CM KCR Vs Governor: గవర్నర్ వర్సెస్ సీఎం.. తెలంగాణలో ఈ పంచాయితీ తేలేదెప్పుడు?

గవర్నర్, కేసీఆర్ మధ్య విబేధాలు మరోసారి బయటపడ్డాయి. తాజాగా నూతన సెక్రటేరియట్ ప్రారంభోత్సవానికి గవర్నర్‌కు తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానం పంపలేదు. గత నెలలో అంబేద్కర్ విగ్రహావిష్కరణకు కూడా ఆమెకు ఆహ్వానం అందలేదు.

  • Written By:
  • Publish Date - May 4, 2023 / 04:52 PM IST

CM KCR Vs Governor: తెలంగాణలో గవర్నర్ వర్సెస్ సీఎం పంచాయితీ కొనసాగుతూనే ఉంది. తెలంగాణకు సంబంధించి అనేక అంశాల్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సీఎం కేసీఆర్ మధ్య చాలా కాలంగా విబేధాలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ కార్యక్రమాలకు గవర్నర్‌కు కేసీఆర్ ప్రభుత్వం ఆహ్వానం పంపడం లేదు. పాలనకు సంబంధించి చాలా విషయాల్లో ప్రభుత్వాన్ని గవర్నర్ వ్యతిరేకిస్తున్నారు. దీంతో గవర్నర్ వర్సెస్ కేసీఆర్, గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్ అన్నట్లుగా తెలంగాణలో వ్యవహారం ముదిరింది.
గవర్నర్, కేసీఆర్ మధ్య విబేధాలు మరోసారి బయటపడ్డాయి. తాజాగా నూతన సెక్రటేరియట్ ప్రారంభోత్సవానికి గవర్నర్‌కు తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానం పంపలేదు. గత నెలలో అంబేద్కర్ విగ్రహావిష్కరణకు కూడా ఆమెకు ఆహ్వానం అందలేదు. ఇలా చాలా సందర్భాల్లో గవర్నర్‌కు ప్రభుత్వం ఆహ్వానం పంపకుండా అవమానిస్తోంది. గవర్నర్ హాజరయ్యే కార్యక్రమాలకు సీఎం కేసీఆర్, మంత్రులు, ప్రజా ప్రతినిధులు దూరంగా ఉంటున్నారు. చివరకు ప్రొటోకాల్ పాటించాల్సిన అధికారులు కూడా గవర్నర్‌ను పట్టించుకోవడం లేదు. మరోవైపు ప్రభుత్వ నిర్ణయాల్ని చాలా వరకు గవర్నర్‌ వ్యతిరేకిస్తున్నారు. గవర్నర్ ఆమోదం కావాల్సిన అనేక బిల్లుల్ని తమిళిసై తన వద్ద పెండింగ్‌లో ఉంచారు. ఈ అంశంపైనా ప్రభుత్వానికి, గవర్నర్‌కు మధ్య పోరు నడుస్తోంది. పలు సందర్భాల్లో గవర్నర్‌పై ప్రభుత్వం విమర్శలు చేస్తుంటే, ప్రభుత్వంపై గవర్నర్ విమర్శలు చేసుకున్నారు. ఈ వివాదం బహిరంగంగానే కొనసాగుతోంది.
ఎలా మొదలైంది?
2019లో తమిళిసై తెలంగాణ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు. అప్పటినుంచి కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాల్ని ఆమె వ్యతిరేకించడం మొదలుపెట్టారు. దీంతో నెమ్మదిగా ఇరువురి మధ్య విబేధాలు పెరుగుతూ వచ్చాయి. ప్రారంభంలో విబేధాలున్నప్పటికీ అవసరమైన సందర్భంలో కలిసి పని చేసేవాళ్లు. అయితే, రానురానూ వివాదాలు పెద్దవయ్యాయి. దీంతో గవర్నర్‌ను కేసీఆర్ పూర్తిగా పక్కనబెట్టారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా నామమాత్రంగానే ఆహ్వానం పంపడం మొదలుపెట్టారు కేసీఆర్. అసెంబ్లీ సమావేశాల్లో ప్రసంగం, ఎట్ హోం కార్యక్రమం, స్వాతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం వంటి సందర్భాల్లో కూడా కలుసుకోలేనంతగా విబేధాలు ఎక్కువయ్యాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు నేరుగా తమిళిసైపై విమర్శలు చేయడం ప్రారంభించారు. దీంతో గవర్నర్ కూడా వారికి ధీటుగా బదులిస్తూ వస్తున్నారు.
రాజ్యాంగ పదవి రాజకీయంగా మారిందా?
గవర్నర్ పదవి రాజ్యాంగబద్ధమైంది. అయితే, తెలంగాణ సహా అనేక రాష్ట్రాల్లో గవర్నర్లు రాజకీయనేతల్లా ప్రవర్తిస్తున్నారని విమర్శలొస్తున్నాయి. తెలంగాణతోపాటు తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, పంజాబ్, ఢిల్లీ గవర్నర్లపై ఇలాంటి విమర్శలు వచ్చాయి. గవర్నర్‌ తమిళిసై వైఖరిని కేసీఆర్ అనేకసార్లు తప్పుబట్టారు. ప్రభుత్వానికి సహకరించడం లేదన్నారు. ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వ నిర్ణయాల్ని వ్యతిరేకించడం, బిల్లులకు ఆమోదం తెలపకపోవడం వంటి చర్యలకు పాల్పడుతున్నారని కేసీఆర్, బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. ఎందుకంటే ప్రభుత్వం ఆమోదించిన అనేక కీలక బిల్లులు ఇంకా గవర్నర్ వద్ద పెండింగులో ఉన్నాయి. ఈ వివాదం సుప్రీంకోర్టుకు కూడా చేరింది. గవర్నర్ రాజ్యాంగబద్ధంగా వ్యవహరించకుండా, బీజేపీ కార్యకర్తలా ప్రవర్తిస్తున్నారని బీఆర్ఎస్ విమర్శించింది. అయితే, బీఆర్ఎస్ ఆరోపణల్ని తమిళిసై కొట్టిపారేశారు. తాను రాజ్యాంగబద్ధంగానే వ్యవహరిస్తున్నట్లు, కేసీఆర్ ప్రభుత్వం తనను కావాలనే ఇబ్బంది పెడుతోందని ఆమె విమర్శించారు.
దేశాధినేతల్ని కలవొచ్చు కానీ సీఎంను కలవలేం: గవర్నర్
సందర్భం దొరికినప్పుడల్లా గవర్నర్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తుంటారు. తాజాగా తమిళిసై మాట్లాడుతూ దేశాధినేతల్ని అయినా కలవొచ్చు కానీ, తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కలవలేమని వ్యాఖ్యానించారు. రాజ్ భవన్‌కు, ప్రగతి భవన్‌కు మధ్య చాలా గ్యాప్ ఉందన్నారు. అంబేద్కర్ జయంతి, విగ్రహావిష్కరణ వేడుకలు, నూతన సచివాలయ ప్రారంభ వేడుకలకు తనను కావాలనే ఆహ్వానించలేదని, పైగా తానే రాలేదన్నట్లు ప్రచారం చేస్తున్నారని తమిళిసై అన్నారు. అధికారులు ప్రొటోకాల్ కూడా పాటించకుండా తనను ఇబ్బంది పెడుతున్నారని గవర్నర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై కేంద్రానికి ఆమె నివేదిక కూడా పంపించారు.
ముగింపు ఎప్పుడు?
గవర్నర్, కేసీఆర్ మధ్య ఇప్పుడప్పుడే విబేధాలు సమసిపోయే అవకాశం కనిపించడం లేదు. ఎప్పటికప్పుడు విబేధాలు పుట్టుకొస్తున్నాయే తప్ప.. సమస్య పరిష్కారమై సయోధ్య కుదరడం లేదు. ఇరువురూ ఈ దిశగా ప్రయత్నాలు కూడా చేయడం లేదు. ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకే ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ గవర్నర్‌గా తమళిసై ఉన్నంతవరకు కేసీఆర్ ప్రభుత్వం ఇలా ఇబ్బందులు పెడుతూనే ఉంటుంది. అలాగని తమిళిసై కూడా వెనుకడుగు వేసే అవకాశం లేదు. ఆమె కూడా ఢీ అంటే ఢీ అంటూ ముందుకెళ్తున్నారు. ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. రానున్న రోజుల్లో ఈ వివాదం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.