AICC అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) భారత్ జోడో న్యాయ యాత్రను మణిపూర్ నుంచి ప్రారంభించారు. మహారాష్ట్ర వరకూ 67 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగనుంది. ఈ టూర్ లో కొన్ని చోట్ల బస్సులో.. మరికొన్ని పాదయాత్ర ద్వారా రాహుల్ గాంధీ (Rahul Gandhi) పర్యటన కొనసాగనుంది. ఈ యాత్రలో తెలంగాణ రిజిస్ట్రేషన్ తో ఉన్న బస్సు కనిపించడం.. ఇప్పుడు సంచలనంగా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఈ బస్సును గిఫ్ట్ గా ఇచ్చారన్న టాక్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
భారత్ జోడో న్యాయయాత్రలో (Rahul Bharat Jodo Nyaya Yatra) బుల్లెట్ ప్రూఫ్ బస్సులో రాహుల్ గాంధీ పర్యటిస్తున్నారు. వాల్వో కంపెనీని చెందిన ఈ బస్సు నెంబర్ TS 09GF8055. ఖైరతాబాద్ ఆర్టీవోలో రిజిస్ట్రేషన్ అయింది. బస్సు ఓనర్ నేమ్ ఆలిండియా కాంగ్రెస్ గా చూపిస్తోంది. తండ్రి పేరు సుదగోని లక్ష్మీనారాయణ గౌడ్ అని ఉంది. ఇతను నల్లగొండ జిల్లాకు చెందిన వ్యక్తిగా చెబుతున్నారు. ఈ బస్సును తెలంగాణ కాంగ్రెస్ సమకూర్చినట్టు సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ అవుతున్నాయి. బస్సు నెంబర్ లోని 8055 ను BOSS గా చెబుతున్నారు నెటిజెన్స్. సాధారణంగా ఈ నెంబర్ ఎలాట్ అయిన వాళ్ళు.. BOSS అని ఇంగ్లీష్ అక్షరాలు కనిపించేలా బోర్డు రాయించుకుంటారు. అంటే తమ బాస్ రాహుల్ గాంధీకి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇలా గిఫ్ట్ గా ఇచ్చాడని అంటున్నారు. జోడో యాత్ర ఖర్చు మొత్తం తెలంగాణ కాంగ్రెస్ భరిస్తోందని కూడా కొందరు నెటిజెన్స్ కామెంట్ చేస్తున్నారు.
అసలు తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని (CM Revanth Reddy) ఎంపిక చేయడం వెనుక ఉద్దేశ్యం కూడా AICC కి ఆర్థికంగా సహాయపడతాన్న టాక్ అప్పట్లో నడిచింది. రాబోయే లోక్ సభ ఎన్నికలతో పాటు AICC చేపట్టే ఇలాంటి కార్యక్రమాలకు సహకారం ఉంటుందని రేవంత్ కి సీఎం పగ్గాలు ఇచ్చారని అంటున్నారు. సీఎం పదవికి ఎంతోమంది పార్టీ సీనియర్లు పోటీపడ్డా.. రాహుల్ మాత్రం రేవంత్ పైనే ఇంట్రెస్ట్ చూపించారు. అదే విషయం ఈమధ్య ఇంటర్వ్యూలో కూడా రేవంత్ చెప్పారు. అందుకే బాస్ రాహుల్ కి గిఫ్ట్ గా వోల్వో బస్సును సమకూర్చారని టాక్ నడుస్తోంది.
ప్రస్తుతం ఆలిండియా కాంగ్రెస్ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. అందుకే భారత్ జోడో న్యాయ్ యాత్ర చేపట్టే ముందు.. డొనేట్ ఫర్ ది కంట్రీ పేరుతో ఆన్ లైన్ క్రౌడ్ ఫండింగ్ ప్రచార కార్యక్రమం చేపట్టింది. అందుకోసం ప్రత్యేకంగా ఓ వెబ్ సైట్ ను క్రియేట్ చేసి.. విరాళాలు సేకరిస్తోంది AICC. దేశ నిర్మాణం కోసం ప్రజల నుంచి ఫండ్స్ వసూలు చేస్తున్నట్టు చెప్పుకున్నారు కాంగ్రెస్ పెద్దలు. గత పదేళ్ళుగా కేంద్రంలో అధికారానికి కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉంది. దాంతో బీజేపీకి పార్టీ ఫండ్ 6 వేల కోట్లు దాకా ఉంటే.. కాంగ్రెస్ దగ్గర ప్రస్తుతం 8 వందల కోట్లు మాత్రమే ఉన్నాయి. అంటే కాంగ్రెస్ కంటే బీజేపీ దగ్గర ఉన్న నిధులు ఏడు రెట్లు ఎక్కువ. దీన్నిబట్టే కాంగ్రెస్ ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది.
అందుకే AICC.. ఇప్పుడు తమ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలపై ఆశలు పెట్టుకుంది. పార్టీ ఫండ్స్ ని ఆ రాష్ట్రాల నుంచే సేకరించాలని భావిస్తోంది. అందులో భాగంగానే తెలంగాణలో ఎన్నికలు జరిగినప్పుడు. కర్ణాటక నుంచి డబ్బులు పంపారన్న ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో కేంద్ర సంస్థలు దాడులు చేసినప్పుడు కర్ణాటకలో కోట్లలో డబ్బులు పట్టుబడ్డాయి. తెలంగాణ ఎన్నికల ఖర్చు కోసం.. కర్ణాటకలో TS ట్యాక్స్ వేశారని.. సిద్ధరామయ్య ప్రభుత్వంపై బీఆర్ఎస్, బీజేపీ విమర్శలు చేశాయి. ఇప్పుడు రాహుల్ గాంధీ యాత్రకు తెలంగాణ రిజిస్ట్రేషన్ కు చెందిన బస్సు కూడా ఇక్కడి కాంగ్రెస్ కమిటీయే సమకూర్చిందన్న ఆరోపణలు వస్తున్నాయి.