T CONGRESS: తెలంగాణలో ఎన్నికల భేరీ మోగింది. ఇప్పటివరకు ఒక లెక్క.. ఇకపై ఒక లెక్క.. మేమొస్తున్నాం అంటూ జనాల్లోకి దూసుకెళ్లేందుకు సిద్ధం అవుతున్నాయ్ పార్టీలు. కారు పార్టీ ఇప్పటికే స్పీడ్ పెంచగా.. కాంగ్రెస్, బీజేపీ మాత్రం బహిరంగ సభలకు మాత్రమే పరిమితం అయ్యాయ్. నవంబర్ 30న ఎన్నికలు.. అంటే లెక్కేసి కొడితే.. 50రోజులు కూడా లేదు సమయం. దీంతో ప్రతీ పార్టీ అలర్ట్ అయింది. బీఆర్ఎస్, బీజేపీ సంగతి ఎలా ఉన్నా.. తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తోంది.
తగ్గి అయినా సరే నెగ్గి తీరాలని ఫిక్స్ అయింది. ఇలాంటి సమయంలో హస్తం పార్టీని ఫ్యామిలీ పాలిటిక్స్ ఇబ్బంది పెడుతున్నాయ్. ఉదయ్‌పూర్ డిక్లరేషన్ ప్రకారం.. ఒక ఫ్యామిలీ నుంచి ఒకరికే టికెట్ అని ఉన్నా.. తెలంగాణలో సీనియర్లు మాత్రం మాట వినడం లేదు. ఈ నేపథ్యంలో టికెట్ రాకపోతే.. ఎవరు ఏం చేస్తారో అనే టెన్షన్ ఆ పార్టీని వెంటాడుతోంది. మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజుర్‌నగర్ నుంచి.. అయన సతీమణి పద్మావతి కోదాడ నుండి పోటీలో ఉన్నారు. ఇక మరో సీనియర్ నేత జానారెడ్డి ఎంపీ స్థానంలో పోటీలో ఉంటానని.. తన ఇద్దరు కుమారులు జైవీర్ రెడ్డికి నాగార్జునసాగర్, రఘువీర్ రెడ్డికి మిర్యాలగూడ స్థానాలు కావాలని కోరుతున్నారు. దామోదర రాజనర్సింహ.. అయన కుమార్తె త్రిష ఇద్దరూ.. టికెట్ ఆశిస్తున్నారు. ములుగు నుంచి సీతక్క పోటీకి సిద్ధం అవుతుంటే.. తన కుమారుడు సూర్యకి పినపాక టికెట్ ఆశిస్తున్నారు. మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్.. తనతో పాటు తన కుమారుడు అనిల్ కుమార్ యాదవ్‌కు ముషీరాబాద్ టికెట్ కోరుతున్నారు.
ఇక అటు కొండా మురళి, కొండా సురేఖ.. భార్యభర్తలు ఇద్దరూ టికెట్ ఆశిస్తున్నారు. ఈ మధ్యే పార్టీలో చేరిన మైనంపల్లి హన్మంతరావు కూడా.. తనతో పాటు తన కుమారుడికి టికెట్ కన్ఫార్మ్ కావడంతోనే హస్తం గూటికి చేరుకున్నారు. ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్, ఆమె భర్త శ్యామ్ నాయక్‌కు టికెట్లు కన్ఫార్మ్ అయినట్లు తెలుస్తోంది. ఇదే ఇప్పుడు పార్టీలో కొత్త అలజడికి కారణం అవుతోంది. ఒక్కో కుటుంబానికి రెండేసి టికెట్లు ఇస్తే.. ఇప్పటికే ఆశలు పెట్టుకొని క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న నేతల్లో వ్యతిరేకత వచ్చే చాన్స్ ఉంటుంది. మైనంపల్లి చేరికతో కాంగ్రెస్‌కు ఇద్దరు కీలక నేతలు దూరం అయ్యారు. అలాంటిది ఇప్పుడు ఒక్క కుటుంబానికి రెండు టికెట్లు ఇస్తే పరిస్థితి ఏంటన్న ఆలోచనే కాంగ్రెస్‌లో భయం పుట్టిస్తోంది.