KCR: కేసీఆర్ మారిపోయారా..? అధికారం కోసం దిగొస్తున్నారా..?

ఏకఛత్రాధిపత్యం సాగించిన కేసీఆర్ వైఖరిలో ఇప్పుడు ఉన్నట్లుండి మార్పు కనిపిస్తోంది. ఇంతకాలం వ్యవహరించిన తీరుకు భిన్నంగా ఇప్పుడు కనిపిస్తున్నారు. నేతలను బుజ్జగిస్తున్నారు. గవర్నర్‌తోనూ సయోధ్యకోసం ప్రయత్నిస్తున్నారు. ఇదంతా చూస్తుంటే కేసీఆర్ మారిపోయినట్లే కనిపిస్తోంది.

  • Written By:
  • Publish Date - August 28, 2023 / 03:08 PM IST

KCR: తెలంగాణ రాజకీయాల్లో తిరుగులేని బ్రాండ్ కేసీఆర్. అధికారం చేపట్టిన తొమ్మిదేళ్లలో కేసీఆర్‌కు ఎదురే లేకుండా సాగింది ప్రస్థానం. మీడియాను, సీనియర్ నేతలను, తననే నమ్ముకున్న వాళ్లను, వ్యాపారస్థులను.. ఇలా ఎవరినీ లెక్కచేయలేదు. కొన్నేళ్లుగా గవర్నర్‌తోనూ సై అంటే సై అన్నారు. పార్టీలో, ప్రభుత్వంలో కీలక నేతలకు కూడా అపాయింట్‌మెంట్ ఇవ్వలేదు. అంతగా ఏకఛత్రాధిపత్యం సాగించిన కేసీఆర్ వైఖరిలో ఇప్పుడు ఉన్నట్లుండి మార్పు కనిపిస్తోంది. ఇంతకాలం వ్యవహరించిన తీరుకు భిన్నంగా ఇప్పుడు కనిపిస్తున్నారు. నేతలను బుజ్జగిస్తున్నారు. గవర్నర్‌తోనూ సయోధ్యకోసం ప్రయత్నిస్తున్నారు. ఇదంతా చూస్తుంటే కేసీఆర్ మారిపోయినట్లే కనిపిస్తోంది.
కేసీఆర్‌కు తెలంగాణలో ఎదురేలేదు. ప్రగతి భవన్‌కు, ఫాంహౌజ్‌కు పరిమితమైనా అడిగేవాళ్లు లేరు. ఏ నాయకుడిని ఆయన లెక్క చేసింది లేదు. తనకు అవసరం అనుకుంటేనే చేరదీశారు. పదవులిచ్చారు. లేదంటే బయటికి పంపించేశారు. ఈ వైఖరితోనే 2018లో రెండోసారి కూడా భారీ మెజారిటీతో విజయం సాధించారు. కానీ, కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. పరిస్థితులు అనుకూలించవు కదా. ఈ విషయం ఇప్పుడు కేసీఆర్‌కు బోధపడినట్లుంది. తాజాగా ఇతర నేతలతో మెతకవైఖరి అవలంబిస్తున్నారు. సానుకూలంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజా పరిణామాలే ఇందుకు నిదర్శనం. ఏ పొరపాటు చేస్తే ఏం జరుగుతుందోనన్న ఆలోచనలో కేసీఆర్ ఉన్నారు.
మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి రంగారెడ్డి జిల్లాలో కీలక నేత. ఆయన బీఆర్ఎస్ నుంచి తాండూరు అసెంబ్లీ టిక్కెట్ ఆశించారు. కానీ, ప్రస్తుత ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి టిక్కెట్ ఇచ్చారు కేసీఆర్. దీంతో మహేందర్ రెడ్డి అలిగారు. ఆయన ఇతర పార్టీల వైపు చూస్తున్నారన్న సమాచారం మేరకు.. పట్నంను బుజ్జగించేందుకు కేసీఆర్ ప్రయత్నించారు. ఏకంగా మంత్రివర్గంలో చోటు కల్పించారు. తెలంగాణలో పదవీ కాలం మరో మూడు, నాలుగు నెలలే ఉన్నప్పటికీ పట్నంను మంత్రిని చేశారు. ఎందుకంటే పట్నం తిరగబడితే, దాని ప్రభావం రోహిత్ రెడ్డిపై ఉంటుంది. రోహిత్ ఓడిపోవచ్చు. ఇది బీఆర్ఎస్‌కు ఇబ్బంది. అందుకే.. ఒక్క నియోజవకర్గమే అయినప్పటికీ కేసీఆర్ ఈసారి లైట్ తీసుకోలేదు. రోహిత్‌ను గెలిపించుకోవడంతోపాటు, పట్నం వంటి సీనియర్ నేత చేజారకుండా చూసుకోవడం కూడా చాలా ముఖ్యమని కేసీఆర్ భావించారు. అందుకే పట్నంకు మంత్రి పదవి కట్టబెట్టారు.

ఇక వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ బాబు విషయంలోనూ కేసీఆర్ ఇదే తరహా పని చేశారు. ప్రస్తుతం వేములవాడ ఎమ్మెల్యేగా ఉన్న చెన్నమనేనిని కాదని.. చల్మెడి లక్ష్మీ నరసింహా రావుకు టిక్కెట్ ఇచ్చారు కేసీఆర్. దీంతో చెన్నమనేని ఆగ్రహంగా ఉన్నారు. బీజేపీ లేదా కాంగ్రెస్‌లో చేరేందుకు ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన కేసీఆర్.. చెన్నమనేనిని బుజ్జగించే పని చేస్తున్నారు. ఆయనకు క్యాబినెట్ హోదా కలిగిన నామినేటెడ్ పదవి కట్టబెట్టేందుకు సిద్ధమయ్యారు. అంటే చెన్నమేనేని తిరుగుబాటు చేస్తారేమో అని కూడా కేసీఆర్ భయపడినట్లు అర్థమవుతోంది. అందుకే పట్నం మహేందర్ రెడ్డితోపాటు, రమేశ్ బాబు కూడా ఏదో పదవి కట్టబెట్టారు.
గవర్నర్‌తో సయోధ్య
తెలంగాణ గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ మధ్య ఉన్న వైరం గురించి తెలిసిందే. తమ ప్రభుత్వానికి సహకరించడం లేదని కేసీఆర్ సహా బీఆర్ఎస్ నేతలు తమిళిసైపై విరుచుకుపడ్డారు. ప్రభుత్వ కార్యక్రమాలకు గవర్నర్‌కు ఆహ్వానం అందలేదు. గవర్నర్ పిలిచిన కార్యక్రమానికి కేసీఆర్ సహా బీఆర్ఎస్ నేతలెవరూ వెళ్లలేదు. చివరకు అధికారులు ప్రొటోకాల్ కూడా పాటించకుండా ఆంక్షలు విధించింది ప్రభుత్వం. అంతగా గవర్నర్‌ను కేసీఆర్ ఇబ్బంది పెట్టారు. ఎన్నోసార్లు విమర్శలు కూడా చేశారు. అయితే, ఉన్నట్లుండి కేసీఆర్ వైఖరి మార్చుకున్నారు. ఇటీవల సచివాలయానికి రావాల్సిందిగా గవర్నర్‌కు కేసీఆర్ ఆహ్వానం పలికారు. నేరుగా కేసీఆర్ నుంచి గవర్నర్‌కు ఆహ్వానం రావడం రాజకీయవర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. దీనికి కారణం ఉందని విశ్లేషకులు అంటున్నారు. ప్రస్తుతం గవర్నర్ వద్ద అనేక బిల్లులు పెండింగులో ఉన్నాయి. వాటి విషయంలో గవర్నర్ కఠినంగా వ్యవహరిస్తే ప్రభుత్వానికి ఇబ్బంది. అసలే ఎన్నికలకు పెద్దగా సమయం లేదు. ఈ సమయంలో గవర్నర్‌తో పోరు వల్ల ఇబ్బందే తప్ప ఎలాంటి ఫలితంలేదని కేసీఆర్ గ్రహించారు. అందుకే గవర్నర్ ద్వారా తనకు అవసరమైన పనులన్నీ చేయించుకోవాలి అంటే తన వైఖరి మార్చుకోవాల్సిందే అని కేసీఆర్ భావించారు. దీంతో గవర్నర్‌తో సయోధ్యకు ప్రయత్నించారు.
వీటన్నింటినీ చూస్తే.. కేసీఆర్ ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవడం లేదు. తనను విబేధించేవారితోనైనా సరే.. కొన్ని మెట్లు దిగి తన లక్ష్యం నెరవేర్చుకునేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారన్న వాదన వినిపిస్తోంది. గతంలో ఎవరినీ లెక్క చేయకుండా ఉన్న కేసీఆర్.. ఇప్పుడు అందరినీ లెక్కలోకి తీసుకుంటూ, ఆచితూచి వ్యహరిస్తున్నారు. మరి ఈ పరిణామాలు కేసీఆర్‌కు ఏమేరకు మేలు చేస్తాయో చూడాలి.