Patnam Mahender Reddy: ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేసీఆర్ రాజకీయ అస్త్రాలన్నీ వాడేందుకు సిద్ధమవుతున్నారు. ఇతర పార్టీలకంటే ముందుగా అభ్యర్థుల్ని ప్రకటించారు. మరోవైపు కేబినెట్ విస్తరణకు కూడా ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం.. రెండు, మూడు రోజుల్లో తెలంగాణ కేబినెట్ విస్తరించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే, మంత్రివర్గంలో మరీ భారీ మార్పులేమీ చేయకపోవచ్చన్న ప్రచారం జరుగుతోంది. ఒకరిద్దరు మంత్రిత్వ శాఖల మార్పు ఉండొచ్చు. దీంతోపాటు ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్న మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డికి మంత్రివర్గంలో చోటు దక్కనుంది.
ఈ విషయాన్ని పట్నం స్వయంగా వెల్లడించారు. విదేశీ పర్యటనలో ఉన్న కేటీఆర్.. అన్నీ సెట్ చేసి వెళ్లారని, తాను మంత్రివర్గంలో చేరబోతున్నానని, అయితే, గవర్నర్ నుంచి ఆదేశాలు వచ్చే వరకు ఇంతకుమించి ఇంకేం మాట్లాడబోనని చెప్పారు. దీన్నిబట్టి పట్నంకు మంత్రివర్గంలో చోటు ఖాయం అని తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. బుధవారం ఉదయం 11.30 గంటలకు రాజ్‍భవన్‍లో పట్నం మంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారు. ఈ విషయంపై ఇప్పటికే సీఎంవో వర్గాలు రాజ్‌భవన్‌కు సమాచారం అందించాయి. ప్రస్తుతం తెలంగాణ గవర్నర్ తమిళిసై పాండిచ్చేరిలో ఉన్నారు. సోమవారం రాత్రికి హైదరాబాద్ చేరుకుంటారు. దీనికి సంబంధించిన పనులు మంగళవారం పూర్తవుతాయి. బుధవారం ప్రమాణస్వీకారం ఉంటుంది. బీఆర్ఎస్ నుంచి వెళ్లిన ఈటల రాజేందర్‌కు చెందిన మంత్రిత్వ శాఖను పట్నంకు అప్పగించవచ్చు. ఈ శాఖను ప్రస్తుతం హరీష్ రావు చూస్తున్నారు. ఆయన నుంచి పట్నంకు పదవి దక్కొచ్చు. అయితే, ఎన్నికలకు మూడు నెలలు మాత్రమే సమయం ఉన్నందున ఈ స్వల్ప కాలంలో మంత్రిత్వ శాఖ తీసుకుని పట్నం ఏం చేస్తారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
పట్నంకు ఎందుకు..?
పట్నం మహేందర్ రెడ్డి రంగారెడ్డి జిల్లాలో బలమైన నేత. ఆయన మంత్రిగానూ పని చేశారు. ఆయన భార్య సునీతా మహేందర్ రెడ్డి కూడా రాజకీయాల్లో ఉన్నారు. పట్నం మహేందర్ రెడ్డి 1994లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 1999లో, 2009లో, 2014లో గెలిచారు. 2014 తర్వాత కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా చేశారు. అనంతరం 2018లో కాంగ్రెస్ అభ్యర్థి పైలట్ రోహిత్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. అయితే, పైలట్ చివరకు బీఆర్ఎస్‌లో చేరారు. దీంతో పట్నంకు కేసీఆర్ ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. అయినప్పటికీ ఆయన తాండూరు నియోజకవర్గ టిక్కెట్ ఆశించారు. తనకు, తన భార్యకు వికారబాద్, తాండూరు, పరిగి, చేవెళ్ల, షాద్‌నగర్ టిక్కెట్లలో ఏవైనా కావాలని అడిగారు. దీనికి కేసీఆర్ అంగీకరించారు. పైలట్‌కు ఉన్న ప్రాధాన్యం రీత్యా ఆయనకే టిక్కెట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో పట్నం తిరుగుబాటు చేస్తే ఇబ్బంది అని భావించిన కేసీఆర్.. ఆయనకు మంత్రి పదవి ఇచ్చి, బుజ్జగించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది.