ఐతే ఇంత జరుగుతున్నా.. కేసీఆర్ మాత్రం మౌనంగా కనిపిస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఎపిసోడ్‌కు ముందు.. బీజేపీ మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన కేసీఆర్.. ఆ తర్వాత రకరకాల పరిణామాలు జరిగినా.. కనీసం రియాక్ట్ కాలేదు. రాజకీయం రోజుకో రకంగా మారుతున్నా.. పెదవి విప్పడం లేదు. మూడోసారి కూడా తనదే విజయమన్న నమ్మకంతో ఉన్నారు ఒకరకంగా ఆయన ! అందుకే పెద్దగా తెలంగాణ పాలిటిక్స్‌ను పెద్దగా పట్టించుకోవడం లేదు. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయ్. ఇప్పటివరకూ గులాబీ బాస్ కార్యాచరణలోకి దిగలేదు. జిల్లాల పర్యటనకు దూరంగా ఉంటున్నారు. ఎప్పుడో ఒకరోజు హడావిడి చేయడం తర్వాత ప్రగతి భవన్‌కే పరిమితం కావడం కామన్ అయింది.
మరి కేసీఆర్ అనుకునేంతలా రాష్ట్రంలో బీఆర్ఎస్ మీద సానుకూలత ఉందా అంటే.. టక్కున అవును అనే పరిస్థితి కనిపించడం లేదు. నిరుద్యోగులు, రైతులు, మహిళలు.. అన్ని సామాజికవర్గాల్లో అసంతృప్తి ఉందని పలు సమయాల్లో బయటపడుతూనే ఉంది. బీఆర్ఎస్ తరపున ఇప్పుడు కేటీఆర్, హరీష్ మాత్రమే జిల్లాల్లో కనిపిస్తున్నారు. కేసీఆర్ మొత్తం ప్రగతిభవన్‌కే పరిమితం అవుతున్నారు. టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చిన తర్వాత.. ఆయన మొత్తం జాతీయ రాజకీయాల మీద నజర్ పెడుతున్నారు. బీఆర్ఎస్ ఫేస్ అయినా.. ఫేట్ అయినా.. కేసీఆర్ మాత్రమే ! అలాంటిది ఆయన మౌనంగా ఉండడం.. బీఆర్ఎస్ శ్రేణులను టెన్షన్ పెడుతోంది.
ప్రభుత్వ వ్యతిరేక ఓటును కాంగ్రెస్, బీజేపీలు చీల్చుకుంటే సులువుగా మూడోసారి అధికారంలోకి రాగలమన్న ఓవర్ కాన్ఫిడెన్స్‌లో కేసీఆర్ కనిపిస్తున్నారనే చర్చ జరుగుతోంది. టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ, పదో తరగతి ప్రశ్నా పత్రాల లీకేజీలు ప్రభుత్వం ఇమేజ్‌ను డ్యామేజీ చేశాయ్. ఉద్యోగులు, నిరుద్యోగులు కూడా సంతృప్తికరంగా లేరు. ఆ విషయం తెలిసినా రెండు పార్టీలు వ్యతిరేక ఓటు చీల్చుకుంటే అనుకూల ఓటుతో గెలుపొందుతామన్న ధోరణి కేసీఆర్‌లో కనపడుతోందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్. మౌనం మంచి చేస్తుంది నిజమే.. ఐతే అదే మౌనం చాలాసార్లు ముంచేస్తుది. రాజకీయాల్లో ఎక్కువసార్లు జరిగేది ఇదే ! కేసీఆర్‌కు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇది. క్షేత్రస్థాయిలో పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ఆయన అడుగులు వేయాల్సిన అవసరం ఉందని చాలామంది నుంచి అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయ్.