T CONGRESS: కాంగ్రెస్ అంటే కలగూర పంచాయితీ అనే పేరు ఉంది. కలిసి వస్తారో లేదో తెలియదు కానీ.. గ్రూపులుగా కలిసి పోరాడడంలో కాంగ్రెస్ తర్వాతే ఎవరైనా..! అలాంటి కాంగ్రెస్‌లో అనూహ్యమైన మార్పు కనిపిస్తోంది. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా అంతా కలిసి నడుస్తున్నారు. కాదు.. కాదు.. నడిచినట్లు కనిపిస్తున్నారు. టికెట్ల వ్యవహారంలో ఆలస్యం జరగడంతో.. ఇప్పుడు కాంగ్రెస్ మీద మరిన్ని అనుమానాలు కలుగుతున్నాయి. 115 మంది అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్.. ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేశారు. ఐతే కాంగ్రెస్ నుంచి వెంటనే ఓ లిస్ట్ కనిపిస్తుంది అనుకుంటే.. సాగదీత ధోరణి కనిపిస్తోంది. అప్లికేషన్స్ అని ఒకసారి.. లిస్ట్ అధిష్టానానికి పంపాలి అని మరోసారి.. 9 కండిషన్స్ అని ఇంకోసారి.. ఇలా మొదటి జాబితా ఇప్పటి వరకు బయటకు రాలేదు.
బలమైన అభ్యర్ధులని నిలబెట్టి గెలవడమే లక్ష్యంగా.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తోంది. ఇప్పటికే అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కూడా తీసుకుంది. ఇప్పుడు వాటిని స్క్రీనింగ్ కమిటీ పరిశీలిస్తుంది. అయితే 119 సీట్లకు దాదాపు వెయ్యి మందికి పైనే అప్లికేషన్లు పెట్టుకున్నారు. దీంతో అభ్యర్ధుల ఎంపిక పెద్ద తలనొప్పిగా మారింది. ఇప్పటికే స్క్రీనింగ్ కమిటీ అభ్యర్ధులని ఫైనల్ చేసే పనిలో పడింది. ఇలాంటి పరిస్థితుల్లో 35 సీట్లకు ఒక్కో అభ్యర్ధిని ఫైనల్ చేశారని తెలుస్తోంది. అంటే సీనియర్ నేతలు ఉన్న చోట.. వారికే సీట్లు ఫిక్స్ చేసినట్లు టాక్. ఆ 35 సీట్లలో ఎలాంటి ఇబ్బందులు లేవని తెలుస్తోంది. ఐతే మిగిలిన సీట్లలోనే రచ్చ ఎక్కువ ఉంది. ఆ సీట్లని ఎంపిక చేయడం స్క్రీనింగ్ కమిటీకి పెద్ద తలనొప్పిగా మారుతోంది. ఒక్కో సీటులో ఇద్దరు, ముగ్గురు నేతలని ఫైనల్ చేసి.. అధిష్టానానికి పంపుతారని తెలిసింది. ఇంకా వారే సీట్లని ఫైనలైజ్ చేస్తారని సమాచారం. ఇప్పటికే చాలామంది సీట్లపై ఆశలు పెట్టుకున్నారు.
ఇంకా సీట్లు దక్కని వారు ఏం చేస్తారనేది పెద్ద ప్రశ్నగా ఉంది. ఇదే ఇప్పుడు కాంగ్రెస్‌ను భయపెడుతోంది. అటు బిఆర్‌ఎస్ పార్టీలో సీట్లు దక్కని కొందరు నేతలు కాంగ్రెస్ వైపు రావడానికి రెడీగా ఉన్నారు. ఆ దిశగా చర్చలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్‌లోకి వచ్చే నేతలకు సీట్లు కూడా ఇస్తారని తెలుస్తోంది. ఇప్పటికే బిఆర్‌ఎస్ సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్‌లోకి రావడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఐతే ఇటు వచ్చే నేతలు ఉన్నా సరే.. రేపు కాంగ్రెస్‌లో సీట్లు దక్కని వారు జంప్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అసలే వెయ్యి మందికి పైగా సీట్లు ఆశించే వారు ఉన్నారు. అలాంటప్పుడు సీటు దక్కని వారు ఏం చేస్తారనేది పెద్ద ప్రశ్న. ఇదే ఇప్పుడు హస్తం పార్టీ పెద్దల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తోంది.