమలం పార్టీ ఆయుధం అందించినట్లు అయింది. దీంతో రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాలు.. గ్యాస్ బండ చుట్టూ తిరగడం ఖాయంగా కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా గ్యాస్ సిలిండర్ ధర 50 రూపాయలు పెరిగింది. కేంద్రం తీరుకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ యుద్ధం మొదలుపెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తెలిపింది. దీంతో పాటు పెరిగిన 50 రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం భరించేందుకు సిద్ధం అవుతోంది. బీజేపీని కార్నర్ చేయడంతో పాటు.. ఓటర్ల మనసు గెలవాలన్న వ్యూహంగా ముందుకు సాగుతోంది. ఇక కాంగ్రెస్ కూడా తగ్గేదే లే అంటోంది. తాము అధికారంలోకి వస్తే.. 5వందల రూపాయలే గ్యాస్ సిలిండర్ అని ప్రకటనలు చేస్తోంది. దీంతో గ్యాస్ సిలిండర్ చుట్టూ రాజకీయం ఎలా తిరగబోతుందో.. రెండు పార్టీల అడుగులు చెప్పకనే చెప్తున్నాయ్. 50 రూపాయలు పెరగడంతో.. ఇప్పుడు డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర 12వందలకు చేరింది. ఇది పేదలకు మోయలేని భారం. 2014లో సిలిండర్ ధర 450 రూపాయలుగా ఉండేది. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న బిజెపి… అప్పటి యూపీఏ సర్కార్ మీద పెద్దఎత్తున విమర్శలు చేసేది. అదే బీజేపీ సర్కార్ ఇప్పుడు ధరలు పెంచుతూ పోతోంది. ఇదే కాంగ్రెస్, బీఆర్ఎస్‌కు ఆయుధంగా మారుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ యుద్ధం చేస్తున్నట్లు కనిపిస్తున్నా.. ఆ రెండు పార్టీల కామన్ శత్రువు బీజేపీ. దీంతో ఎన్నికల నాటికి.. గ్యాస్ సిలిండర్ వ్యవహారం కీలక అస్త్రంగా మారబోతోంది. దీంతో ఇప్పుడు బీజేపీ ఇరుకున పడినట్లు అయింది. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న కమలం పార్టీ.. ఆ రెండు పార్టీల విమర్శలకు ఎలాంటి కౌంటర్ ఇస్తారన్నది హాట్ టాపిక్ గా మారింది.