Telangana Congress: డిక్లరేషన్లు సరే.. కుమ్ములాటల సంగతేంటి? కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చే ఉద్దేశం నేతలకు లేదా?

కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అంటూ ఉంటారు ఆ పార్టీ నేతలు. అది ప్రజాస్వామ్యం కాదు.. క్రమశిక్షణ లేకపోవడం అంటూ విమర్శిస్తుంటాయి ప్రతిపక్షాలు. కాంగ్రెస్ పార్టీని ఎవరూ ఓడించక్కర్లేదు.. వాళ్లను వాళ్లే ఓడించుకుంటారు అంటూ జోకులు వేస్తారు ఇతర పార్టీల నేతలు. ఇది నిజమే.

  • Written By:
  • Publish Date - May 9, 2023 / 04:36 PM IST

Telangana Congress: కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తెలంగాణపై ఫోకస్ చేసింది. కర్ణాటక ఎన్నికల తర్వాత తెలంగాణపై మరింత ఫోకస్ పెట్టబోతున్నట్లు ఆ పార్టీ సీనియర్ నేతలు ప్రకటించారు. ఎందుకంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. ఇందుకోసం ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు ఆరంభించింది. తాజాగా యూత్ డిక్లరేషన్ ప్రకటించింది. అంతకుముందు రైతు డిక్లరేషన్ కూడా ప్రకటించారు. అయితే, ఈ డిక్లరేషన్లే కాంగ్రెస్‌ను అధికారంలోకి తెస్తాయనుకుంటే భ్రమే. ఎందుకంటే పార్టీని ముంచుతోంది అంతర్గత కుమ్ములాటలే. ఒకరిని ఇంకొకరు దెబ్బ తీసుకుంటూ.. అంతిమంగా పార్టీకి వెన్నుపోటు పొడుస్తున్నారు. పార్టీని చక్కదిద్దుకోకుండా ఎన్ని డిక్లరేషన్లు ప్రకటించినా లాభం లేదంటున్నారు విశ్లేషకులు.
కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అంటూ ఉంటారు ఆ పార్టీ నేతలు. అది ప్రజాస్వామ్యం కాదు.. క్రమశిక్షణ లేకపోవడం అంటూ విమర్శిస్తుంటాయి ప్రతిపక్షాలు. కాంగ్రెస్ పార్టీని ఎవరూ ఓడించక్కర్లేదు.. వాళ్లను వాళ్లే ఓడించుకుంటారు అంటూ జోకులు వేస్తారు ఇతర పార్టీల నేతలు. ఇది నిజమే. ఎందుకంటే ఆ పార్టీని వాళ్లే ఓడించుకుంటారు. పార్టీలో ప్రజాస్వామ్యం, భావప్రకటనా స్వేచ్ఛ పేరుతో ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటారు. ఒకరి కార్యక్రమాలకు ఇంకొకరు డుమ్మా కొడతారు. ఎవరిదారి వారిదే అన్నట్లు ఉంటుంది ఒక్కోసారి వ్యవహారం. మనం బాగుపడకపోయినా పర్లేదు.. కానీ, పక్కోడు మాత్రం బాగుపడకూడదు అన్నట్లుంటుంది ఒక్కోసారి నేతల పరిస్థితి.

చివరకు పార్టీకి లాభం కలుగుతుంది అనుకున్నా సరే.. కలిసి పని చేయడానికి ఇష్టపడరు. విబేధాలు పక్కనబెట్టి కలిసేందుకు ఇష్టపడరు. నాయకుడు చెప్పినట్లు వినరు. తమదారి తమదే అంటూ ప్రవర్తిస్తుంటారు. ఇలా నేతల మధ్య ఆధిపత్య పోరు సాధారణం. ఇక పార్టీని నియోజకవర్గంలోనే గెలిపించడం చేతకానోళ్లు కూడా రాష్ట్రంలో అధికారంలోకి తెస్తాం అంటూ ప్రగల్భాలు పలుకుతారు. రాష్ట్ర స్థాయి నేతలం తామే అంటూ బిల్డప్ ఇచ్చుకుంటారు. ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడటం తెలీదు. ప్రజా సమస్యలపై అవగాహన ఉండదు. ఇలాంటి ఎన్ని లోపాలున్నా.. తామే పార్టీలో గొప్ప అనిపించుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇలా చెప్పుకొంటూ పోతే కాంగ్రెస్ వైఫల్యాలు బోలెడు. ఇలాంటి స్థితిలోనూ అధికారంలోకి వస్తామనే ధీమా. పైగా దీనికి ఏవేవో ప్రయత్నాలు.


డిక్లరేషన్లపై ధీమా సరిపోతుందా?
రైతులకు, యువతకు మేలు చేసేలా రైతు డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్ అంటూ ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. రైతులకు మద్దతు ధర, నిరుద్యోగ యువతకు రుణాలు, భృతి వంటి పథకాల్ని బోలెడన్ని ప్రకటించేశారు. అధికారంలోకి వస్తే ఇవన్నీ చేస్తామని హామీ ఇచ్చేశారు. సరే.. జనాలు కూడా నమ్మేస్తారేమో. అయితే, పార్టీ గెలిచేస్తుందా? పార్టీ గెలవాలంటే నాయకులు కలిసికట్టుగా పనిచేయాలి. పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. నాయకులంతా ఒక్కతాటిపైకి రావాలి. అందరూ కలిసి ప్రభుత్వంపై పోరాడాలి. ఒకరికొకరు అండగా నిలవాలి. అప్పుడే గెలుపు సాధ్యం. కానీ, స్వేచ్ఛ ఎక్కువైన కాంగ్రెస్‌లో ఇలాంటివి ఊహించడం అసాధ్యం. ఎందుకంటే వాళ్లకు పార్టీకన్నా తామే గొప్ప అని.. ఇతర లీడర్లకన్నా తామేం తక్కువ అనే ఫీలింగ్. ప్రభుత్వంపై పోరాటం చేసి గెలవడంకన్నా.. తమ పార్టీ నాయకుడిపై గెలవడమే ముఖ్యం అనుకుంటారు. దీంతో గ్రూపులుగా ఏర్పడ్డ కాంగ్రెస్ నేతలు వాళ్లను వీళ్లు.. వీళ్లను వాళ్లు తిట్టుకుంటూ కాలక్షేపం చేస్తుంటారు.
సరిదిద్దకపోతే నష్టమే..!
సరిగ్గా కష్టపడితే కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి వచ్చే అవకాశాల్ని కొట్టిపారేయలేం. బీఆర్ఎస్, బీజేపీని ధీటుగా ఎదుర్కోగల సత్తా కాంగ్రెస్‌కు ఉంది. రాష్ట్రంలో బీఆర్ఎస్‌పై ప్రజల్లో వ్యతిరేకత ఉంది. మోదీపై కూడా కొన్ని వర్గాల్లో అసంతృప్తి ఉంది. ఇలాంటప్పుడు అందరూ కలిసి పని చేస్తే అధికారం ఖాయం. కానీ, అంతర్గత కుమ్ములాటలతో నేతలు కాంగ్రెస్‌ను దెబ్బతీస్తున్నారు. నేతలు ఇకనుంచైనా తమ ఇగోలు పక్కనబెట్టి పార్టీ కోసం కృషి చేయాలి. అధికారమే లక్ష్యంగా ముందడుగు వేయాలి. లేకుంటే మరో ఐదేళ్లు ప్రతిపక్షంలోనే ఉంటూ.. ఒకరినొకరు తిట్టుకోవడానికే టైం సరిపోతుంది. అధిష్టానం కూడా ఈ అంశంపై దృష్టి పెట్టాలి. నేతల మధ్య సమన్వయం కుదర్చాలి. పార్టీ హైకమాండ్ నిర్ణయానికి వ్యతిరేకంగా ఎవరూ గొంతెత్తకుండా చూసుకోవాలి.