Telangana Congress: కాంగ్రెస్ పార్టీలో మళ్లీ ముసలం.. ఉత్తమ్ పార్టీ మార్పుపై సోషల్ మీడియాలో ప్రచారం..!

తెలంగాణలో కాంగ్రెస్ నేతల మధ్య ఇంకా గొడవలు సాగుతున్నాయి. పార్టీని బలోపేతం చేయడంపై దృష్టిపెట్టాల్సిన నాయకులు అంతర్గత కుమ్ములాటలతో బిజీగా ఉన్నట్లు కనిపిస్తోంది. తన పార్టీకి చెందిన వారిపైనే కాంగ్రెస్ సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు చేయడమే ఇందుకు నిదర్శనం.

  • Written By:
  • Publish Date - May 16, 2023 / 05:51 PM IST

Telangana Congress: ఒక పక్క కర్ణాటకలో కాంగ్రెస్ భారీ మెజారిటీతో గెలిచి దేశవ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులంతా సంబరాల్లో ఉంటే.. తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ నేతల మధ్య ఇంకా అవే గొడవలు సాగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీని బలోపేతం చేయడంపై దృష్టిపెట్టాల్సిన నాయకులు అంతర్గత కుమ్ములాటలతో బిజీగా ఉన్నట్లు కనిపిస్తోంది. తన పార్టీకి చెందిన వారిపైనే కాంగ్రెస్ సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు చేయడమే ఇందుకు నిదర్శనం. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సోషల్ మీడియాలో నేతల మధ్య పరోక్ష యుద్ధం నడుస్తోంది.

ఒక వర్గానికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌లోని మరో వర్గం సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తోంది. దీనిలో భాగంగా కొద్ది రోజులుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ మారబోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. దీంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడుతూ ప్రచారం చేస్తున్నారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనికి సంబంధించి అనుమానితుల మొబైల్ నెంబర్లు కూడా ఇచ్చారు. వీటి ఆధారంగా సోమవారం రాత్రి సైబర్ క్రైమ్ పోలీసులు కాంగ్రెస్ వార్ రూమ్‌పై దాడి చేశారు. ఉత్తమ్ ఇచ్చిన నెంబర్ యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా ఇంచార్జి ప్రశాంత్‌ది అని పోలీసులు గుర్తించారు. అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డిపై జరుగుతున్న ప్రచారం సొంత నాయకుల పనే అని పోలీసులు తేల్చారు. కాంగ్రెస్ వార్ రూమ్‌ అంటే ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం అనే సంగతి తెలిసిందే. ఉత్తమ్ ఫిర్యాదు, ఫోన్ నెంబర్ వంటి ఆధారాల ద్వారా పోలీసులు కాంగ్రెస్ వార్ రూమ్ సీజ్ చేశారు. పోలీసుల తీరుపై యూత్ కాంగ్రెస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

వ్యక్తిగతంగా పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాల్సింది పోయి.. మొత్తం వార్ రూమ్ సీజ్ చేయడం ఏంటని నేతలు ప్రశ్నిస్తున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డిపై జరుగుతున్న ప్రచారానికి, యూత్ కాంగ్రెస్‌కు సంబంధం లేదని అధ్యక్షుడు శివ సేన అన్నారు. గతంలో కూడా కాంగ్రెస్‌ నేతల మధ్య సోషల్ మీడియా వార్ జరిగింది. అంటే సొంత పార్టీ నేతలే తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అప్పట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి, వీహెచ్ వంటి వాళ్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. అలాంటివారిపై కేసులు పెట్టాల్సిందిగా డిమాండ్ చేశారు. పార్టీ అంతర్గత సమావేశాల్లో దీనిపై చర్చించారు. నేతల మధ్య వాడివేడి చర్చ జరిగింది. ఇప్పుడు మళ్లీ ఈ అంశం తెరమీదకు వచ్చింది. దీంతో పార్టీలో నేతల మధ్య ముసలం మొదలైనట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ మరింత బలపడే అవకాశం ఉన్న ఈ దశలో నేతల మధ్య పంచాయితీ ఆ పార్టీకి నష్టం చేస్తుందనడంలో సందేహం లేదు.