CM KCR: తెలంగాణ కేబినెట్ భేటీ ఈ నెల 31 నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ సందర్భంగా కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. మరోవైపు తెలంగాణ అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాల తేదీలు కూడా ఖరారయ్యాయి. ఆగస్టు 3వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో ఎన్నికల వాతావరణం కొనసాగుతోంది. మరోవైపు రాష్ట్రాన్ని తీవ్ర వదరలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
వర్షాలు, వరదలు వంటి అంశాలపై కేసీఆర్ ప్రభుత్వం స్పందించాల్సి ఉంది. కీలకమైన ఎన్నికల సమయంలో వచ్చిన విపత్తు విషయంలో సరిగ్గా స్పందించకుంటే అది ప్రభుత్వానికి తీవ్ర నష్టం కలిగిస్తుంది. అందుకే వరదలపై కేబినెట్ మీటింగ్‌లో చర్చించి, బాధితులకు వరద సాయం ప్రకటించే అవకాశం ఉంది. కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలపై చర్చ జరగనుంది. కేబినెట్ భేటీకి సంబంధించిన అంశాలపై నిర్ణయం తీసుకునేందుకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, హరీష్ రావు సుదీర్ఘంగా చర్చించారు. అలాగే అసెంబ్లీ సమావేశాలపై కూడా రెండు రోజుల క్రితం చర్చ జరిగినట్లు తెలుస్తోంది. తెలంగాణ అసెంబ్లీకి సంబంధించి వచ్చే నెలలో జరగబోయే వర్షాకాల సమావేశాలో చివరివి కావొచ్చు. శీతాకాల సమావేశాల్లోపే ప్రభుత్వం రద్దవుతుంది. అందుకే ఈ సమావేశాలపై ప్రాధాన్యం నెలకొంది.
ఈ నెల 31, సోమవారం జరగనున్న మంత్రివర్గ భేటీలో భారీ వర్షాలు, వరదలు, సహాయక చర్యలు, పంట నష్టం వంటి అంశాలపై ప్రధానంగా చర్చ జరుగుతుంది. వరద బాధితులకు ఆర్థిక సాయం ప్రకటిస్తారు. ప్రాణాలు పోగొట్టుకున్న వారితోపాటు, ఆస్తి నష‌్టం జరిగిన వారికి సాయం అందేలా చూస్తారు. వీటితోపాటు కొత్త పథకాల్ని ప్రవేశపెట్టే అవకాశం ఉంది. త్వరలో ఎన్నికలు జరగనున్నందువల్ల సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై కీలక ప్రకటనలు వెలువడే అవకాశం ఉంది. పీఆర్సీ, ఆర్టీసీ ఉద్యోగుల జీతాల పెంపు, రోడ్ల మరమ్మతులు వంటి 40-50 అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. అలాగే రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, ఎన్నికలపై చర్చ జరిగే అవకాశం ఉంది. కొత్త పథకాల్ని కేసీఆర్ ప్రకటిస్తారేమో అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.