Telangana: దళితబంధు నొక్కేస్తున్న ఎమ్మెల్యేలు.. కేసీఆర్‌ వార్నింగ్ ఇచ్చింది ఎవరికి ?

పేదోడి బతుకు మార్చేందుకు చేసే సాయాన్ని నొక్కేయడం ఏంటి.. సన్నాసితనం కాకపోతే ! తెలంగాణలో ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయ్. ఓట్ల కోసమా.. నిజంగా ప్రేమ ఉండి చేస్తున్నారా అన్న సంగతి పక్కనపెడితే.. దళిత బంధు పథకం తెచ్చారు రాష్ట్రంలో ! ఎందుకు హుజురాబాద్‌ ఎన్నికల సమయంలోనే ఇది గుర్తుకొచ్చిందని అడగకండి.. వేరే ముచ్చట అదంతా ! ఎప్పుడో ఒకప్పుడు.. పథకం అయితే ప్రారంభం అయింది.

  • Written By:
  • Publish Date - April 27, 2023 / 08:00 PM IST

పేద దళితుల కుటుంబాల్లో వెలుగులు నిండడం ఖాయం అనుకుంటే.. ఆ డబ్బుల్లోనూ వాటాలు మింగుతున్న ఎమ్మెల్యేల తీరు.. ఇప్పుడు సిగ్గుతో తలదించుకునేలా చేస్తోంది బీఆర్ఎస్‌ను ! దళితబంధు కింద ప్రతీ దళిత యువకుడికి పది లక్షల సాయం అందిస్తారు. ఐతే ఈ పది లక్షల్లో 3లక్షల రూపాయలు ఎమ్మెల్యేలు నొక్కేస్తున్నారు. ఇది విపక్షాలు అన్న మాటతో, కడుపు మండి జనాలు చేసిన నినాదమో కాదు.. అధికారపార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ నోటి నుంచి వచ్చిన మాట.

దళితబంధు పథకంలో కొందరు కమీషన్లు తీసుకుంటున్నారని.. వారందరి జాబితా తన దగ్గర ఉందని.. అలాంటి వాళ్లందరికీ ఇదే లాస్ట్ వార్నింగ్ అని.. తెలంగాణభవన్‌లో జరిగిన బీఆర్ఎస్ సర్వసభ్య సమావేశంలో హెచ్చరించారు కేసీఆర్‌. ఎమ్మెల్యేలు కాకుండా.. ఎవరు కమీషన్లు తీసుకున్నా.. ఆ బాధ్యత ఎమ్మెల్యేలదే అని స్ట్రాంగ్‌గానే వార్నింగ్ ఇచ్చారు. పద్దతి మార్చుకోకపోతే తోకలు కత్తిస్తానని.. సీటు ఉండదని అన్నారు. ఇదే ఇప్పుడు తెలంగాణలో కొత్త చర్చకు కారణం అవుతోంది.

నిజానికి దళితబంధులో అవినీతి జరుగుతోందని విపక్షాలు ఎప్పటి నుంచో ఆరోపిస్తున్నాయి. ఐతే అలాంటి విమర్శలను అధికార పార్టీ ఎప్పటికప్పుడు ఖండిస్తూ వచ్చింది. కట్‌ చేస్తే.. ఎమ్మెల్యేలు కమీషన్లు తీసుకుంటున్నారని.. అంటే అవినీతి జరుగుతోందని కేసీఆరే స్వయంగా చెప్పారు. ఇది చాలు పథకంలో ఎన్ని లొసుగులు ఉన్నాయో.. జనాలకు చేరేలోపు ఐస్‌గడ్డలా అది ఎలా కరిగిపోతుందో చెప్పడానికి ! మీటింగ్‌లో వార్నింగ్‌తో ఇకపై ఎలాంటి తప్పు జరగకపోవచ్చు సరే.. ఇప్పటివరకు జరిగిన తప్పుల సంగతి ఏంది సార్ అని కేసీఆర్‌ను ప్రశ్నిస్తున్నారు చాలామంది!

ఎన్నికల సమయం కాబట్టే వార్నింగ్ ఇచ్చారా.. లేదంటే ఇంకొన్నేళ్లు ఇలానే నడిచేదా అన్నది వారి నుంచి వినిపిస్తున్న మరో సందేహం. ఎమ్మెల్యే అంటే.. నియోజకవర్గంలోని వేల ఇళ్లకు.. ఇంటిపెద్ద. అలాంటి పెద్దమనిషి.. ఇలాంటి మెట్లు దిగి పేదోడి సాయంలో వాటా అడగడాన్ని మించిన దిగ్గుమాలినతనం, సిగ్గులేనితనం వేరొకటి ఉండదు. కేసీఆర్ దగ్గర ఉన్న లిస్టులో ఉన్న ఎమ్మెల్యేలు మాత్రమే కాదు. ఇలాంటి తప్పును ఎంకరేజ్‌ చేస్తున్న ప్రతీ ఒక్కరిదీ తప్పే. కేసీఆర్‌ వార్నింగ్‌తోనేనా మార్పు రావాలని.. నిజమైన లబ్దిదారులకు నిజమైన సాయం అందితే అంతకుమించ ఇంకొకటి కోరుకునేది ఏదీ లేదు అన్నది క్లియర్‌.