Gadala Srinivasa Rao: కొత్తగూడెంలో మూడు ముక్కలాట.. ఎమ్మెల్యేగా పోటీకి సిద్ధమైన హెల్త్ డైరెక్టర్..?

ఇప్పటికే కొత్తగూడెంలో వనమా వెంకటేశ్వర రావు, జలగం వెంకట్రావు మధ్య ఎమ్మెల్యే వార్ నడుస్తోంది. ఈ సమయంలో గడల శ్రీనివాసరావు కూడా తాను కొత్తగూడెం నుంచే పోటీ చేయాలనుకోవడంతో కొత్తగూడెం రాజకీయం కీలక మలుపు తిరగబోతుంది.

  • Written By:
  • Publish Date - July 31, 2023 / 11:44 AM IST

Gadala Srinivasa Rao: తెలంగాణలోని కొత్తగూడెం నియోజకవర్గంలో రాబోయే ఎన్నికల్లో పోరు రసవత్తరంగా మారబోతుంది. అది కూడా బీఆర్ఎస్‌ నుంచే పోరు మొదలయ్యేలా ఉంది. కారణం.. ప్రస్తుతం తెలంగాణ హెల్త్ డైరెక్టర్‌గా కొనసాగుతున్న గడల శ్రీనివాస రావు కొత్తగూడెం నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనుకోవడమే. శ్రీనివాసరావు తన ఉద్యోగానికి రాజీనామా చేసి, రాజకీయాల్లోకి ప్రవేశించాలని చాలా కాలంగా భావిస్తున్నారు. దీనికి అనుగుణంగా రంగం సిద్ధం చేస్తున్నారు.

సీఎం కేసీఆర్, కేటీఆర్‌తో సత్సంబంధాలు కలిగి ఉండటం, సామాజిక సమీకరణాలు వంటి కారణాలతో.. ఆయన బీఆర్ఎస్‌లోనే చేరే అవకాశాలున్నాయి. అదే జరిగితే ఆయన కొత్తగూడెం నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఈ విషయాన్ని ఆయన ప్రకటించారు కూడా. ఇప్పటికే కొత్తగూడెంలో వనమా వెంకటేశ్వర రావు, జలగం వెంకట్రావు మధ్య ఎమ్మెల్యే వార్ నడుస్తోంది. ప్రస్తుతం అక్కడ వనమా వెంకటేశ్వర రావు బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఆయన కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్‌లో చేరారు. అయితే, ఇటీవలే ఆయన సభ్యత్వాన్ని రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. ఆయన తర్వాతి స్థానంలో నిలిచిన జలగం వెంకట్రావును ఎమ్మెల్యేగా ప్రకటించింది. ఆయన వనమా చేతిలోనే బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఒకవేళ ఇప్పుడు వనమా సభ్యత్వం రద్దై.. జలగం ఎమ్మెల్యేగా ఎన్నికైనా.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే కొనసాగుతారు. అంటే ఇప్పటికే ఎమ్మెల్యే పదవి కోసం వనమా, జలగం మధ్య వార్ నడుస్తోంది.

అదీ.. ఇద్దరూ బీఆర్ఎస్ తరఫునే. అలాంటిది ఇప్పుడు హెల్త్ డైరెక్టర్‌గా కొనసాగుతున్న శ్రీనివాసరావు కూడా ఆ పార్టీ తరఫునే రంగంలోకి దిగనుండటంతో కొత్తగూడెం ఎన్నిక రసవత్తరంగా మారుతుంది. ఆయనకు ఎమ్మెల్యే టిక్కెట్‌పై అధిష్టానం హామీ ఇచ్చి ఉండొచ్చని, అందుకే రాజకీయ ప్రవేశానికి సిద్ధమవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు జలగం వెంకట్రావు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారంపై ఉత్కంఠ నెలకొంది. తనతో ప్రమాణ స్వీకారం చేయించాలని ఆయన అసెంబ్లీ కార్యదర్శి, స్పీకర్‌ను కోరినప్పటికీ.. ఇంకా ప్రమాణం చేయించలేదు. ఈ విషయంలో బీఆర్ఎస్, స్పీకర్.. ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది. ప్రమాణ స్వీకారం చేస్తేనే జలగం ఎమ్మెల్యేగా ఎన్నికవుతారు. ఒకవేళ ఎన్నికైనప్పటికీ.. నాలుగైదు నెలలు మాత్రమే పదవిలో ఉండాల్సి వస్తుంది. ఈ సమయంలో గడల శ్రీనివాసరావు కూడా తాను కొత్తగూడెం నుంచే పోటీ చేయాలనుకోవడంతో కొత్తగూడెం రాజకీయం కీలక మలుపు తిరగబోతుంది.