Telangana: అంతా ఈడీ మయం..!

తెలంగాణ ఈడీ అడ్డాగా మారిపోతోంది. రకరకాల కేసులు రకరకాల వివాదాలు అన్నీ అటూ ఇటూ తిరిగి ఈడీ దగ్గరే ఆగుతున్నాయి. లిక్కర్ కేసు, డేటా లీక్ కేసు, టీఎస్‌పీఎస్‌సీ కేసు ఇలా ఒకటేమిటి అన్నీ కూడా ఈడీ చేతుల్లోకే చేరుతున్నాయి.

  • Written By:
  • Publish Date - April 3, 2023 / 09:30 PM IST

తెలంగాణలో కలకలం రేపిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజ్ వివాదంపై ఇప్పటికే సిట్ విచారణ చేస్తుండగా తాజాగా ఆ కేసుపై ఈడీ రంగంలోకి దిగింది. అందుబాటులో ఉన్న పబ్లిక్ డొమైన్‌లో ఉన్న ఆధారాలతో ఈడీ కేసు నమోదు చేసింది. పేపర్ లీక్‌పై సిట్‌తో పాటుగా ఈడీ విచారణ జరగబోతోంది. పేపర్ లీక్‌లో హవాలా మార్గం ద్వారా నగదు లావాదేవీలు జరిగినట్లుగా ఈడీ అనుమానిస్తోంది. ఈ కేసులో అరెస్టైన 15మందిని ఈడీ ప్రశ్నించనుంది. అవసరమైతే కమిషన్ సభ్యులు, సెక్రటరీని కూడా విచారించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇటు తెలంగాణలో మరో కేసులోనూ ఈడీ దూకుడు చూపిస్తోంది. డేటా లీక్ కేసుకు సంబంధించి ఇప్పటికే కేసు నమోదు చేసింది. కొన్ని కోట్ల మంది డేటా దొంగతనానికి సంబంధించి తెలంగాణ పోలీసులు ఇటీవలే పెద్ద బ్రేక్ త్రూ సాధించింది. దీన్ని కూడా ఈడీ తన చేతుల్లోకి తీసుకోనుంది. బ్యాంకులతో పాటు పలు సంస్థలకు నోటీసులు ఇవ్వనుంది ఈడీ.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత ఆరోపణలు ఎదుర్కొంటున్న లిక్కర్ స్కామ్‌లోనూ ఈడీ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే కవితను మూడుసార్లు ప్రశ్నించింది. ఆమె సుప్రీంకోర్టుకు వెళ్లడంతో ప్రస్తుతానికి వెయిట్ అండ్ సీ పాలసీని అవలంభిస్తోంది. సుప్రీం తీర్పును బట్టి కవిత కేసులో ఈడీ నెక్స్ట్ స్టెప్ ఏంటన్నది తెలుస్తుంది. తెలంగాణకు చెందిన పలువురు ఇప్పటికే ఈ కేసులో అరెస్టయ్యారు. అరుణ్ రామచంద్ర పిళ్లై, శరత్ చంద్రారెడ్డి, అభిషేక్ బోయినపల్లి ఇలా చాలామంది లిక్కర్ కేసులో బుక్కయ్యారు. కవితను కూడా అరెస్ట్ చేస్తారన్న ప్రచారం జరిగింది.

పబ్లిక్ సర్వీస్ కమిషన్ గొడవకు సంబంధించి ఈడీ ఎంట్రీనే ఆసక్తిని రేపుతోంది. డేటా లీక్ కేసు అంటే కోట్లమందికి సంబంధించిన వ్యవహారం కాబట్టి ఓకే. కానీ పబ్లిక్ సర్విస్ కమిషన్ కేసులో మాత్రం కోట్లలో లావాదేవీలు జరిగనట్లు లేవు.. ఈడీ జోక్యం చేసుకోదగ్గ స్థాయిలో నగదు చేతులు మారిందా అన్నదానిపై ఇప్పటికే క్లారిటీ లేదు. సిట్ చెబుతున్న ప్రకారం అయితే ఇప్పటికి దొరికిన నగదు 4లక్షల రూపాయలు మాత్రమే. డబ్బులు ఇచ్చామని మరికొందరు చెబుతున్నా అది మహా అయితే లక్షల్లో ఉంటుంది. ఇలాంటి కేసులో ఈడీ జోక్యం చేసుకోవడమే ఆశ్చర్యాన్ని కల్పిస్తోంది. పోనీ విదేశాలకు నగదు తరలించే స్థాయిలోనూ లావాదేవీలు జరిగినట్లు కనిపించడం లేదు.

లిక్కర్ కేసులో కవిత ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అలాగే పేపర్ లీక్ కేసులో మంత్రి కేటీఆర్‌పై బండి సంజయ్ ఆరోపణలు చేస్తున్నారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడికి ప్రగతిభవన్‌లోని ఓ అధికారితో సంబంధం ఉందని చెబుతున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా కేటీఆర్ టార్గెట్‌గా పలు ఆరోపణలు చేశారు. ఈ సమయంలో ఈడీ ఎంట్రీ ఇవ్వడం చూస్తుంటే దాని వెనక వేరే కథ ఉన్నట్లే కనిపిస్తోంది. ఇదే కాదు పలు కేసుల విషయంలోనూ ఈడీ రంగంలోకి దిగింది. రియల్ ఎస్టేట్, ఫార్మా ఇటు పలు కేసుల విషయంలో ఈడీ ఎంట్రీ ఇచ్చింది. నిజానికి ఈడీ చాలా కేసుల్లో విచారణ చేస్తోంది. దానికి ఉన్న కేసుల విచారణకే ఉక్కిరిబిక్కిరి అవుతోంది. అలాంటిది ఓ చిన్న కేసు విషయంలోకి రంగం దిగడమే ఇంట్రస్టింగ్‌గా ఉంది.

ఈ కేసులన్నీ హైదరాబాద్ చుట్టూనే తిరుగుతున్నాయి. ఇప్పుడిదే రాజకీయంగా ఆసక్తిని రేపుతోంది. కేంద్రం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. తమ రాజకీయ ప్రత్యర్థులను భయపెట్టడానికి వాటిని ఆయుధంగా వాడుకుంటోందని విమర్శిస్తున్నాయి. బీఆర్ఎస్ కూడా ఆ జాబితాలో ఉంది. కేంద్రంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. లిక్కర్ కేసు, పేపర్ లీక్ కేసు ఇవన్నీ బీఆర్ఎస్‌ను ఉక్కిరిబిక్కిరి చేసేవే.. అలాగే కొన్ని సంస్థలపై జరుగుతున్న ఈడీ దాడులు కూడా బీఆర్ఎస్ లక్ష్యంగా జరుగుతున్నట్లే ఆరోపణలున్నాయి. కొంతమంది బీఆర్ఎస్ నేతలకు కూడా ఈడీ కొన్ని కేసుల్లో సమన్లు ఇచ్చింది. మొత్తంగా చూస్తే ఈడీ అన్ని వైపుల నుంచి ఉచ్చు బిగిస్తున్నట్లే కనిపిస్తోంది. చూడాలి ఈడీ విచారణలు ఏ తీరానికి చేరతాయో..!